Heart Attack: డ్యాన్స్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా గుండెపోటు రావడానికి కారణం ఏమిటి? వైద్యులు ఏం చెబుతున్నారు?-what causes a sudden heart attack while dancing what are the doctors saying ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heart Attack: డ్యాన్స్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా గుండెపోటు రావడానికి కారణం ఏమిటి? వైద్యులు ఏం చెబుతున్నారు?

Heart Attack: డ్యాన్స్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా గుండెపోటు రావడానికి కారణం ఏమిటి? వైద్యులు ఏం చెబుతున్నారు?

Haritha Chappa HT Telugu
Published Feb 12, 2025 12:30 PM IST

Heart Attack: ఈమధ్య ఎక్కువ మంది డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణిస్తున్నారు. ఇలా డ్యాన్స్ చేస్తూ గుండెపోటు బారిన ఎందుకు పడుతున్నారో వివరిస్తున్నారు వైద్యులు.

డ్యాన్స్ చేస్తున్నప్పుడు గుండె పోటు ఎందుకు వస్తుంది?
డ్యాన్స్ చేస్తున్నప్పుడు గుండె పోటు ఎందుకు వస్తుంది? (Pixabay)

ఇప్పటికే చాలా సంఘటనలు, వీడియోలు వైరల్ గా మారాయి. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయిన యువత ఎంతోమంది ఉన్నారు. ఈమధ్య కూడా ఒక సంగీత్ కార్యక్రమంలో పాతికేళ్ల యువతి డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా గుండెపోటుతో వేదికపైనే కుప్పకూలిపోయింది. ఇలా నాట్యం చేస్తున్నప్పుడే ఎక్కువమంది గుండెపోటు బారిన ఎందుకు పడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.

గుండెపోటు ఎందుకు వస్తుంది?

నాట్యం అధికంగా చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే నాట్యం చేస్తున్నప్పుడు గుండె స్పందన మారిపోతుంది. ఇది క్రమరహితంగా మారిపోవచ్చు. ఇది గుండె ఆగిపోయే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అలాగే కుటుంబ చరిత్రలో ఎవరికైనా గుండెపోటు సమస్య ఉంటే అలాంటి వారికి నృత్యం చేస్తున్నప్పుడు గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇలా జరగవచ్చు. శరీరంలో నీరు లేకపోవడం వల్ల కూడా గుండెపై ఒత్తిడి పెరిగి హఠాత్తుగా గుండెపోటు బారిన పడే అవకాశం పెరుగుతుంది.

ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం గుండెపోటు లేదా గుండె సంబంధిత వ్యాధులు వెనుక ప్రధాన కారణాలు చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి. పండుగల సమయంలో ప్రజలు బయట ఆహారాన్ని తినేందుకు ఇష్టపడతారు. అలాగే నూనె నిండిన పదార్థాలను కూడా అధికంగా తింటారు. ఇలా నూనె నిండిన పదార్థాల అధికంగా తిన్నా, కొవ్వు నిండిన పదార్థాలు అధికంగా తిన్నా కూడా గుండెపోటు బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.

ఈరోజుల్లో వాతావరణం ఒక్కొక్కసారి ఒక్కోలా మారుతుంది. కాబట్టి ఏ వాతావరణంలోనైనా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నీళ్లు సరిగా తాగని వారు ఎంతోమంది ఉంటారు. ఇలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీటిని ప్రత్యేకంగా, అధికంగా తాగుతూనే ఉండాలి. ప్రతి వ్యక్తి మూడు లీటర్ల నీటిని తాగడం అవసరం. ఎప్పుడైతే ఒక వ్యక్తి తగినంత నీరు తాగడో అతనికి గుండె సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది.

రక్తపోటు అధికంగా ఉంటే

ఎంతోమందికి తమ రక్తపోటు ఎంత ఉందో కూడా తెలియదు. రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు తెలియక, కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల అతడు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. గుండె జబ్బులు, మధుమేహం ఉన్న రోగులు, అలాగే రక్తపోటు ఉన్నవారు డ్యాన్సులు వంటివి తక్కువగా చేయడం మంచిది. ఇలాంటి వారు ఎక్కువ సేపు నాట్యం చేయడం మంచి పద్ధతి కాదు.

వైద్యులు చెబుతున్న ప్రకారం గుండె మన శరీరానికి రక్తాన్ని పంపు చేసే పరికరం. అటువంటి పరిస్థితుల్లో మనం జిమ్‌లో తీవ్రమైన వ్యాయామాలు చేస్తున్నప్పుడు లేదా నృత్యం చేస్తున్నప్పుడు మన శరీరం మొత్తం చాలా చురుగ్గా ఉంటుంది. దీనివల్ల మన శరీరం ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. అప్పుడు రక్త పోటు కూడా పెరుగుతుంది. ఈ సమయంలో గుండె స్పందన రేటు కూడా పెరిగిపోతుంది. ఆ సమయంలో శరీరానికి ఆక్సిజన్ కూడా ఎక్కువ అవసరం పడుతుంది. కాబట్టి గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, హైబీపీ రోగులు ఇలా తీవ్రంగా శారీరక శ్రమ చేయడం మంచి పద్ధతి కాదు. ఆ సమయంలో గుండె తీవ్ర ఒత్తిడికి గురై ఆగిపోయే ప్రమాదం ఉంది.

హైబీపీ ఉన్నవారు, మధుమేహం ఉన్నవారు ఎంత సేపు వ్యాయామం చేయాలో... ఎలాంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలో తెలుసుకోవాలి. మీరు తీవ్రమైన వ్యాయామాలు చేస్తే శరీరం తీవ్ర అలసటకు గురవడంతో పాటు శరీరం మొత్తానికి ఆక్సిజన్ ను పంపిణీ చేయలేక గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం