Ways to remove mehndi: మెహందీని తేలికగా వదిలించుకోవచ్చిలా..
Ways to remove mehndi: ఏదైనా వేడుక కోసం పెట్టుకున్న మెహెందీ తాలూకు మచ్చలు తొందరగా వదలట్లేదా? అయితే కొన్ని చిట్కాలతో మీ సమస్య తీరిపోతుంది. అవేంటో చూసేయండి.
ఇంట్లో శుభకార్యాలైనా, పండగలు, పబ్బాలైనా అమ్మాయిలే కాదు మహిళలూ చక్కగా వారి చేతుల్ని మెహందీతో అలంకరించుకునేందుకు ఇష్టపడుతుంటారు. అయితే పెట్టుకున్న తర్వాత రెండు, మూడు రోజుల పాటు ఆ పండిన గోరింటాకు చాలా అందంగా ఉంటుంది. కానీ తర్వాత మాత్రం సగం వెలిసిపోయి, సగం వెలిసిపోకుండా చికాకుగా అనిపిస్తుంది. అలాగే జట్టుకు కొంతమంది హెన్నా ప్యాక్‌లు వేసుకుంటుంటారు. అది పొరపాటున ముఖంపైన మెడపైన అంటి పండిపోతుంటుంది. అలాంటి మచ్చల్ని కూడా ఇంట్లో సాధారణంగా ఉండే పదార్థాలతోనే తొందరగా వదిలించుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు చూసేద్దాం.
ట్రెండింగ్ వార్తలు
శానిటైజర్ వాడొచ్చు :
చేతులను శుభ్రం చేసుకునే శానిటైజర్, లేదా క్లెన్సర్‌ని చేతులపై వేసుకుని నురగ వచ్చేంత వరకు నీరు పోసి బాగా రుద్దుకోవాలి. తర్వాత కడిగేసుకోవాలి. శానిటైజర్లు చేతుల్లోని క్రిముల్ని చంపేందుకు ఫార్ములేట్ చేసినవి. అందువల్ల సాధారణంగా దీనిలో ఆల్కహాల్ ఉంటుంది. ఇది చేతులకు ఉన్న మెహందీని తీసేసేందుకూ పనికి వస్తుంది.
వంట సోడా ఉపకరిస్తుంది :
చాలా మొండి మరకలనైనా తీసివేయగల సత్తా వంట సోడాకు ఉంటుంది. దుస్తులపై మరకల్ని వదిలించేందుకూ దీన్ని ఉపయోగిస్తారు. అలాగే ఇది చేతులపై ఉండే మెహందీని వదిలించడంలోనూ ఉపయోగపడుతుంది. ఒక చెంచాడు బేకింగ్ సోడాని తీసుకుని చేతుల్లో వేసుకుని ఐదు నిమిషాల పాటు బాగా రుద్దుకుని నీటితో కడిగేసుకోవడమే. అయితే సోడా చేతులను పొడిబారేలా చేస్తుంది. అందుకే తర్వాత చేతులకు మాయిశ్చరైజర్ రాసుకోవడం మాత్రం తప్పనిసరి.
పంచదారతో ఇది కలపండి :
చేతిలో కాస్త పంచదార వేసుకుని దానికి నాలుగు చుక్కల కొబ్బరి నూనెను చేర్చండి. ఇది మంచి స్కిన్ స్క్రబ్‌లా పని చేస్తుంది. అందుకనే ఈ రెండింటినీ కలిపి చేతిలోనే పేస్ట్‌లా అయ్యేంత వరకు రుద్దుతూ ఉండండి. మెహందీ ఎక్కడైతే ఊడిపోవాలనుకుంటున్నారో అక్కడ ఎక్కువ ఒత్తిడిని కలిగించేందుకు ప్రయత్నించండి. ఫలితం ఉంటుంది. పైన పొట్టులాగా ఉన్న మెహెందీ కాస్త ఊడి వచ్చేస్తుంది.
నిమ్మరసం ట్రై చేయండి :
నిమ్మరసం చర్మాన్ని లైటెన్ చేస్తుంది. తెల్లగా మార్చే ఈ లక్షణం వల్ల ఇది మెహందీని వదిలించుకోవడానికీ బాగా పని చేస్తుంది. చేతులకు నిమ్మరసాన్ని పట్టించి ఉంచి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది.
కండిషనర్ పని చేస్తుంది :
చాలా మంది జుట్టుకు షాంపూ అయిపోయిన తర్వాత కండిషనర్ అప్లై చేస్తుంటారు. దాన్ని చేతుల మెహందీని పోగొట్టుకునేందుకూ వాడవచ్చు. చేతులకు రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది.
ఈ పై పదార్థాలన్నీ హెన్నా మచ్చల్ని వదిలించుకునేందుకూ ఉపయోగపడతాయి.