Wednesday Motivation: మనిషి చాలా సామాన్యుడు. ఏ మనిషి కూడా తప్పు చేయకుండా బతకలేడు. అతని వల్ల పక్కన జీవించే వారెందరో నష్టపోయి ఉంటారు. ఎంతో మంది జీవితాలు తారుమారై ఉంటాయి. తాము చేసిన తప్పులు తెలిసినా కూడా ఒప్పుకునే వారి సంఖ్య చాలా తక్కువ. కానీ ఒక్కసారి తాము జీవితంలో చేసిన తప్పులున్నంటినీ ఎదుటి ఎదుటివారి దగ్గర ఒప్పుకొని చూడండి. మీ ఆలోచనలు, భావాలు, మనసు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఇది భావాలను పంచుకోవడమే అనుకోండి. మీలో ఉన్న బాధను దూరం చేసుకోవడానికి ఒక్కసారి... చేసిన తప్పులు అన్నింటినీ ఒప్పుకోండి.
మీరు చేసిన తప్పులు మీ హృదయానికి మాత్రమే తెలుస్తాయి. కానీ వాటిని పంచుకునే ధైర్యం మాత్రం మీలో ఉండదు. చేసిన తప్పులను త్వరగా ఒప్పుకునే వారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా, ప్రశాంతంగా జీవిస్తారు. ఒప్పుకోవడం అంత తేలిక కాకపోవచ్చు కానీ ఒప్పుకున్న తర్వాత మీరు పొందే ఆనందం మాత్రం వెలకట్టలేనిది.
చేసిన తప్పులను ఒప్పుకోవాలంటే ధైర్యవంతుడికే సాధ్యం. దృఢమైన హృదయం కలవాడు మాత్రమే ఆ పని చేయగలడు. బలహీనులు, పిరికివాళ్లు తప్పులు ఒప్పుకోలేరు. ఆ పరిస్థితి నుంచి తప్పించుకొని పారిపోతారు. మీరు చేసిన పనులకు ఎంతోమంది బాధలు అనుభవించి ఉంటారు. ఆ బాధ మీలో పశ్చాత్తాపంగా మారుతుంది. హృదయంలో బరువుగా మారి లోపల కుమిలిపోయేలా చేస్తుంది. ఆ బాధ నుంచి మీరు విముక్తి పొందాలంటే మీ తప్పులను మీరు ఒప్పుకోవాలి.
మీరు బలహీనులో, బలవంతులో మీరే నిర్ణయించకండి. బలవంతులంటే కండలు పెంచినవారు కాదు, మనస్ఫూర్తిగా చేసిన ప్రతి పనిని ధైర్యంగా చెప్పేవారు. మీరు బలహీనంగా ఉండాలనుకుంటున్నారో... బలంగా ఉండాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. హృదయాన్ని, మీ ఆత్మను తేలికపరచుకోవాలన్నా... జీవితంలో ఎప్పుడూ పశ్చాత్తాపం మీ దరికి రాకూడదనుకున్నా... ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఎంతమంది మీ వల్ల బాధపడ్డారో... వారందరినీ కలిసి లేదా ఫోన్ ద్వారా మీ తప్పును ఒప్పుకోండి. అలాగే క్షమాపణలు అడగండి. కొంతమంది కోపం పెట్టవచ్చు, మరి కొందరు మంచి మనసుతో క్షమించవచ్చు. ఏం జరిగినా మీ మనసు తేలిక పడడం మాత్రం ఖాయం. తప్పు ఒప్పుకుంటే మీ తలపై ఉన్న కిరీటం కింద పడిపోదు. పైగా మనసు తేలికగా మారుతుంది. ఆ ఆనందాన్ని ఒక్కసారి అనుభవించి చూడండి. ఒకరిని మోసం చేసిన బాధ, నాశనం చేసిన పని... జీవితాంతం మిమ్మల్ని వెంటాడకుండా ఉండాలంటే... మీ తప్పుల్ని మీరు నిజాయితీగా ఒప్పుకోవాలి.