Artificially ripened mangoes: కృత్రిమంగా కాల్ఫియం కార్భైడ్ తో పండించిన మామిడి పండ్లను తింటే ఏమవుతుంది?
Artificially ripened mangoes: సహజంగా పండిన మామిడి పండ్లే ఆరోగ్యకరం. కానీ చాలావరకు మార్కెట్లో కాల్షియం కార్బైడ్ తో కృత్రిమంగా పండించిన మామిడి పండ్లే లభిస్తున్నాయి. వీటిని తినడం వల్ల ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మామిడి పండ్ల సీజన్ నడుస్తోంది. పండ్లలో ఇది రారాజు. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. దీనిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఎన్నో సూక్ష్మపోషకాలు అధికంగా ఉంటాయి. అయితే సహజంగా పండిన మామిడి పండ్లతోనే అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కానీ ఇప్పుడు ఎక్కువ వ్యాపారులు కృత్రిమ పద్ధతిలోనే మామిడి పండ్లను పండిస్తున్నారు. రసాయన సమ్మేళనం అయిన కాల్షియం కార్బైడ్‌తో పండిన మామిడి పండ్లను తినడం తీవ్రమైన ఆరోగ్య పరిణామాలకు దారితీస్తుంది

పండ్లను మగ్గబెట్టడానికి నిషేధిత ఉత్పత్తి 'కాల్షియం కార్బైడ్'ను ఉపయోగించవద్దని భారతదేశంలోని టాప్ ఫుడ్ రెగ్యులేటర్ FSAAI ఇటీవల వ్యాపారులను కోరింది. మామిడి పండ్లను పండించడానికి ఉపయోగించే కాల్షియం కార్బైడ్… ఎసిటిలిన్ వాయువును విడుదల చేస్తుంది, ఇందులో ఆర్సెనిక్, భాస్వరం వంటి హానికరమైన ఆనవాళ్లు ఉంటాయి. ఇవి మైకం, దాహం అధికంగా వేయడం, చికాకు, బలహీనత, మింగడంలో ఇబ్బంది, వాంతులు, చర్మంపై పుండ్లు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి
కాల్షియం కార్బైడ్ అంటే ఏమిటి?
కాల్షియం కార్బైడ్ అనేది మామిడి, ఇతర పండ్లకు కృత్రిమంగా పండించే ఏజెంట్ గా ఉపయోగించే రసాయన సమ్మేళనం. ఇది పండే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందుకే ఈ రసాయనాన్ని అధికంగా వినియోగిస్తారు. ఈ రసాయనాన్ని అనేక దేశాలలో నిషేధించారు. కాల్షియం కార్బైడ్ వాతావరణంలోని తేమతో కలిసి ఇది ఎసిటిలిన్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఇది మండే స్వభావం కలిగి ఉంటుంది. వీటిని సరిగ్గా నిర్వహించకపోతే పేలుడు ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా, కాల్షియం కార్బైడ్ అవశేషాలు… ఆర్సెనిక్, భాస్వరం వంటివి ఏర్పడతాయి. ఇవి విష సమ్మేళనాలు. కాల్షియం కార్బైడ్తో పండించిన మామిడి లేదా ఇతర పండ్లను తినడం మానవ ఆరోగ్యంపై అనేక హానికరమైన ప్రభావాలను చూపుతుంది.
కాల్షియం కార్బైడ్ దుష్ప్రభావాలు
అధ్యయనాల ప్రకారం, కాల్షియం కార్బైడ్ శరీరంలో దీర్ఘకాలికంగా చేరితే హైపోక్సియాను ప్రేరేపించడం ద్వారా నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. తలనొప్పి, మైకము, అధిక నిద్ర, జ్ఞాపకశక్తి కోల్పోవడం, సెరిబ్రల్ ఎడెమా, కాళ్ళు, చేతుల్లో తిమ్మిరి, సాధారణ బలహీనత, జలుబు, తక్కువ రక్తపోటు, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కాల్షియం కార్బైడ్ అధికంగా పండిన మామిడి పండ్లను తినడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాల్షియం కార్బైడ్ ఎసిటిలిన్ వాయువును విడుదల చేస్తుంది. ఇది పక్వాన్ని వేగవంతం చేస్తుంది, కానీ హానికరమైన మలినాలను కూడా కలిగి ఉంటుంది. వీటి వినియోగం తలనొప్పి, మైకము, మానసిక సమస్యలు వస్తాయి.
ఇలా తినండి
మామిడి పండ్లను తినడానికి ముందు గంట పాటూ నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల వాటిపై ఉన్న రసాయన అవశేషాలు తొలగిపోతాయి. పండ్లను ఎల్లప్పుడూ శుభ్రంగా కడగాలి. సహజంగా పండిన మామిడి పండ్లను ఎంచుకోవడం ద్వారా, రసాయనాలతో పండించే పండ్లకు దూరంగా ఉండడమే మంచిది. కాల్షియం కార్బైడ్ తో పండిన మామిడి పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
మామిడి పండ్లు తిన్నాక కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. సహజంగా పండిన పండ్లతో పోలిస్తే కృత్రిమంగా పండిన పండ్లలో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. వాటిలో చక్కెరలు, ఇతర ముఖ్యమైన పోషకాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవచ్చు, వాటి ఆరోగ్య ప్రయోజనాలు తగ్గుతాయి.
జీర్ణశయాంతర సమస్యలు: కృత్రిమంగా పండిన పండ్లను తింటే ఆర్సెనిక్, భాస్వరం హైడ్రైడ్ల అవశేషాలు శరీరంలో చేరుతాయి. అవి జీర్ణశయాంతర ప్రేగులను చికాకుపెడతాయి. ఇది కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలకు దారితీస్తుంది.
న్యూరోలాజికల్ ప్రభావాలు: ఆర్సెనిక్ వల్ల తలనొప్పి, మైకము, నాడీ సంబంధిత రుగ్మతలు, బలహీనమైన అభిజ్ఞా పనితీరుకు దారితీస్తుంది.
శ్వాసకోశ సమస్యలు: పండే సమయంలో ఉత్పత్తి అయ్యే ఎసిటిలిన్ వాయువును పీల్చడం వల్ల శ్వాసకోశ చికాకు, దగ్గు, శ్వాస ఆడకపోవడం జరుగుతుంది.
చర్మపు చికాకు: పండు ఉపరితలంపై కాల్షియం కార్బైడ్ అవశేషాలు కొంతమందిలో చర్మానికి అలెర్జీలను తెచ్చి పెడతాయి.
ఈ ప్రమాదాలను తగ్గించడానికి, సేంద్రీయంగా పండిన పండ్లను ఎంచుకోవడం లేదా కాల్షియం కార్బైడ్ తో పండించిన పండ్లను బాగా కడిగి తినడం మంచిది. అనేక దేశాలలో నియంత్రణ సంస్థలు పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్ వాడకాన్ని నిషేధించాయి. కానీ మన దేశంలో మాత్రం ఇంకా ఇది జరుగుతోంది.