Wednesday Motivational: ఈ మూడు లక్షణాలను విడిచి పెడితే మీ జీవితం సంతోషంగా ఉంటుంది-wednesday motivational if you leave these three qualities your life will be happy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivational: ఈ మూడు లక్షణాలను విడిచి పెడితే మీ జీవితం సంతోషంగా ఉంటుంది

Wednesday Motivational: ఈ మూడు లక్షణాలను విడిచి పెడితే మీ జీవితం సంతోషంగా ఉంటుంది

Haritha Chappa HT Telugu

Wednesday Motivational: ప్రతి మనిషి సంతోషంగా జీవించాలని అనుకుంటాడు. కానీ జీవించలేక పోతాడు. దానికి కారణం అతనిలో ఉన్న మూడు లక్షణాలు.

మోటివేషనల్ స్టోరీ (Pixabay)

Wednesday Motivational: మనిషి పతనానికి ఆ మనిషే కారణం అవుతాడు. ముఖ్యంగా తనలో ఉన్న లక్షణాలే అతని పతనానికి కారణం అవుతాయి. కానీ ఆ విషయాన్ని అతను గుర్తించలేడు. ఏ వ్యక్తి అయితే వ్యామోహం, దురాశ, కోపం.. ఈ మూడు లక్షణాలు ఉంటాయో, ఆ వ్యక్తి ఎప్పటికైనా ఓటమి పాలవుతాడు. అతని జీవితం నుంచి సంతోషం దూరమైపోతుంది. మనశ్శాంతి దక్కదు. మీలో కూడా మోహం, దురాశ, కోపం వంటి లక్షణాలు ఉంటే వెంటనే విడిచిపెట్టండి.

దురాశ

ప్రతి మనిషికీ ఆశ ఉంటుంది. కొందరికి అత్యాశ ఉంటుంది. ఆశ ఉండడం మంచిదే. అత్యాశ ఉండడం మాత్రం కాస్త చెడు విషయమే. కానీ దురాశ మాత్రం అత్యంత ప్రమాదకరమైనది. ఇది మిమ్మల్నే కాదు, మీ ఎదుట వ్యక్తులను కూడా నాశనం చేస్తుంది. అందుకే దురాశ దుఃఖానికి చేటు అని ఆర్యోక్తి పుట్టుకొచ్చింది. మీ మనసులో ఉన్న దురాశను వదిలి ఆశ మాత్రమే పడండి.

వ్యామోహం

కొందరు మోహాన్నే ప్రేమ అనుకుంటారు. ప్రేమ పరిపూర్ణమైనది. మరొక మనిషికి జీవితాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. కానీ మోహం చాలా ప్రమాదకరమైనది. తన ప్రాణంతో పాటు ఎదుటివారి ప్రాణాన్ని కూడా తీసేది. ప్రేమా, మోహం ఎప్పటికీ ఒకటి కాదు. మీలో ఉన్న మోహాన్ని వదిలి ప్రేమను మాత్రమే దాచండి. మోహం అంటే కామానికి పర్యాయపదంలా వాడుకోవచ్చు.

శారీరక వాంఛలు తీర్చుకోవడానికి పుట్టేది మోహం. కానీ ప్రేమ ఒక మనిషితో జీవితాంతం కలిసి నడిచేందుకు జనించేది. ప్రేమ శత్రువులను కూడా మిత్రువుల్లా మార్చేస్తుంది. కానీ వ్యామోహం మిత్రుడుని కూడా ప్రాణాలు తీసేంత పగని పెంచుతుంది. మీలో ఉన్న వ్యామోహాన్ని విడిచి ప్రేమను పెంచుకోండి. అప్పుడు ప్రపంచం ఎంతో అందంగా కనిపిస్తుంది,

కోపం

తన కోపమే తన శత్రువు అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. కోపం వల్ల మనిషికి నష్టమే తప్ప ఆవగింజంత లాభం కూడా ఉండదు. ఇది వారినే కాదు, వారితో జీవిస్తున్న వారిని కూడా నాశనం చేస్తుంది. భావోద్వేగాల్లో కోపం కూడా ఒకటి. కానీ కోపం మాత్రమే ప్రదర్శిస్తూ ఉంటే మీకు జీవితమే లేకుండా పోతుంది. కోపం ఎన్నో అనర్థాలకు కారణం కోపం రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ముఖ్యంగా అసంతృప్తి కారణంగా కోపం పుట్టుకొస్తుంది. అయితే ఆ కోపం కట్టలు పెంచుకునే వరకు ఉంచుకోకూడదు. దీనివల్ల సొంత ఆరోగ్యం కూడా పాడవుతుంది. తలనొప్పి, అధిక రక్తపోటు, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చేస్తాయి.

అలాగే మీ కోపానికి ఎదుటివారు కూడా బలవుతారు. వారిలోను ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు సంతోషంగా జీవించడం చాలా కష్టం. కాబట్టి ఎప్పటికప్పుడు కోపాన్ని వదిలి ప్రశాంతంగా జీవించేందుకు ప్రయత్నించాలి. ఎవరైతే వారి జీవితంలో కోపం, దురాశ, వ్యామోహం వంటివి వదిలేస్తారో వారు ఎంతో సుఖంగా జీవిస్తారు.