Wednesday Motivation : మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే అవమానాలు.. ఆభరణాలవుతాయ్
Wednesday Motivation : మిమ్మల్ని జీవితంలో ఎంత మంది ప్రశ్నించినా ఫలితం ఉండదు. కానీ ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే అనేక ఆలోచనలు మీ మదిలోకి వస్తాయి. గెలుపు వైపు పయనం సాగుతుంది.
మనిషి జీవితం చాలా వింతైనది. కొందరికి ఎందుకు పుట్టామో తెలుస్తుంది. కానీ చాలా మందికి కేవలం తమ గురించి ఆలోచించకుండా బతికేస్తారు. తమ పుట్టుకకు అర్థం ఉండాలనుకున్నవారు ఎదుగుతారు. ఏమీ ఆలోచించని వారు నలుగురితో నారాయణ అన్నట్టుగా ఉంటారు. అందుకే జీవితంలో మీ మీద ప్రశ్నలతో యుద్ధం చేసుకోవాలి. అప్పుడే సక్సెస్ చూస్తారు. లేదంటే ఏమీ చేయలేరు.
జీవితంలో ఆలోచనలు చాలా ముఖ్యమైనవి. ఒక కోణంలో సానుకూలంగా ఆలోచిస్తే ఆ వ్యక్తి విజయం సాధించడం ఖాయం. అదే తప్పుగా అనుకుంటే ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితంలోని ఒడిదొడుకులు సాధారణంగా ప్రజలకు దుఃఖాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే ఈ రెండింటి మధ్య మనిషి ఆలోచన ప్రతికూలంగా ఉండకూడదు. నిజానికి, జీవితంలో మీ ఆలోచన ఎంత పెద్దదైతే మీ విజయం అంత పెద్దగా ఉంటుంది. మీ ఆలోచన సానుకూలంగా ఉంటే విజయం ఖాయం అవుతుంది.
జీవితంలో సానుకూలంగా ఆలోచించే వ్యక్తులు ప్రతి కష్టాల్లోనూ అవకాశాన్ని సృష్టిస్తారు. ప్రతికూల ఆలోచనాపరులు తరచుగా అవకాశాలను సృష్టించడం కంటే వాటిని సృష్టించడం ద్వారా విపత్తును సృష్టిస్తారు. అవకాశాలు సృష్టించుకునేందుకు మీకు ఆలోచన ఉండాలి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉండాలి.
నీ విజయానికి, అపజయానికి నీ ఆలోచనే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో చేసిన పనిని వదిలేయాలని అనిపించిన వెంటనే దాని వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోండి. ఎందుకు ఫెయిల్ అవుతున్నామో ప్రశ్నలు వేసుకోండి. మీకు మీరు విమర్శకులు కావాలి. అప్పుడే విజయం మీ వెనకాల నడిచి వస్తుంది.
జీవితంలో సంతోషం, విచారం రెండూ మన స్వంత ఆలోచనల ద్వారానే వస్తాయి. మీ ఆలోచన సానుకూలంగా ఉంటే, కచ్చితంగా మీ చర్యలు కూడా సానుకూలంగా ఉంటాయి. ఇది సంతోషకరమైన జీవితానికి పునాది అవుతుంది. మీ ఆలోచనలు ప్రతికూలంగా ఉంటే మీ చర్యలు కూడా ప్రతికూలంగా మారుతాయి. ఇది దుఃఖాన్ని కలిగిస్తుంది. అందుకే ఎప్పుడైనా పాజిటివ్‌గా ఆలోచించాలి.
విలువను బట్టి వ్యక్తి ఆలోచనలు, ఉద్దేశాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఒక మంచి ఉదాహరణ ఏంటంటే.. టీలో ఈగ పడితే అది బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అదే నెయ్యిలో ఈగ పడితే బయటకు వచ్చేందుకు ఇక కష్టం. అతక్కుని పోతుంది. మీ ఆలోచనలు కూడా అలానే ఉండాలి. ఏదైనా ఇబ్బందులు వస్తే.. ఆలోచనలతో బయటపడాలి. అందులోనే అతుక్కుని ఉండకూడదు. జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలనే ఆలోచన చేయాలి.
ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఎప్పుడూ మూడు ప్రశ్నలు మీకు మీరు వేసుకోండి. నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? ఫలితాలు ఏంటి? నేను విజయం సాధిస్తానా? వీటి గురించి లోతుగా ఆలోచించండి. ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించినప్పుడే ముందుకు సాగాలి.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. జీవితంలో ముందుకు వెళ్తుంటే ఎన్నో అవమానాలు మీకు ఎదురవుతాయి. వాటిని చూస్తూ అక్కడే ఆగిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఎదుర్కొన్న అవమానాలు ఏదో ఒక రోజు మీకు ఆభరణాలుగా అనిపిస్తాయి. అవమానాలు ఎదుర్కొంటేనే మనిషి స్ట్రాంగ్ అవుతాడు. లక్ష్యంపై ఫోకస్ చేస్తాడు.