అరటిపండు ఎప్పుడైనా తినగలిగే సులభమైన ఆహారాలలో ఒకటి. ఇది ఎక్కడికైనా తీసుకెళ్లడానికి సులభమైన పండు కూడా. సహజంగా తీపి రుచిని కలిగి ఉంటుంది. కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. రోజూ రెండు అరటిపండ్లు తినడం వల్ల సంతృప్తికరమైన భోజనం లభించడమే కాకుండా.. శరీరానికి అవసరమైన అనేక పోషకాలు కూడా దొరుకుతాయి.
పలు అధ్యయనం ఫలితాల ప్రకారం, అరటిపండ్లు ఫినోలిక్ ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. ఈ సమ్మేళనాలు అధిక యాంటీఆక్సిడెంట్, యాంటీరాడికల్ లక్షణాలను కలిగి ఉంటాయి. శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో ఉపయోగపడతాయి.
అరటిపండ్లలోని ఫినోలిక్ ఆమ్లాలు యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ-డయాబెటిక్, యాంటీ-క్యాన్సర్ ప్రభావాలను కలిగి ఉంటాయి. వాపు, ఊబకాయం, అధిక రక్తపోటు, క్యాన్సర్‌తో సంబంధం ఉన్న కణాల పెరుగుదలను కూడా నిరోధించగలవు. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అరటిపండ్లు గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
పొటాషియం గుండెను బలోపేతం చేసే అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంది. ఇది అరటిపండ్లలో పుష్కలంగా ఉంటుంది. ఈ ముఖ్యమైన ఖనిజం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె పనిభారాన్ని తగ్గిస్తుంది. ధూమపానం మానేయడానికి ప్రయత్నిస్తుంటే అరటిపండ్లు దీనికి సరైన పరిష్కారం. విటమిన్లు, ఖనిజాల మిశ్రమం అయిన అరటిపండ్లు నికోటిన్ కోరికలను తగ్గించడంలో, ఉపసంహరణ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.
మీ శక్తి స్థాయిలను వెంటనే పెంచుకోవాలనుకుంటే అరటిపండ్లు సహజంగానే చక్కెరను కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయినప్పుడు, అరటిపండ్లు తినడం వల్ల మీకు అవసరమైన శక్తి లభిస్తుంది. మీ శరీరానికి ఒక చిన్న ఇంధనం లాంటిది.
కొంచెం ఒత్తిడిగా లేదా విచారంగా అనిపిస్తే అరటిపండులోని విటమిన్ బీ6 మెదడు సెరోటోనిన్, డోపమైన్ వంటి మంచి అనుభూతిని కలిగించే రసాయనాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఒత్తిడితో కూడిన సమయంలో అరటిపండు తినడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. క్లిష్ట సమస్యలను సులభంగా నిర్వహించవచ్చు.
పగటిపూట మీకు అలసటగా ఉంటే ఐరన్ లోపం కూడా ఒక కారణం కావచ్చు. అరటిపండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ఎక్కువ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఎక్కువ ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.
అరటిపండులో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి. రోజుకు రెండు తినడం వలన పైన చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.