Mutton Biryani: కొత్త ఏడాదికి మటన్ బిర్యానీతో స్వాగతం పలికేయండి, ఇదిగో వెరీ సింపుల్ రెసిపీ
Mutton Biryani: కొత్త ఏడాదికి ఇష్టమైన వంటకాలతోనే స్వాగతం చెబుతారు ఎంతోమంది. నాన్ వెజ్ ప్రియుల కోసం మేము ఇక్కడ మటన్ బిర్యానీ రెసిపీ ఇచ్చాము. ఫాలో అయిపోండి.
కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు జనవరి 31 రాత్రి నుంచి వేడుకలు మొదలైపోతాయి. డిన్నర్లో టేస్టీ టేస్టీ వంటకాలు వండేందుకు అందరూ సిద్ధమైపోతారు. అలాగే జనవరి 1న కూడా లంచ్, డిన్నర్లో అదిరిపోయే రెసపీలను ప్లాన్ చేస్తారు. ఒకసారి మటన్ బిర్యానీ మేం చెప్పిన పద్ధతిలో వండుకొని చూడండి. ఇది మీకు ఎంతో నచ్చుతుంది. పైగా ఇది చాలా సింపుల్. వంట రానివారు కూడా ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో పర్ఫెక్ట్ గా చేసేయగలరు.
మటన్ బిర్యానీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం - రెండు కప్పులు
ఉల్లిపాయలు - మూడు
టమోటోలు - మూడు
నూనె - నాలుగు స్పూన్లు
నెయ్యి - రెండు స్పూన్లు
పచ్చిమిర్చి - ఆరు
బిర్యానీ ఆకు - ఒకటి
దాల్చిన చెక్క - చిన్న ముక్క
జాపత్రి - చిన్న ముక్క
అనాస పువ్వు - ఒకటి
లవంగాలు - నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్టు - మూడు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
యాలకులు - నాలుగు
కసూరి మేతి - ఒక స్పూను
పెరుగు - అరకప్పు
కారం - రెండు స్పూన్లు
పసుపు - పావు స్పూను
ధనియాల పొడి - రెండు స్పూన్లు
జీలకర్ర పొడి - అర స్పూను
గరం మసాలా - ఒకటిన్నర స్పూను
పుదీనా - గుప్పెడు
కొత్తిమీర తరుగు - గుప్పెడు
మటన్ బిర్యానీ రెసిపీ
1. మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
2. అందులో ఒక స్పూను కారం, పావు స్పూను పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అర స్పూను ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
3. ఆ మొత్తం మిశ్రమాన్ని కుక్కర్లో వేసి ఒక గ్లాసు నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి.
4. మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
5. ఇప్పుడు బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి.
6. స్టవ్ మీద బిర్యానీ వండేందుకు గిన్నెను పెట్టి నూనె వేయాలి.
6. ఆ నూనెలో రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేయాలి.
7. నెయ్యిలో నిలువుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని వేసి బాగా వేయించుకోవాలి.
8. ఉల్లిపాయలు బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు ఉంచి ఒక గుప్పెడు తీసి పక్కన పెట్టుకోవాలి.
9. ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయల మిశ్రమంలో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాపత్రి, అనాసపువ్వు, లవంగాలు వేసి బాగా కలుపుకోవాలి.
10. అలాగే యాలకులను కూడా పొడిలా దంచి అవి కూడా వేసుకోవాలి.
11. అల్లం వెల్లుల్లి పేస్టు మూడు స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి.
12. టమోటో ముక్కలు, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. పైన మూత పెట్టి టమోటాలు మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.
13. అందులో అరకప్పు పెరుగును వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి.
14. ఆ మిశ్రమంలోనే కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి.
15. పుదీనా, కొత్తిమీర తరుగును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
16. ఈ మొత్తం మిశ్రమంలో ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ ను ఆ నీళ్లతో సహా వేసి బాగా కలుపుకోవాలి.
17. పైన మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
18. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసి బాగా కలపాలి.
19. ఆ బియ్యం ఉడకడానికి సరిపడా నీటిని వేసి మరొకసారి కలుపుకోవాలి.
20. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూసుకోవాలి సరిపోకపోతే మరి కొంచెం వేసుకోవాలి.
21. అలాగే నిమ్మరసాన్ని కూడా చల్లి ఒకసారి కలుపుకోవాలి.
22. పైన మూత పెట్టి ఇది మొత్తం ఉడికే వరకు అలా ఉంచాలి.
23. ఉడికిన తర్వాత మూత తీసి ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను పైన చల్లుకొని మళ్ళీ మూత పెట్టి అలా పావుగంటసేపు వదిలేయాలి.
24. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. పది నిమిషాలు వదిలేసాక సర్వ్ చేయండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే జీవితంలో మర్చిపోలేరు.
న్యూ ఇయర్‌కు ఈ మటన్ బిర్యానీ మంచి ట్రీట్ లా ఉంటుంది. ఇంటికి అతిధులను, స్నేహితులను పిలిచి ఈ మటన్ బిర్యానీ వడ్డించండి. వారికి కచ్చితంగా నచ్చుతుంది.