Wednesday Motivation: మీ దృష్టిలో డబ్బు కన్నా అతి ముఖ్యమైనది జీవితంలో ఏమిటి?-wednesday motivation what do you think is more important in life than money ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivation: మీ దృష్టిలో డబ్బు కన్నా అతి ముఖ్యమైనది జీవితంలో ఏమిటి?

Wednesday Motivation: మీ దృష్టిలో డబ్బు కన్నా అతి ముఖ్యమైనది జీవితంలో ఏమిటి?

Haritha Chappa HT Telugu

Wednesday Motivation: ఈ ప్రశ్న ఎవరినడిగినా ఒక్కొక్కరు ఒక్కో రకం సమాధానం చెబుతారు. కొందరు జీవితంలో డబ్బే ముఖ్యమని చెబుతారు. మరికొందరు మాత్రం తమ జీవితంలో ఏమి కోల్పోయారో వాటన్నింటి గురించి వివరిస్తారు.స

మోటివేషనల్ స్టోరీ (Pixabay)

Wednesday Motivation: జీవితంలో డబ్బు విలువ పెరిగిపోయింది. సుఖం నుంచి సంతోషం దాకా అందరూ డబ్బుతోనే కొనుక్కుంటున్నారు. నిజానికి కంటికి కనబడే వస్తువులు మాత్రమే డబ్బుతో లభిస్తాయి. కంటికి కనిపించని... మనసుకు మాత్రం తెలిసే ఆనందాలు, సంతోషాలన్నీ కొనేందుకు డబ్బు అవసరం లేదు. కరుణ, జాలి, ప్రేమ, దయ... ఇవన్నీ డబ్బును మించిన గొప్పతనాన్ని కలిగి ఉంటాయి. మానవతా విలువలు, నైతిక విలువలు కొలిచేందుకు డబ్బు ఏమాత్రం పనికిరాదు. మంచి ప్రవర్తన డబ్బు కన్నా ఎంతో విలువైనది.

ప్రపంచంలో ఎంతోమంది జీవితాల్లో డబ్బు కన్నా విలువైనది... సమయం. ఒక్కసారి మీ బాల్యాన్ని గుర్తు చేసుకోండి. ఎంత డబ్బును ఖర్చు పెడితే తిరిగి మీరు ఆ బాల్యాన్ని పొందగలరు. ప్రపంచ కుబేరులు అయినా కూడా తమ బాల్యాన్ని తమకున్న ఆస్తితో వెనక్కి తెచ్చుకోలేరు. అందుకే డబ్బుని ఎవరికోసమైనా ఖర్చు పెట్టొచ్చు. కానీ సమయాన్ని మాత్రం విలువైన మనుషుల గురించి మాత్రమే ఖర్చు పెట్టాలి. అందుకే డబ్బుతో పోలిస్తే సమయం చాలా విలువైనది. గడిచిన సమయాన్ని కొనితెచ్చే సాధనం ఏదైనా ఉంటే చెప్పండి... అది మాత్రమే విలువైనదని చెప్పుకోవచ్చు.

మరికొందరి జీవితాల్లో డబ్బు కన్నా నమ్మకం విలువైనది. డబ్బులు ఓసారి పోగొట్టుకుంటే... మళ్లీ కష్టపడి తిరిగి ఎలా అయినా సంపాదించుకోవచ్చు. కానీ సమయాన్ని, నమ్మకాన్ని పోగొట్టుకుంటే ఎన్ని కోట్లు ఇచ్చినా... మీరు తిరిగి ఎంత కష్టపడినా దాన్ని సంపాదించుకోవడం అసాధ్యం.

ఏది ఏమైనా సమయానికి జరగాల్సినవి కచ్చితంగా జరిగేలా చూడండి చాలు... సంపద అదే పెరుగుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు సమయాన్ని కోల్పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం. ఏ వయసులో చేయాల్సిన పనులను ఆ వయసులోనే పూర్తి చేయండి. లేకుంటే ఆ బాధ జీవితాంతం వెంటాడుతుంది.

ఎక్కడైనా డబ్బా? సమయమా? అనే ప్రశ్న ఎదురైతే సమయాన్ని ఎంచుకోండి. నిజానికి డబ్బులు... కాస్త సమయం తీసుకుని సంపాదించగలం. కానీ కరిగిపోయినా కాలాన్ని మాత్రమే ఎంత డబ్బు పెట్టినా తిరిగి పొందలేము. పోయిన డబ్బును తిరిగి సంపాదించవచ్చు. కానీ పోయిన కాలాన్ని మాత్రం తిరిగి సంపాదించలేము. అందుకే డబ్బుకు బదులు సమయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.

కాకపోతే ఈ కాలంలో డబ్బు చుట్టే ప్రపంచం తిరుగుతోంది. దానివల్లే ఎక్కువ విలువ ఇచ్చేవారు ఉన్నారు. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ డబ్బును సంపాదించడానికి కూడా ఎంతో కొంత సమయం పట్టే ఉంటుంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోబట్టే మీరు సంపదను సృష్టించగలిగారు. ఇక్కడ కూడా సమయానిదే విలువ, డబ్బుది కాదు.