Digital eye strain: కంప్యూటర్ విజన్ సిండ్రోమ్.. రాకుండా ఉండాలంటే..-what causes digital eye strain tips to protect your eyes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  What Causes Digital Eye Strain; Tips To Protect Your Eyes

Digital eye strain: కంప్యూటర్ విజన్ సిండ్రోమ్.. రాకుండా ఉండాలంటే..

HT Telugu Desk HT Telugu
May 29, 2023 05:48 PM IST

Digital eye strain: కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ఎక్కువ సేపు స్క్రీన్ వాడటం వల్ల వస్తుంది. దాని గురించి కొన్ని విషయాలు, జాగ్రత్తలు తెలుసుకోండి.

కంప్యూటర్ విజన్ సిండ్రోమ్
కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (Sketch by Piyali Ghosh Kumar)

కళ్ల ముందు రోజు మొత్తం ఏదో ఒక డిజిటల్ స్క్రీన్ ఉండాల్సిందే. పనికోసం ల్యాప్‌టాప్ స్క్రీన్ కాసేపుంటే, పనయ్యాక ఫోన్ స్క్రీన్, మళ్లీ టీవీ.. ఇలా మనకు తెలీకుండానే ఏదో ఒకటి వాడుతుంటాం. కానీ కళ్లు చాలా విలువైనవి. వాటి ఆరోగ్యం చాలా ముఖ్యం. నిరంతరం స్క్రీన్ చూడటం తప్పనిసరి అయినపుడు కొన్ని జాగ్రత్తలైనా పాటించాలి. లేదంటే ఈ మధ్య చాలా మంది ఎదుర్కొంటున్న కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ భారిన పడిపోతాం.

ఈ సిండ్రోమ్ లక్షణాల్లో ముఖ్యమైనవి కళ్లలో అసౌకర్యం, మంట, కళ్లు పొడిబారడం, దృష్టిలో స్పష్టత లేకపోవడం, తలనొప్పి. ఇవన్నీ బ్లూలైట్ స్క్రీన్ ఎక్కువగా వాడటం వల్ల వచ్చే సమస్యలు. ఈ ఇబ్బందులు రాకూడదంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

దూరం పాటించండి:

మరీ దగ్గరగా ఉండి ఫోన్ గానీ, ల్యాప్‌టాప్ గానీ వాడకండి. కనీసం 16 ఇంచుల దూరం ఉంటే కళ్ల మీద ప్రభావం పడదు. స్క్రీన్ బ్రైట్‌నెస్ సరిగ్గా ఉండేలా చూసుకోండి. స్క్రీన్ మీద బయటి వెలుతురు పడితే చూడటం కష్టమవుతుంది. ఆ పొరపాటుంటే సరిచేసుకోండి. దీని కోసం యాంటీ గ్లేర్ కంప్యూటర్ స్క్రీన్ కూడా వాడొచ్చు.

బ్లూ లైట్ ఫిల్టర్:

బ్లూ లైట్ ఫిల్టర్ వాడటం వల్ల కంటి చూపు మీద ప్రభావం కాస్త తగ్గుతుంది. లేదా బ్లూలైట్ ప్రభావం పడకుండా చూసుకునే కళ్లద్దాలు వాడటం మరీ ఉత్తమం.

కంటి పరీక్షలు:

క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం మర్చిపోవద్దు. కళ్ల మీద ఒత్తిడే కాకుండా ఇంకేమైనా సమస్యలు రాకుండా ముందే తెలిసిపోతుంది. మీకున్న ఇబ్బందుల్ని బట్టి సలహాలు కూడా తీసుకునే వీలుంటుంది.

గది వెలుతురు:

గది వెలుతురు మరీ కళ్లకు కొట్టేలా ఉండకూడదు. ఎక్కువ వెలుతురుంటే కళ్లమీద ఒత్తిడి పడదని కాదు. దానివల్ల కళ్లు అలిసిపోవచ్చు కూడా. కళ్లకు అనుకూలంగా ఉండేంత లైటింగ్ మీరే కనిపెట్టుకోవాలి. అదే ఏర్పాటు చేసుకోవాలి.

20 -20 -20 :

ఈ రూల్ గురించి మనం వెయ్యి సార్లు చదివే ఉంటాం. కానీ పాటించడం మర్చిపోతాం. ప్రతి ఇరవై నిమిషాలకు, ఇరవై అడుగుల దూరంలో, ఇరవై సెకన్ల పాటూ చూడాలి. అలా చూస్తూ కను రెప్పలు కొడుతూ ఉండాలి. ఇది గుర్తుండకపోతే ఇరవై నిమిషాలకోసారి మోగేలా అలారం పెట్టుకుంటే.. కొన్ని రోజులకు మీకే అలవాటు అవుతుంది.

WhatsApp channel

టాపిక్