Wednesday Motivation: పాజిటివ్ థింకింగ్... ఏం జరిగినా మంచికే అనుకోండి, చివరికి అంతా మేలే జరుగుతుంది
Wednesday Motivation: మీ ఆలోచనలే మీ భవిష్యత్తును, మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. సానుకూల ఆలోచనలు ఉన్న వ్యక్తిని ఏ ఓటమి కుంగ తీయలేదు.
Wednesday Motivation: ఒక నావికుడు సముద్రంలో తన వాళ్లతో పాటు ప్రయాణిస్తున్నాడు. హఠాత్తుగా పెద్ద తుఫాను వచ్చింది. ఆ ఓడ మనుషులు లేని దీవి వైపుగా కొట్టుకుని వెళ్ళింది. ఎంతోమంది నావికులు భయంతో సముద్రంలో దూకేశారు. కానీ ఒక నావికుడు మాత్రం ఓడ ఎటు ప్రయాణం చేస్తుందో, అటు వెళ్లేందుకే నిర్ణయించుకున్నాడు. కనీసం ప్రాణాలు దక్కుతాయని ఆలోచించాడు. ఆ ఓడ ఒక దీవిలోకి వెళ్లి ఆగిపోయింది. అది నిర్మానుష్యమైన దీవి.
మిగతా నావికులు ఏమయ్యారో తెలియదు, కానీ ఈ నావికుడు మాత్రం బతికి బట్ట కట్ట కలిగాడు. ఎలా అయినా ఆ దీవి నుండి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ ఒక్క ఓడ కూడా అటువైపుగా రాలేదు. చివరికి విసిగి వేసారి పోయాడు. ఇంక తన జీవితం అక్కడే అని నిర్ణయించుకున్నాడు. చేతికి దొరికిన కర్రలు, కట్టెలు ఏరి తెచ్చుకొని చిన్న గుడిసె కట్టుకున్నాడు.
అడవిలో దొరికే దుంపలు, పండ్లు తింటూ జీవితాన్ని గడుపుతున్నాడు. కొన్ని నెలల పాటు జీవితం హాయిగా గడిచిపోయింది. ఒకరోజు అడవిలోకి ఆహారాన్ని తెచ్చుకునేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి అతని గుడిసె కాలిపోతూ కనిపించింది. ఆయనకున్న ఒకే ఒక్క తోడు ఆ గుడిసె. అది కూడా కాలిపోవడంతో నిలువ నీడ లేక, ఒంటరి అయిపోయాడు. అయినా కూడా అతనిలోని సానుకూల ఆలోచనలు తగ్గలేదు. మళ్లీ గుడిసె వేసుకొని జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఈ లోపు ఒక ఓడ అటువైపుగా రావడం గమనించాడు. ఇన్నాళ్ళు రాని ఓడ ఒక్కసారిగా ఆ దీవికి రావడం అతనికి ఆశ్చర్యాన్ని గురిచేసింది.
ఆ ఓడ దీవి దగ్గరికి వచ్చి ఆగింది. అందులోంచి ముగ్గురు నలుగురు వ్యక్తులు కిందకు దిగివచ్చారు. ‘మేము ఈ వైపుగా వెళ్తున్నాము. మాకు ఆకాశంలో నల్లటి పొగ కనిపించింది. ఇక్కడ ఏదో అయ్యిందని చూడేందుకు వచ్చాను. ఇక్కడ ఎవరో ఉన్నారని... వారిని కాపాడేందుకు వచ్చాము’ అంటూ చెప్పారు. నావికుడు గుడిసె కాలిపోవడం కూడా తనకు మేలే చేసిందని అనుకున్నాడు. అందుకే ఏ క్షణంలోనైనా నిరాశతో కుంగిపోకూడదు. మంచి జరిగినా, చెడు జరిగినా జీవితాన్ని ముందుకు సాగించేందుకే నిర్ణయించుకోవాలి. ప్రతి పని ఏదో ఒక కారణంతోనే జరుగుతుందని అర్థం చేసుకోవాలి.
పాజిటివ్‌గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయం చంపలేదు, నెగిటివ్‌గా ఆలోచించే వ్యక్తిని ఏ ఔషధం బాగు చేయలేదు... అని ఊరకే అనలేదు. పాజిటివ్ ఆలోచనలు మీలో శక్తి నింపితే, నెగటివ్ ఆలోచనలు మీలో నీరసాన్ని నింపుతాయి. మీరు ఏది సాధించలేరని కుందదీస్తాయి. ఏ వ్యక్తి అయితే నిత్యం పాజిటివ్ ఆలోచనలతో ఉంటారో ఆ వ్యక్తిని ఏ ఓటమి కుంగ దీయలేదు. ఈ నావికుడు దీవిలో తాను ఒంటరిగా బతకాల్సి వచ్చినప్పుడే బెంగ పెట్టుకుంటే పరిస్థితి మరోలా ఉండేది. అతను ధైర్యంగా ముందుకు సాగేందుకే నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు గుడిసె కాలినప్పుడు కూడా తన జీవితం ఇంతే అంటూ నిరాశ పడలేదు. మరో గుడిసె కట్టుకోవడానికి రెడీ అయ్యాడు. ఈలోపే అతడిని కాపాడేందుకు ఓడ వచ్చింది. జీవితంలో మీరు ఎంత సానుకూలంగా జీవిస్తే మీకు అంతా పాజిటివ్‌గా జరుగుతుందని అర్థం చేసుకోవాలి.