Wednesday Motivation: పక్కవారిని నమ్మితే పనులు జరగవు, మిమ్మల్ని మీరే నమ్ముకోండి, ఈ పక్షి కథ అదే చెబుతోంది
Wednesday Motivation: ఎంతోమంది స్నేహితులను, బంధువులను నమ్మి గుడ్డిగా అడుగులు వేస్తారు. అలా చేయడం వల్ల పనులు జరగవు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటేనే విజయం మిమ్మల్ని వరిస్తుంది.
Wednesday Motivation: ఒక పక్షి పొలంలో గూడు కట్టుకుని పిల్లలతో హాయిగా నివసిస్తోంది. కొంతకాలానికి పంట కోతకు వచ్చింది. పక్షి, దాని పిల్లలు ఏ క్షణమైనా పొలం విడిచి వెళ్లేందుకు సిద్ధమవ్వాలి. ఒకరోజు తల్లి పక్షి ఆహారం కోసం వెళ్ళింది. ఆ సమయంలో పిల్లలు మాత్రమే గూడులో ఉన్నాయి. వాటికి రైతు మాటలు వినిపించాయి. ‘రేపు నా స్నేహితుడుతో కలిసి వచ్చి కోతలు పూర్తి చేయాలి’ అని అన్నాడు. రైతు అన్న ఆ మాటలను పక్షి పిల్లలు తమ తల్లికి చెప్పాయి. ‘అమ్మా... ఈ రోజే మనమిక్కడ నుంచి వెళ్లిపోవాలి. రేపు ఉదయం రైతు తన స్నేహితుడుతో వచ్చి పంటలను కోసేస్తాడు’ అని చెప్పాయి.
దానికి తల్లి పక్షి ‘రేపు కోతలు జరగవు. భయపడకండి. రేపు మనం ఇక్కడ ఉండవచ్చు’ అని చెప్పింది. మరుసటి రోజు నిజంగానే కోతలు జరగలేదు. ఆరోజు రైతు మళ్లీ పొలానికి వచ్చాడు. తల్లి పక్షి ఆహారానికి వెళ్ళింది. అప్పుడు రైతు ‘స్నేహితులతో పని కావడం లేదు. ఈసారి బంధువులను ఎవరినైనా పిలిచి రేపు కోతలు పూర్తి చేస్తాను’ అని అన్నాడు. ఆ మాటలు విన్న పక్షిపిల్లలు తల్లి గూడుకు తిరిగి వచ్చాక చెప్పాయి. అప్పుడు కూడా తల్లి పక్షి ‘రేపు కూడా కోతలు జరగవు. నిశ్చింతగా ఉండండి’ అని అంది. నిజంగానే రైతు కోతలు మొదలుపెట్టలేదు. రైతు బంధువుల రాకపోవడంతో వాటిని ఆపేశాడు .
మరుసటి రోజు మళ్లీ తల్లి పక్షి ఆహారానికి వెళ్ళింది. రైతు పొలానికి వచ్చాడు. అతను చాలా అసహనంగా ఉన్నాడు. ‘స్నేహితులు రాలేదు, బంధువులు రాలేదు. వీళ్ళని నమ్ముకుంటే పనులు జరగవు. ఈసారి నేనే రేపు కోతలు కోసేస్తాను’ అని అన్నాడు. అదే విషయాన్ని పక్షి పిల్లలు తల్లికి చెప్పాయి. తల్లి ‘మనం ఇక్కడ నుంచి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఈరోజు రాత్రికి మనం కొత్త గూడు కట్టుకొని వెళ్ళిపోదాం’ అని అంది
పక్షపిల్లలు ‘అమ్మా... రైతు రెండు రోజులు నుంచి బంధువులను, స్నేహితులను తీసుకువచ్చి కోతలు కోయిస్తానని అంటున్నాడు. ఆ విషయం మేము మీకు చెప్పినా మీరు కంగారు పడలేదు. కానీ ఇప్పుడు తానే కోస్తానని సిద్ధమయ్యాడు. అది మాత్రం ఎలా నమ్మారు’ అని అడిగాయి.
తల్లి పక్షి ‘ఇంతవరకు రైతు ఇతరుల సహాయం మీద ఆధారపడ్డాడు. వారి వల్ల పనులు జరగవని అర్థమైంది. ఈసారి తనే కోతలు కోసేందుకు సిద్ధమయ్యాడు. కాబట్టి కచ్చితంగా పంటను కోసేస్తాడు. ఇతరుల మీద ఆధారపడిన వ్యక్తి ఏ పనిని పూర్తి చేయలేడు. తనని తాను నమ్ముకుంటేనే పనిని పూర్తి చేయగలడు. అలాగే విజయం అయినా ఇతరుల సహాయం మీద ఆధారపడితే దక్కదు. మన మీద మనకు నమ్మకం ఉండి ముందుకు సాగితేనే దక్కుతుంది. ఈ రైతు కూడా తనని తాను నమ్ముకుని పొలంలోకి దిగుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కోతలు కోస్తాడు. మీరు కూడా పెద్దయ్యాక మిమ్మల్ని మీరే నమ్ముకోండి. ఎదుటివారిని నమ్మి గుడ్డిగా నిర్ణయాలు తీసుకోకండి’ అని చెప్పింది తల్లి పక్షి
ఇది అందరికీ వర్తిస్తుంది. స్నేహితులను, బంధువులను నమ్మి ముందుకు సాగే బదులు మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు సాగండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకునే శక్తి మీకు వస్తుంది. ఇతరుల సాయంతో సాధించిన విజయం కంటే... మిమ్మల్ని మీరు నమ్ముకొని కష్టపడి సాధించిన విజయం తీయటి గుర్తుగా మిగిలిపోతుంది.