Alcohol | మందు తాగడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?-what happens when you stop drinking alcohol ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  What Happens When You Stop Drinking Alcohol

Alcohol | మందు తాగడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Hari Prasad S HT Telugu
Feb 08, 2022 08:21 AM IST

ఇక మందు మానేయాలని ఒకవేళ మీరు డిసైడ్‌ అయితే అది మంచిదే. మందు మానేస్తే అసలు మన శరీరంలో వచ్చే మార్పులు ఏంటి? ఒక వారం, రెండు, మూడు వారాలు.. కొన్ని నెలలు, కొన్నేళ్ల పాటు మందు మానేస్తే ఏం జరుగుతుంది? ఇది తెలుసుకుంటే మీరు కూడా మందుకు గుడ్‌బై చెప్పాలని అనుకుంటారు.

మందు తాగడం మానేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
మందు తాగడం మానేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (pixabay)

Alcohol.. ఇది ఓ పరిమితితో తాగితే మంచిదే అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ లిమిట్‌ దాటితే మాత్రం చాలా ప్రమాదం. కొంతమంది ప్రతి రోజూ తాగుతారు. అది కూడా పరిమితి లేకుండా. ఇలాంటి వాళ్లకు భవిష్యత్తులో గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మరికొంత మంది కొన్నాళ్లు మానేస్తారు. తర్వాత అవకాశం వచ్చినప్పుడు ఒకేసారి చాలా ఎక్కువగా తాగేస్తుంటారు. ఇది కూడా డేంజరే. 

మందు మానేసిన తొలి వారంలో..

వరుసగా కొన్నేళ్ల నుంచి మీకు ప్రతి రోజూ మందు తాగే అలవాటు ఉండి సడెన్‌గా మానేద్దామని ఏ మంచి రోజో చూసుకొని డిసైడయ్యారని అనుకుందాం. ఆ సమయంలో శరీరంలో ఏం జరుగుతుంది? ముందుగా తొలి వారంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

తక్కువ కేలరీలు తీసుకుంటారు

మన శరీరానికి శక్తినిచ్చేవి కేలరీలే. అయితే వీటిని పరిమిత స్థాయిలో తీసుకుంటే ఏమీ కాదు. కానీ మీరు ఖర్చు చేసే కేలరీల కంటే తీసుకునే కేలరీలు ఎక్కువుంటేనే ప్రమాదం. ఆల్కహాల్‌లో ఈ కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందులోనూ బీర్‌ అయితే మరీ ఎక్కువ. ఒక్క బీర్‌ తాగారంటే 150 కేలరీలు మీ బాడీలోకి వెళ్లినట్లే. మీరు మందు మానేసిన తొలి వారంలో ఈ కేలరీలు తక్కువవుతాయి. దీంతో కొంతమంది బరువు తగ్గుతారు. ఎంత తగ్గుతారన్నది అంతకు ముందు వాళ్లు తీసుకునే మందు పరిమితిపై ఆధారపడి ఉంటుంది.

హాయిగా నిద్రపోతారు

కొంతమంది మందు మత్తు ఇస్తుంది కాబట్టి హాయిగా నిద్రపోవచ్చు అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. మందు తాగినప్పుడు పడుకోగానే నిద్ర పోయినట్లు అనిపిస్తుంది కానీ ఇది మీ రాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ నిద్రను తగ్గించేస్తుంది. అందుకే రాత్రిపూట మధ్యమధ్యలో మేల్కొంటారు. పైగా ఆల్కహాల్‌ డైయూరెటిక్‌ కావడంతో మూత్రం ఎక్కువగా వస్తుంది. ఇది కూడా నిద్రను దెబ్బతీస్తుంది. అందువల్ల మందు మానేసిన తొలి వారంలో మీరు సుఖంగా నిద్రపోతారు. మరీ ఎక్కువ తాగే అలవాటు ఉన్న వాళ్లకు ఇలా హాయిగా నిద్రపోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఒక్కోసారి ఏడాది కూడా పట్టవచ్చు.

రెండు నుంచి మూడు వారాల తర్వాత..

మందు తాగకుండా మీరు ఎలాగోలా తొలి వారం గడిపేశారు. ఇలాగే మరో రెండు, మూడు వారాలు గడిస్తే ఏం జరుగుతుంది? దీనివల్ల మరిన్ని సానుకూల మార్పులు మీ శరీరంలో కలుగుతాయి.

మెదడు పనితీరు మెరుగవుతుంది

మందు తాగినప్పుడు మెదడు పనితీరు మందగిస్తుంది. భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. పరిసరాలపై నియంత్రణ కోల్పోతాం. కొన్ని మరచిపోతుంటాం. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. అయితే మందు మానేసిన రెండు, మూడు వారాల్లోనే మీ మెదడు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుంది. జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుంది.

