Best friends: అమ్మాయిలు బెస్ట్‌ఫ్రెండ్స్‌తో ఫోన్లో గంటల కొద్దీ ఏం మాట్లాడతారు? వాళ్లు పెట్టే ముచ్చట్లివే-what female best friends speak on phone for hours ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Best Friends: అమ్మాయిలు బెస్ట్‌ఫ్రెండ్స్‌తో ఫోన్లో గంటల కొద్దీ ఏం మాట్లాడతారు? వాళ్లు పెట్టే ముచ్చట్లివే

Best friends: అమ్మాయిలు బెస్ట్‌ఫ్రెండ్స్‌తో ఫోన్లో గంటల కొద్దీ ఏం మాట్లాడతారు? వాళ్లు పెట్టే ముచ్చట్లివే

Koutik Pranaya Sree HT Telugu
Aug 04, 2024 10:30 AM IST

Besties talks: అమ్మాయిలు వాళ్ల బెస్ట్‌ఫ్రెండ్స్‌తో గంటలకొద్దీ ఫోన్లు మాట్లాడటం సాధారణమే. అయితే వాళ్లు ఏం మాట్లాడుకుంటారో తెల్సుకోవాలని ఉంటే ఇది చదవండి.

బెస్ట్‌ఫ్రెండ్స్ ముచ్చట్లు
బెస్ట్‌ఫ్రెండ్స్ ముచ్చట్లు (freepik)

కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. బెస్ట్‌ఫ్రెండ్స్ మాట్లాడుకోడానికి పనికిరాని విషయం అంటూ ఏముండదు. నరేంద్రమోదీ వేసుకున్న షాలువా డిజైన్ నుంచి పక్కింటి ఆవిడ కట్టుకున్న పట్టుచీర వరకు ప్రతిదీ మాట్లాడుకోవాల్సిందే. లేదంటే కడుపులో వికారం వచ్చేస్తుంది. బెస్ట్‌ఫ్రెండ్‌తో ఏ ముచ్చటైనా చెప్పకపోతే కడుపు ఉబ్బి పేలినా ఆశ్చర్యం లేదు. అలాగనీ ఏదో వంకతో మాట్లాడుకున్నట్లు ఉండవు ఆ మాటలు. అంతర్జాతీయ సదస్సులో జరిగే చర్చల్లాగా ఉంటుంది వాళ్ల సంభాషణ.

ఆ రహస్యాలూ వాళ్లకు తెల్సు:

పాపం అమాయకులైన భర్తలు😉 వాళ్లకు సంబంధించిన విషయాలు కేవలం భార్యకు మాత్రమే తెల్సు అనుకుంటారు. కానీ ఒక మూడో వ్యక్తికి భర్తకు తెలీని రహస్యాలు కూడా తెలుసే.. ఆవిడే మీ ఆవిడ బెస్ట్‌ఫ్రెండు😎👫. మీరెంత గింజుకున్నా సరే.. ఎంత చెప్పొద్దన్నా సరే.. తప్పకుండా ప్రతి విషయం ఆమె చెవిన వేయకుండా నిద్రపోరు మీ ఆవిడ. నిజం చెప్పాలంటే.. నీతో ఈ విషయం అస్సలు చెప్పొద్దన్నాడే.. అని చెప్పి మరీ విషయం చేరవేస్తారు. అదో తుత్తి.. తుప్తి.. తృప్తీ..!

శత్రువులు కలిపిన బంధమిది:

అవును.. ఏ ఇద్దరు మంచి ఫ్రెండ్స్‌ని అయినా అడిగి చూడండి. వాళ్లిద్దరికీ కామన్‌గా ఓ శత్రువుంటారు😈⚔. మొదట్లో మామూలు ఫ్రెండ్స్ లాగా ఉన్న ఈ ఇద్దరూ.. ఆ ఒక్క శత్రువు గురించి మాట్లాడీ మాట్లాడీ ఫెవిక్విక్‌ తో అంటించినట్లు ఎవరూ విడదీయలేని ప్రాణ స్నేహితులుగా మారిపోతారు. అంటే ఇద్దరికీ నచ్చిన, నచ్చని ఓ విషయం వాళ్లిద్దరినీ అలా కలిపేస్తుందన్న మాట. ఒకవేళ వాళ్లిద్దరిలో ఒకరికి ఎవరైనా నచ్చరూ అంటే ఇంకొకరికీ నచ్చకూడదు. వాళ్లిద్దరూ రాసుకున్న రాజ్యాంగంలో ఈ రూల్ ఉంటుందంతే💪.. సో బేసిగ్గా వాళ్ల మాటల్లో వాళ్లకు నచ్చని వాళ్ల గురించి, విషయాల గురించి, మనస్తత్వాల గురించి కూడా ఓ మాటో ముచ్చటో అయితే ఉంటుంది.

లవ్ మ్యాటర్స్:

ఇద్దరు అమ్మాయిల్లో ఎవరో ఒకరికి బాయ్‌ఫ్రెండో, లవరో🧡 ఉంటారు. ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ఏం మాట్లాడాలో, ఎటు వెళ్లాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో.. అన్నీ ఫోన్ ద్వారా గైడెన్స్ ఇచ్చేది మరో ఫ్రెండే. ఈవిడకు చెప్పకుండా ఆవిడ ఏమీ చేయదంటే నమ్మండీ.. సో.. లవ్ మేటర్స్ కూడా ఫోన్లో మాట్లాడుకుంటారన్న మాట. బ్రేకప్ అయితే ఓదార్చేది, మంచి మనిషైతే అతనితో ఎలాగైనా కలపడానికి తెగించేదీ.. ఈ బెస్ట్‌ఫ్రెండే

కష్టాలూ చెప్పుకుంటారు:

స్నేహమంటే కష్టాల్లోనూ తోడుంటుంది. అలా ఉంటారన్న నమ్మకంతోనే ఇద్దరి బంధం బలపడుతుంది. కాబట్టి ఇద్దరిలో ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా వాళ్లకు ముందు గుర్తొచ్చేది వాళ్ల బెస్ట్‌ఫ్రెండే👭. అమ్మకూ, నాన్నకు, భర్తకూ చెప్పుకోలేని విషయాలు కొన్నుంటాయి. వాళ్లకు చెప్పినా తన ఫ్రెండు లాగా అర్థం చేసుకోరు అనిపిస్తుంది. ఇంట్లో సమస్యల నుంచి, ఎవరికీ తెలీని రహస్యాల దాకా ప్రతిదీ వాళ్లకు ఏదీ దాచకుండా చెప్పుకుంటారు. కష్టాలు తీరతాయో లేదో తర్వాత సంగతి. వాళ్లిచ్చే ధైర్యంతో కష్టం తీరిందనే సంతృప్తి రావడం మాత్రం పక్కా. వాళ్లతో ఏ కష్టం పంచుకున్నా వాళ్లలాగా మనల్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు అనిపిస్తుంది.

ఇక చెప్పుకుంటూ పోతే వాళ్లు మాట్లాడుకునే విషయాలకు అంతుండదు. చూసేవాళ్లకు గంటలకొద్దీ మాట్లాడుతున్నారు అనిపించొచ్చు. కానీ ఆ గంట సమయం మూడ్, ఉత్సాహం మార్చేస్తుంది. ధైర్యాన్నిస్తుంది. అన్నింటా తోడుండే అండను గుర్తు చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరికీ బెస్ట్‌ఫ్రెండ్ ఉండాల్సిందే.

సరే.. మీకూ మీ బెస్ట్‌ఫ్రెండుకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

టాపిక్