Washing Machine: వాషింగ్ మెషీన్‌ను సరిగ్గా ఉపయోగించకపోతే మీ ఆరోగ్యానికి ప్రమాదమట! ఈ తప్పులు మాత్రం చేయకండి!-washing machine if the washing machine is not used properly it is dangerous for your health dont make these mistakes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Washing Machine: వాషింగ్ మెషీన్‌ను సరిగ్గా ఉపయోగించకపోతే మీ ఆరోగ్యానికి ప్రమాదమట! ఈ తప్పులు మాత్రం చేయకండి!

Washing Machine: వాషింగ్ మెషీన్‌ను సరిగ్గా ఉపయోగించకపోతే మీ ఆరోగ్యానికి ప్రమాదమట! ఈ తప్పులు మాత్రం చేయకండి!

Ramya Sri Marka HT Telugu
Published Feb 09, 2025 01:00 PM IST

Washing Machine: వాషింగ్ మిషన్ వచ్చాక చాలా మంది మహిళలకు కాస్త ఉపశమనం లభిస్తుంది. శుభ్రంగా బట్టలు ఉతికేసి ఆరబెట్టే మిషన్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అయితే వాషింగ్ మెషీన్ రోజూ ఉపయోగించడం మాత్రమే కాదు కొన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవాలట. లేదంటే అది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందట. ఎలాగంటే..

వాషింగ్ మెషీన్‌ను సరిగ్గా ఉపయోగించకపోతే మీ ఆరోగ్యానికి ప్రమాదమట!
వాషింగ్ మెషీన్‌ను సరిగ్గా ఉపయోగించకపోతే మీ ఆరోగ్యానికి ప్రమాదమట! (shutterstock)

రోజంతా పనిచేసి అలసిపోయే మహిళలకు వాషింగ్ మిషన్ మంచి ఉపశమనం. బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషీన్ చాలా సులభమైన, సౌకర్యవంతమైన సాధనం. ఇది తక్కువ సమయంలో బట్టలను ఉతికడమే కాకుండా ఆరబెడుతుంది. కానీ చాలా మంది బట్టలు ఉతికేటప్పుడు, ఉతికిన తర్వాత కొన్ని పొరపాట్లు చేస్తారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. బట్టలు ఉతుకుతున్న సమయంలో మాత్రమే కాదు.. వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతికిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదట. లేదంటే ఇది బ్యాక్టీరియా పెరగడానికి దారితీసి, వ్యాధులకు కారణం అయి మీ ఆరోగ్యానికి హాని చేస్తుందట. బట్టలు ఉతికిన తర్వాత మీరు ఈ పనులు చేస్తున్నట్లయితే వెంటనే ఆపండి.

తడి బట్టలను మెషీన్‌లోనే వదిలేయడం

చాలా మంది వాషింగ్ మిషన్లో బట్టలు వేసి అలాగే వదిలేస్తారు. మిషన్ ఉతికేసి దానికదే ఆఫ్ అయి పోయాక వెంటనే ఆరబెట్టకుండా అలాగే చాలా సేపు ఉంచుతారు. కొందరైతే రాత్రి బట్టలు మిషన్లో వేసి ఉదయం ఆరేస్తారు. అంటే వాటిని మెషీన్‌లోనే రాత్రంతా వదిలేస్తారు. ఇది ఆరోగ్యానికి హానికరం. వాస్తవానికి, బట్టల నుండి నీరు పోయిన తర్వాత కూడా చాలా తేమ ఉంటుంది. తడి బట్టలు మూసి ఉన్న వాషింగ్ మెషీన్‌లో రాత్రంతా ఉంటే, వాటిలో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ఇది బట్టల్లోకి చేరుకుని వేసుకున్న తర్వాత ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి బట్టలు ఉతకడం అయిన వెంటనే వాటిని తీసి ఎండ లేదా గాలి తగిలే చోట ఆరబెట్టాలి.

వాషింగ్ మెషీన్ మూతను మూసివేయడం

వాషింగ్ మెషీన్‌లో నుంచి బట్టలు తీసిన తర్వాత వెంటనే మూత వేసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తడి ఉపరితలంతో ఉన్న మిషన్‌లో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పెరగవచ్చు. ముఖ్యంగా ఫ్రంట్ లోడ్ మెషీన్ల మూతలు నీరు, గాలి బయటకు రాకుండా ఉంటాయి. ఈ రకమైన మెషీన్లను వెంటనే మూసివేయడం వల్ల బ్యాక్టీరియా పెరగవచ్చు. అవి బట్టల ద్వారా మీ శరీరంలోకి కూడా చేరవచ్చు. కాబట్టి బట్టలు ఉతికిన తర్వాత వాషింగ్ మెషీన్ మూతను కొంత సేపు తెరిచి ఉంచండి. గాలి ద్వారా ఆరిపోయాక మూసేయండి.

అండర్ వేర్, సాక్స్ ఉతకడం

వాషింగ్ మెషీన్‌లో అండర్ వేర్, సాక్స్ వంటి వాటిని ఎప్పటికీ ఉతకకూడదు. వీటిలోని మురికి బ్యాక్టీరియా మెషీన్‌లో ఉన్న ఇతర బట్టలకు వ్యాపించి వాటిని పూర్తిగా శుభ్రం కానివ్వవు. వీటితో కలిపి ఉతికిన బట్టలు వేసుకోవడం వల్ల చర్మ సమస్యలు, దురద, దద్దుర్లు వంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.

బెడ్‌షీట్లను వేడి నీటితో ఉతకకపోవడం

కంటికి కనిపించవు గానీ బెడ్‌షీట్లపై వందలాది హానికరమైన జీవులు ఉంటాయి. వాటిని మిషిన్ లో వేసి శుభ్రం చేయడానికి మనం ఉతికేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చల్లని నీటితో ఉతికితే ఈ జీవులు పూర్తిగా శుభ్రం కావు. బదులుగా బెడ్‌షీట్లపై పసుపు మచ్చలు వేస్తాయి. ఎల్లప్పుడూ వేడి నీటితోనే బెడ్‌షీట్లను వాషింగ్ మెషీన్‌లో ఉతకాలి. దీని వల్ల జీవులు, బ్యాక్టీరియా తొలగిపోతాయి. ఉపయోగించడానికి చక్కగా, ఆరోగ్యకరంగా ఉంటాయి.

వాషింగ్ మెషీన్ శుభ్రం చేయకపోవడం

వాషింగ్ మెషీన్ బట్టలను శుభ్రం చేస్తుంది. కానీ అప్పుడప్పుడూ దాన్ని కూడా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. వాషింగ్ మెషీన్‌లో చిన్న, పెద్ద రంధ్రాలు ఉంటాయి. వాటిలో మురికి, బ్యాక్టీరియా చేరుకుని ఉంటాయి. వీటిని ఎక్కువ కాలం అలాగే ఉంచితే అవి వి బట్టలు ఉతికేటప్పుడు మళ్ళీ బట్టలకు అంటుకుంటాయి. కాబట్టి నెలకు ఒకసారి వాషింగ్ మెషీన్‌ను శుభ్రం చేయడం చాలా ముఖ్యం.

Whats_app_banner