జీర్ణవ్యవస్థ బాగుంటుంది

ఆల్కహాల్‌ మనిషి గ్యాస్ట్రోఇంటెస్టైనల్‌ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మందు మానేసిన మూడు వారాల్లో ఈ వ్యవస్థ పనితీరు మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. పేగుల్లోని మంచి బ్యాక్టీరియా తిరిగి వృద్ధి చెందుతుంది. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. మీ జీర్ణ వ్యవస్థ పనితీరు మొత్తం మెరుగు పడాలంటే కనీసం నెల రోజులపైనే పడుతుంది.

మెరుగ్గా రోగనిరోధక వ్యవస్థ

ఆల్కహాల్‌ ఓ వ్యక్తి రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. తాగిన సమయంలో శరీరం బలహీనంగా, అనారోగ్యంగా అనిపిస్తుంది. అందుకే మందు మానేసిన మూడు వారాల తర్వాత ఈ రోగనిరోధక వ్యవస్థ తాను కోల్పోయిన శక్తిని తిరిగి సంపాదిస్తుంది. జీవక్రియ (మెటబాలిజం) కూడా మెరుగవుతుంది.

మందు మానేసిన నెల రోజుల తర్వాత..

మీరు మందు మానేసి వారాలు కాదు.. నెల దాటిందనుకోండి. మీ శరీరంలో చెప్పుకోదగిన మార్పులు వస్తాయి.

గుండె కోలుకుంటుంది

మందు ఎక్కువగా తాగే వాళ్లలో గుండె సంబంధిత సమస్యలు చాలా సహజం. అయితే కొందరిలో మందు మానేసిన తొలి రెండు వారాలు బీపీ ఎక్కువవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇవి మెల్లగా సర్దుకుంటాయి. నెల రోజుల తర్వాత గుండె వేగంగా కొట్టుకోవడం, హైబీపీ వంటి సమస్యలు ఇక ఉండవు. గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకెళ్లే ఎడమ ధమని మందు మానేసిన తర్వాత చాలా బాగా కోలుకుంటుందని అధ్యయనాల్లో తేలింది. అయితే మరీ ఎక్కువ మందు తాగే అలవాటు ఉన్న వాళ్లలో ఎన్నాళ్లయినా గుండె పనితీరు మళ్లీ మునుపటి స్థితికి తీసుకురావడం సాధ్యం కాదు.

వృద్ధాప్య ఛాయలు పోతాయి

ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకుంటే శరీరం డీహైడ్రేట్‌ అవుతుంది. దీనివల్ల మీ చర్మం దెబ్బతింటుంది. చిన్న వయసులోనే మీ ముఖంలో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. ఆల్కహాల్ మానేసిన నెల రోజుల తర్వాత మీ చర్మం మళ్లీ మునుపటి స్థితికి చేరుకుంటుంది. ఆల్కహాల్‌ వల్లే ఎదురయ్యే కొన్ని చర్మ సమస్యలు మందు మానేయగానే మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి.

కొన్ని నెలల తర్వాత..

ఇక మళ్లీ ఆల్కహాల్‌ జోలికి వెళ్లబోమని అనుకునే వాళ్లు కొన్ని నెలల పాటు మందుకు దూరంగా ఉండటం వల్ల దీర్ఘకాలిక జబ్బుల నుంచి బయటపడవచ్చు. పైగా అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. మీ లివర్‌ (కాలేయం) మామూలుగా పనిచేయడం ప్రారంభిస్తుంది. నిజానికి ఆల్కహాల్‌ వల్ల మొదట దెబ్బతినేది కాలేయమే. పరిమితికి మించి ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు పెరిగిపోయి ఫ్యాటీ లివర్‌ సమస్య వస్తుంది. 

అయితే చాలా రోజుల పాటు ఆల్కహాల్‌కు దూరంగా ఉంటే.. ఈ ఫ్యాటీ లివర్‌ సమస్య తొలగిపోతుంది. ఇలాగే దీర్ఘకాలం పాటు మందు జోలికి వెళ్లకుండా ఉంటే.. క్యాన్సర్‌, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. మితిమీరిన ఆల్కహాల్‌ వల్ల రొమ్ము, తల, గొంతు, కాలేయం, అన్నవాహిక క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ మీరు కొంతకాలం తర్వాత మళ్లీ తాగడం మొదలుపెడితే.. ఈ ప్రయోజనాలన్నీ తాత్కాలికమే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం