Dehydration Signs: మన శరీరం ఇచ్చే డీహైడ్రేషన్ సంకేతాలివే, నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన ఇబ్బందులు-what are the signs and symptoms of dehydration ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dehydration Signs: మన శరీరం ఇచ్చే డీహైడ్రేషన్ సంకేతాలివే, నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన ఇబ్బందులు

Dehydration Signs: మన శరీరం ఇచ్చే డీహైడ్రేషన్ సంకేతాలివే, నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన ఇబ్బందులు

Galeti Rajendra HT Telugu

Dehydration Symptoms: మనం రోజుకి ఎన్ని గ్లాస్‌లు నీరు తాగాలో తెలుసా? ఒకవేళ మీరు శరీరానికి తగినంత నీరు ఇవ్వలేకపోతే.. మీ శరీరం కొన్ని సంకేతాల్ని ఇస్తుంది. వాటిని గమనించి జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే?

డీహైడ్రేషన్ సంకేతాలు (Freepik)

మన శరీరం ఉత్సాహంగా పనిచేయడానికి నీరు చాలా అవసరం. ఒకవేళ మీరు పని ఒత్తిడి లేదా ఏమరపాటు కారణంగా రోజులో తగినంత నీరు తాగకపోతే.. మీ శరీరం డీహైడ్రేషన్ సంకేతాల్ని ఇస్తుంది. అయితే.. ఈ డీహైడ్రేషన్ సంకేతాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. వారి శరీరం, ఆరోగ్యాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా డీహైడ్రేషన్ సంకేతాలు కనిపిస్తాయి. వాటిని గమనించి జాగ్రత్తలు తీసుకుంటే మీరు చాలా అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డీహైడ్రేషన్ మీ శరీరంలోని ప్రధాన కదలికలను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక డీహైడ్రేషన్ మీ మూత్రపిండాల పనితీరుని ప్రభావితం చేస్తుంది. అలానే జీర్ణక్రియను, కండరాలను పనితీరుపై ప్రభావం పడి మీకు వివిధ రకాల నొప్పులను సృష్టిస్తుంది.

చర్మంపై ముడతలు

డీహైడ్రేషన్ వల్ల చర్మం పొడిబారుతుంది. చర్మం దెబ్బతిన్నట్లు కనిపిస్తుంది. ఆ ప్రభావంతో చర్మంపై ముడతలు, దురద కూడా వస్తుంది. మీరు సమస్యను గుర్తించకపోతే.. మీ స్కిన్ టోన్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

తీవ్రమైన అలసట

మీరు తగినంత నీరు తాగకపోతే.. అది మీ శరీరం కణాలకు అవసరమైన పోషకాల సరఫరా చేయడం విఫలమవుతుంది. దాంతో మీ శక్తి కూడా తగ్గుతుంది. దాని ప్రభావం మీరు ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా బాగా అలసిపోయినట్లు కనిపిస్తారు.

అధిక తలనొప్పి

నీరు తీసుకోకపోవడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది తలనొప్పి లేదా మైగ్రేన్లకు కారణమవుతుంది.

యూరిన్ రంగులో మార్పు

డీహైడ్రేషన్ సంకేతాల్ని మనం సులువుగా యూరిన్ రంగుని బట్టి గుర్తించొచ్చు. యూరిన్ పసుపు లేదా గోధుమ రంగులో వస్తుంటే మీరు డీహైడ్రేషన్‌కి గురయ్యారని సంకేతం. సాధారణంగా శరీరంలోని అదనపు మలినాల్ని బయటకు పంపడానికి శరీరానికి ఎక్కువ నీరు అవసరం. కానీ మీరు తగినంత నీరు ఇవ్వలేకపోతే ఆ ప్రభావం మీ పూర్తి శరీరంపై పడుతుంది.

మలబద్దకం సమస్య

డీహైడ్రేషన్.. మీ జీర్ణక్రియపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మీ పేగుల నుండి వ్యర్థాలను నీటి సాయంతోనే శరీరం బయటకు పంపుతుంది. మీరు తగినంత నీటిని శరీరానికి ఇవ్వలేకపోతే.. అది మీకు మలబద్ధకానికి దారితీస్తుంది.

నోటి దుర్వాసన

మన నోటిలోని లాలాజలంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ శరీరంలో తగినంత నీరు లేనప్పుడు ఇది తగ్గుతుంది. దాంతో నోటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఆ ప్రభావం నోటి దుర్వాసనకి కారణం అవుతుంది.

కండరాల నొప్పి

మీ కండరాల కదలికకు ముఖ్యమైన పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లను డీహైడ్రేషన్ తగ్గిస్తుంది. మీ శరీరం డీహైడ్రేషన్‌కి గురైతే కండరాల నొప్పి పెరుగుతంది.

మైకం లేదా మూర్చ

మీ శరీరం డీహైడ్రేషన్ గురైతే మీ మెదడుకు వెళ్లే ఆక్సిజన్ మొత్తం తగ్గిపోతుంది. ఇది మైకం.. ఒక్కోసారి మూర్ఛకు కూడా కారణమవుతుంది. అలానే మీరు నిర్ణీత గడువుకి ఒకసారి మూత్ర విసర్జనకి వెళ్లాలి. ఒకవేళ మీకు యూరిన్ ఫీలింగ్ ఎక్కువ సేపు రాలేదంటే మీ శరీరానికి తగినంత నీరు లభించడం లేదని అర్థం చేసుకోవాలి.

ఆరోగ్యకరమైన మనిషి రోజుకి సగటున 8 గ్లాస్‌ల నీరు తాగాలి.. భోజనానికి ముందు.. తర్వాత ఒక గ్లాసు నీరు తాగడం చాలా ముఖ్యం

గమనిక: పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు, ఇబ్బందులు ఉంటే సంబంధిత వైద్యులను సంప్రదించండి.