Wednesday Motivation : ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించపోవచ్చు.. కానీ వానలో బండారం బయటపడుతుంది..
Wednesday Motivation : ప్రపంచంలో ఏ మనిషి వంద శాతం మంచోడు అని చెప్పలేం. ప్రతీ మనిషిలో కచ్చితంగా నెగెటివ్ లక్షణాలు ఉంటాయి. కానీ సమయంలో వచ్చినప్పుడు మాత్రం బయటపడతాడు.
ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించపోవచ్చు.. కానీ వానలో బండారం బయటపడుతుంది.. మనిషి కూడా అంతే. ఏ సమయంలోనైనా అసలు రంగు బయటపడవచ్చు. మనం మాత్రం ఒక్క వ్యక్తిని నమ్మితే పూర్తిగా నమ్మేస్తాం. సాధారణంగా మనుషులు చేసే అతిపెద్ద తప్పు.. ఇదే. నమ్మితేనే కదా మోసం చేసేది అని మాత్రం ఎవరూ అనుకోరు. గుడ్డిగా నమ్మేస్తారు. అక్కడే తప్పులో కాలేస్తారు. మీకు సమస్య వచ్చినప్పుడు పక్కన నిలబడి ఉండకుండా వెళ్లిపోయినప్పుడు మీరు నమ్మిన వ్యక్తి నిజస్వరూపం బయటపడుతుంది.
ఏ బంధమైనా నమ్మకమే పునాది. కానీ ఆ పునాది మీరు అనుకున్నంత స్ట్రాంగ్‌గా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎవడి లైఫ్ వాడితే. పీకల దాగా వచ్చిందంటే ఎవరైనా మిమ్మల్ని ఎడారిలో వదిలేసి.. నీళ్ల బాటిల్ కూడా ఇవ్వకుండా వెళ్లిపోతారు. ప్రపంచంలో ఒక్క మనిషి కూడా పర్ఫెక్ట్ అని చెప్పలేం. కచ్చితంగా కనిపించని మరో కోణం ఉంటుంది. కానీ అది నమ్మినవారు తెలుసుకోలేరు.
మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారు అనుకునేవారు.. మిమ్మల్ని వదిలేసిన రోజులు చాలనే ఉంటాయి. అప్పుడు అసలు బండారం బయటపడుతుంది. అందుకే మీకు మీపై నమ్మకం ఉండాలి. ఈ లోకంలో ఎవడూ ఎవడికీ ఏం చేయడు. కేవలం మిమ్మల్ని పైకి లేపుకొనేది మీరు మాత్రమే. మనిషి అంటేనే స్వార్థపరుడు. కానీ బయటకు కనిపించనివ్వడు. మీతో భవిష్యత్తులో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో లెక్కలేసుకుని మీ దగ్గరకు వస్తారు. మీ నుంచి లాభం లేదనుకున్నప్పుడు మిమ్మల్ని నెమ్మదిగా సైడ్ చేస్తారు. ఆ విషయం మీకు అర్థమయ్యేసరికా చాలా రోజులు పడుతుంది.
మీకు నమ్మకం ఉన్న వ్యక్తులను వంద శాతం నమ్మకండి.. 70, 80, 90.. ఇలా లెక్కలు వేసుకోండి. ఎందుకంటే పూర్తిగా వందకు వంద శాతం నమ్మకమైన వ్యక్తులు లేరిక్కడ. మీరు పూర్తిగా నమ్మేస్తే.. చివరిగా బాధపడేది మీరే. ఎందుకంటే మీకు వారిపై కొన్ని అంచనాలు ఉంటాయి. నా కష్టంలో నాకు తోడు ఉంటారు అని మీకు పెద్ద పెద్ద ఊహలు ఉంటాయి.. కానీ కష్టం వస్తే నీ కాంపౌండ్ వాల్ కూడా తొక్కరు. నీ సమస్యకు నువ్వే సమాధానం కావాలి. నీ కష్టాన్ని నువ్వే తీర్చుకోవాలి.
మనిషి బుద్ధి చాలా తిక్కది.. అవసరమైతే తేనెలా మాట్లాడిస్తుంది.. లేదంటే కంటి కారం కొట్టి మంట పుట్టించేలా చేస్తుంది. అందుకే ఏ బంధమైనా వాళ్ల మీదకు వస్తే మీమ్మల్ని ఒంటరి చేస్తుంది. మీకు మీరే తోడుగా ఉండాలి. మీకంటూ కొండంత ధైర్యం ఉండాలి. మీ ఎమోషన్స్ కోసం ఇతరుల మీద ఆధారపడటం మెుదలుపెడితే.. మీతో ఆడుకుంటుంది ఈ సమాజం. మనుషులను అర్థం చేసుకోవడం మెుదలుపెట్టినప్పుడు జీవితానికి అర్థం అర్థమవుతుంది. లేదంటే వేరేవారి స్వార్థంలో పడి మీరు బతుకు బండిని నడిపిస్తూ ఉండాలి.
కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా.. దానికి రక్తం చిందించడమే తెలుసు
కొన్ని బంధాలు కూడా అంతే.. ఎంత ప్రేమగా ఉన్న నమ్మకద్రోహం చేయడమే తెలుసు
చివరిగా గుర్తు పెట్టుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే..
నీలోని ప్రశ్నలకు సమాధానం నువ్వే..
నీలోని సమాధానాలకు ప్రశ్నవు నువ్వే..