Wednesday Motivation: జీవితంలో విజయం సాధించాంటే కష్టపడి పనిచేయాలి. ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదంటే... ఏదో శక్తి మిమ్మల్ని వెనక్కి లాగుతోందని అర్థం. ఆ శక్తి మీ దురలవాట్లే కావచ్చు. ఓసారి మీకున్న అలవాట్లలో మంచివి ఎన్నో, చెడ్డవి ఎన్నో ఓ చోట రాసుకోండి. మంచి అలవాట్లను మించి చెడు అలవాట్లు అధికంగా ఉంటే మీకు విజయం ఆమడ దూరంలోనే నిలిచి పోతుంది. మనిషి విజయాన్ని ఆపే కొన్ని రకాల అలవాట్లు ఉన్నాయి. వాటిని ఈ క్షణమే వదిలేయాలి... అప్పుడే మీ భవిష్యత్తు బంగారంగా మారే అవకాశం ఉంటుంది. లేకుంటే బంగారంలాంటి మీ భవిష్యత్తును మీరే ఇనుములా మార్చేసుకోవచ్చు.
రాత్రి త్వరగా నిద్రపోవడం, ఉదయాన త్వరగా లేవడం అలవాటు చేసుకోవాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం చేయడం వల్ల సమయపాలన అలవాటవుతుంది. ఇది విజయానికి చాలా అవసరం. నచ్చిన సమయానికి నిద్రపోవడం, తెలివొచ్చినప్పుడు లేవడం అనేది సోమరిపోతు లక్షణం. ఇలాంటి వారికి విజయం దక్కదు.
మీ దగ్గర ఎంత ఎక్కువ డబ్బు ఉన్నా, లేక ఎంత తక్కువ డబ్బు ఉన్నా... ఆ డబ్బును మంచికే ఉపయోగించాలి. ఆ డబ్బుతో జూదం ఆడడం, పక్కవాడికి అప్పు ఇవ్వడం వంటివి చేయకూడదు. ముఖ్యంగా ఆ డబ్బును ఇతరుల పతనానికి వినియోగించకండి. అలా చేస్తే విజయం సంగతి దేవుడెరుగు... మీ గొయ్యి మీరే తవ్వుకున్నవారవుతారు.
మీలో అత్యాశ, కోపం వంటివి అధికంగా ఉండే మీరు ఏదైనా సాధించడం చాలా కష్టం. ఆ రెండూ ఉన్న చోట విజయం ఉండే అవకాశం తక్కువ. ఎవరికైనా ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ వల్ల మాత్రం మేలు జరగదు. మనిషి మరింతగా దిగజారే అవకాశం ఉంది. ఇక కోపం వల్ల గొడవలు ఎక్కువ అవుతాయి. గొడవలు ఉన్నచోట లక్ష్మీ దేవి నిలవదు. కోపం వల్ల కుటుంబసభ్యులు, బంధువులు కూడా దూరమవుతారు.
మీలో అతి ప్రేమ, అతి నమ్మకం వంటివి కూడా పనికిరావు. ఇవి మీరు మోసపోవడానికి అవకాశం ఉంది. అతి నమ్మకం మీరు మోసపోయేలా చేస్తాయి. అది మీ నాశనానికి కారణం అవుతుంది. చెడు స్నేహాల వల్ల కూడా ఓ మనిషి నాశనం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. మీ స్నేహితుల్లో చెడు అలవాట్లు అధికంగా ఉన్న వారు ఉంటే వెంటనే వారిని దూరం పెట్టాలి. వారి వల్ల మీ తీరు కూడా మారిపోయే అవకాశం ఉంది.
కుల, మత పిచ్చిలు కూడా మీలో ఉండకూడదు. ప్రతి మతాన్ని గౌరవించే లక్షణం మీకుండాలి. ఒక వర్గానికి పరిమితం అవ్వాల్సిన అవసరం లేదు. మంచి వారు ధనిక, పేద, ముస్లిం, హిందూ... ఎవరైనా సరే వారితో స్నేహం చేయాలి. పొదుపు చేసే లక్షణం మీలో ఉంటే మీ జీవితం విజయానికి చేరువు అవుతుంది. అలాగని పిసినారిలా ఉన్నా విజయం కష్టమే.