Wednesday Motivation | నిన్ను నువ్వు నమ్ముకో, ఎంత దూరమైనా దూసుకపో.. ఎట్లయితే గట్లాయే!-wednesday motivation no matter what do not quit fight back till you get success ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Wednesday Motivation - No Matter What Do Not Quit, Fight Back Till You Get Success

Wednesday Motivation | నిన్ను నువ్వు నమ్ముకో, ఎంత దూరమైనా దూసుకపో.. ఎట్లయితే గట్లాయే!

HT Telugu Desk HT Telugu
Mar 09, 2023 05:05 AM IST

Wednesday Motivation: ఎదురుదెబ్బలు తగిలినపుడు మనసు వెనకడుగేయమని చెబుతుంది. కానీ ఎదురుతిరిగి చూడు, నిన్నటి నీ ఓటమే నిన్ను చూసి వెనకడుగు వేస్తుంది, గెలుపును నీదరికి పంపుతుంది. కాబట్టి భయం వద్దు.. నిన్ను నువ్వు నమ్ముకో, ఎంత దూరమైనా దూసుకపో, ఎట్లయితే గట్లాయే.

Wednesday Motivation
Wednesday Motivation (Unsplash)

Wednesday Motivation: మనం అనుకున్న పని ఏదైనా జరగనపుడు కొంత అసంతృప్తి కలుగుతుంది, అది జరిగాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోతే అప్పుడు మనల్ని నిరాశ నిస్పృహలు ఆవహిస్తాయి. ఇక ఏం ఈ పని జరగదు అని మనసులో ప్రతికూల ఆలోచనలు రావడం మొదలవుతాయి. ఈ సమయంలో మీ మైండ్ కూడా నువ్వు ఏది చేసినా నీకు ఫలితాలు అనుకూలంగా రావని, నీతో ఇది సాధ్యం కాదు ఇక వదిలెయ్ అని చెప్తుంది. ఈ రకమైన మనస్తత్వం మనల్ని మరింత దిగజార్చుతుంది. మిమ్మల్ని మానసికంగా మరింత బలహీనమైన వ్యక్తిని చేస్తుంది. కానీ ఇది సరైన ఆలోచన కాదు, అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా పాజిటివ్​గా ఉండడం నేర్చుకోవాలి. పాజిటివ్​గా ఉండటం అనేది చెప్పినంత సులువు కాదు కానీ, నెగిటివ్ ఆలోచనలు మీ పరిస్థితిని ఎప్పుడూ మెరుగుపరచవు. ఇంకా దిగజార్చుతూనే ఉంటాయి.

ఎదురుదెబ్బలు తగిలినపుడు ముందుకు వెళ్లాలంటే మీ మైండ్ మిమ్మల్ని రక్షణాత్మక ధోరణిలో వ్యవహరించేలా చేస్తుంది. మీలో తెలియని భయాన్ని కలిగిస్తుంది. ఇంతకుముందు నేను ఏదైనా సాధించగలను అనుకున్న మీరే, ముందడుగు వేస్తే ఏమౌతుందోనన్న సందిగ్ధంలో ఉంటారు. ఓటమి వచ్చిన ప్రతీసారి మనసు నెగిటివ్ ఆలోచనలనే ఎక్కువ కలిగిస్తుంది. ముందు మన ఆలోచనలను మనం జయిస్తే, అనుకున్నవి సాధించడం సులువు అవుతుంది.

ఒక పెద్దమనిషి మాట్లాడుతూ.. 'ఈరోజు కఠినంగా ఉంటుంది, రేపు ఇంకా కఠినంగా ఉంటుంది, కానీ ఆ తర్వాత రోజు ఉన్నతంగా ఉంటుంది. కానీ చాలామంది రేపు సాయంత్రం చనిపోతారు' అని. అంటే ఈ వాక్యానికి చాలా లోతైన అర్థం ఉంది. చివరి వరకు పోరాడి విజయం ముంగిట నీరసించి ఓడినట్లు, ఇంకాస్త పోరాడితే అనుకున్నది సాధించేవారు కదా అని ఇక్కడ అర్థం వస్తుంది.

కాబట్టి భయం వద్దు.. మీ ఆత్మవిశ్వాసంపై నమ్మకం ఉంచండి. ఏ వ్యక్తి విజయానికైనా బలమైన ఆత్మవిశ్వాసమే ఆయుధం. మనకు అసాధ్యమనేది ఏది లేదు. చేయాలనే సంకల్పం ఉండాలే కానీ ఏదైనా సాధించవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే, మీరు అనుకున్నవన్నీ కచ్చితంగా సాధిస్తారు. మిమ్మల్ని మీరు విశ్వసిస్తే వైఫల్యం కూడా మిమ్మల్ని చూసి భయపడుతుంది.

అందుకు సమయం కావాలి, కాస్త ఓపిక ఉండాలి. అయితే మరోవైపు సమయం కోసం కూడా అలాగే ఎదురుచూస్తూ కూర్చోకూడదు. మనకి కావాల్సింది ఏదొక రోజు వస్తుందని నమ్మకంతో ఉండడం తప్పు కాదు. కానీ.. ఆ నమ్మకంతో మనం ఎలాంటి ప్రయత్నం చేయకపోవడమే తప్పు. సరైన సమయమనేది ఎప్పటికీ రాదనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎదురు చూస్తూ కూర్చుంటే.. సమయం మించిపోతుందన్న విషయం కూడా మరిచిపోకూడదు.

మీరు దేని గురించైతే కష్టపడుతున్నారో, ఏది జరగాలని ప్లాన్​ చేస్తున్నారో, దానికోసం ఒక్కొక్క ప్రయత్నం చేస్తూపోండి. మీ లక్ష్యం సాధించడం కోసం అంకితాభావాన్ని కలిగి ఉండాలి. మీ గమ్యాన్ని చేరుకోవడానికి ఒక్కొక్క అడుగు వేస్తూపోండి. ఒక కచ్చితమైన ప్రణాళికను రూపొందించుకోవాలి, ఆ ప్రణాళికా ప్రకారంగా ముందుకు సాగాలి. ఫలితం రావడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఆ వచ్చే ఫలితం ఫలవంతంగా ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం