Monsoon tourist places: జులై నెలలో తప్పక చూడాల్సిన 5 పర్యాటక ప్రాంతాలు..
Monsoon tourist places: భారతదేశంలో చాలా చోట్ల వర్షాలు మొదలయ్యాయి. ఎండ వేడి నుంచి ఉపశమనం లభించడంతో తిరిగి ట్రావెలింగ్ గురించి ప్లాన్స్ వేయడం మొదలుపెడతారు.మీరు జూలైలో వెళ్లగల అలాంటి 5 ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.
వర్షాన్ని ఇష్టపడేవారికి జులై నెల ప్రయాణాలకు అనువైనది. వర్షాలు మొదలవ్వడంతో ఎండ వేడిమి నుంచి ఉపశమనం దొరికింది. ఈ సమయంలో మీరు ట్రిప్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు జులై నెలలో చూడదగ్గ కొన్ని ప్రాంతాల లిస్టు చూడండి.
డల్హౌసీ:
హిమాచల్ ప్రదేశ్ లో డల్హౌసీ ఈ సమయంలో సందర్శించదగ్గ ప్రాంతం. డల్హౌసీలో జూలై నెలలో తేలికపాటి సూర్యరశ్మి ఉంటుంది. సాయంత్రాల్లో కూడా వాతావరణం బాగుంటుంది. డల్హౌసీ, ఖజ్జియార్, పంచ్పులా, సచ్ పాస్, డైన్కుండ్ శిఖరం, చమేరా సరస్సు, సత్తారా జలపాతం, బారా పథర్, బక్రోటా హిల్స్, టిబెటన్ బజార్, గంజి హిల్, రాక్ గార్డెన్, చంబా టౌన్, కలాటాప్ వన్యప్రాణుల అభయారణ్యం.. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు. డల్హౌసీలో జూలైలో సగటు ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 23 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. అప్పుడప్పుడు వర్షం పడుతుంది.
ముస్సోరి:
ఉత్తరాఖండ్ లోని ఒక అందమైన హిల్ స్టేషన్ ముస్సోరి. ఇది జులైలో సందర్శించడానికి గొప్ప ప్రదేశం. జూలై నెలలో ఇక్కడి వాతావరణం బాగుంటుంది. ఈ ప్రాంతం వర్షాకాలంలో పచ్చదనంతో కళకళలాడుతుంది. జూలైలో భారతదేశంలో సందర్శించడానికి అత్యంత ప్రశాంతమైన ప్రదేశాలలో ఇది ఒకటి. ముస్సోరీలో లాల్ టిబ్బా, గన్ హిల్ పాయింట్, కెంప్టీ జలపాతం, ఝరిపానీ జలపాతం, కంపెనీ గార్డెన్ మరియు క్లౌడ్స్ ఎండ్ లాంటి సందర్శించదగ్గ ప్రాంతాలు ఉన్నాయి. జూలైలో ఇక్కడ ఉష్ణోగ్రత పగలు 23 ° సెంటీగ్రేడ్ మరియు రాత్రి 15 ° సెంటీగ్రేడ్ ఉంటుంది.
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్:
జూలై నెలలో ఇక్కడ చుట్టూ పచ్చని చెట్లు, రంగుల పూలు కనిపిస్తుండటంతో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అత్యంత అందంగా కనిపిస్తుంది. ఈ పువ్వులలో సాక్సిఫ్రేజ్, వైల్డ్ రోజ్, జెరేనియం, బ్లూ కొరిడాలిస్ ఉన్నాయి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ను సందర్శించడంతో పాటు, హేమకుండ్ సాహిబ్, పుష్పావతి నదిని తప్పక చూడండి.
నైనిటాల్:
నైనిటాల్‌ను సరస్సుల నగరం అని పిలుస్తారు. ఇక్కడ ఏడు సరస్సులు కనిపిస్తాయి. వాటిలో నైనిటాల్ సరస్సు ఈ అందమైన హిల్ స్టేషన్ కు కొత్త అందం తీసుకొస్తుంది. సతీదేవి ఒక కన్ను ఇక్కడ పడిందని, అది సరస్సుగా ఏర్పడిందని చెబుతారు. నైనిటాల్ లో నైనిటాల్ సరస్సు, టిఫిన్ టాప్, హై ఆల్టిట్యూడ్ జూ, ఎకో కేవ్ గార్డెన్, భీమ్ తాల్ సరస్సు, కిల్బరీ పక్షుల అభయారణ్యం, రాజ్ భవన్ - గవర్నర్ హౌస్ సందర్శించడానికి ఉన్నాయి.
ధర్మశాల:
'లిటిల్ లాసా ఆఫ్ ఇండియా' అని ధర్మశాలను అంటారు. మంచుతో కప్పబడిన పర్వతాలు, దట్టమైన పైన్ అడవులు, అందమైన లోయలతో ఇది మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. జూలైలో భారతదేశంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఇది ఒకటి. మండే వేడి నుంచి ఉపశమనం కోసం ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు. ధర్మశాలలో చూడదగిన ప్రదేశాలు ట్రియుండ్ హిల్, ధర్మశాల క్రికెట్ స్టేడియం, సెయింట్ జాన్ ఇన్ వైల్డర్నెస్ చర్చ్, వార్ మెమోరియల్, గుటో మొనాస్టరీ, దాల్ లేక్, టీ ప్లాంటేషన్, సుగాలాగ్ ఖాంగ్, భాగ్సు జలపాతం, కాంగ్రా వ్యాలీ, ధరమ్కోట్. జూలైలో తేలికపాటి వర్షాలు కురిసి ఉష్ణోగ్రత 20 ° సెంటీగ్రేడ్ నుండి 27 ° సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది.