వేసవిలో వేడి పాలు తాగాలా లేక చల్లటి పాలు తాగాలా? ఏవి తాగితే మంచి ప్రయోజనాలను పొందచ్చో తెలుసుకోండి?-warm milk or cold milk for summer understanding the advantages ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  వేసవిలో వేడి పాలు తాగాలా లేక చల్లటి పాలు తాగాలా? ఏవి తాగితే మంచి ప్రయోజనాలను పొందచ్చో తెలుసుకోండి?

వేసవిలో వేడి పాలు తాగాలా లేక చల్లటి పాలు తాగాలా? ఏవి తాగితే మంచి ప్రయోజనాలను పొందచ్చో తెలుసుకోండి?

Ramya Sri Marka HT Telugu

ఆరోగ్యంగా ఉండేందుకు పాలు తాగడం చాలా అవసరం. అయితే వేసవిలో వేడి పాలు తాగితే మంచిదా లేక చల్లటి పాలు తాగడం మంచిదా? ఏది తాగిచే మంచి ప్రయోజనాలను పొందచ్చో తెలుసుకుందాం రండి.

వేసవిలో పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

పాలు కేవలం పానీయం కాదు ఒక సంపూర్ణ ఆహారం. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ ఇది ఒక పోషకాహార గని. అయితే సీజన్ మారినప్పుడు మన ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా వేసవి కాలం రాగానే వేడి వేడి ఆహారాల పట్ల ఆసక్తి తగ్గి, చల్లని పానీయాలు, చల్ల చల్లటి ఆహారాల కోసం మన మనస్సు తహతహలాడుతుంది.

మరి పాల విషయంలో మనం ఏం చేయాలి? మొదటి నుంచి పాలను వేడిగా తాగడమే అందరికీ అలవాటు. అయితే వేసవిలో వేడి వాతావరణం కారణంగా చల్లటి పాలను తాగడం మంచిదేనా? సమ్మర్లో పాలను ఏ రూపంలో తీసుకుంటే మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది? అంటే నిపుణులు వేసవిలో చల్లటి పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. సాంప్రదాయకంగా వస్తున్న అలవాట్లను పక్కనబెట్టి, వేసవిలో చల్లటి పాలను ఎందుకు తీసుకోవాలి? దాని వల్ల మన శరీరం పొందే అద్భుతమైన లాభాలు ఏంటో తెలుసుకుందాం రండి..

వేసవిలో చల్లటి పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది

వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అటువంటి సందర్భంలో చల్లటి పాలు ఈ పరిస్థితిలో ఒక అద్భుతమైన సహజ పరిష్కారంగా పనిచేస్తాయి. ఇందులో పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఎలక్ట్రోలైట్లు శరీరం కోల్పోయిన ఖనిజాలను తిరిగి నింపడంలో సహాయపడతాయి, తద్వారా డీహైడ్రేషన్ సమస్యను సమర్థవంతంగా నివారిస్తాయి. అంతేకాకుండా చల్లటి పాలలో ఉండే నీటి శాతంశరీరాన్ని తిరిగి హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది, మిమ్మల్ని తాజాగా మరియు శక్తివంతంగా ఉంచుతుంది.

పోషకాల నిధి

పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి12 వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వేడి వాతావరణంలో చల్లటి పాలు తాగడం వల్ల ఎముకలు బలపడతాయి, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

వేసవి కాలంలో మన శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంది. అయితే, చల్లటి పాలు ఈ సమస్యకు ఒక చక్కటి పరిష్కారంలా పనిచేస్తాయి. వీటిని తాగడం వల్ల కడుపులో చల్లదనం ఏర్పడుతుంది. , ఇది జీర్ణక్రియను మరింత సులభతరం చేస్తుంది. అంతేకాదు వేసవిలో చాలా మందిని వేధించే అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యల నుండి కూడా చల్లటి పాలు ఉపశమనం కలిగిస్తాయి.

బరువు తగ్గడం

పాలలో ఉండే లాక్టోస్ తక్షణ శక్తినిస్తుంది, వేసవి అలసటను తగ్గిస్తుంది. చల్లటి పాలు బరువు నిర్వహణకు తోడ్పడతాయి. పాలలో కాల్షియం జీవక్రియను మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడానికి పరోక్షంగా సహాయపడుతుంది. వేసవిలో ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో పాటు చల్లటి పాలు తీసుకోవడం చాలా మంచిది.

చర్మానికి ప్రయోజనకరం

చల్లటి పాలు వేసవిలో చర్మానికి ఒక అద్భుతమైన టానిక్‌లా పనిచేస్తాయి. చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది. తద్వారా వేడి వల్ల వచ్చే చర్మ సంబంధిత సమస్యలైన దురద, దద్దుర్లు, పొడిబారడం వంటి వాటిని తగ్గిస్తుంది. అంతేకాకుండా, పాలలో సహజంగా ఉండే లాక్టిక్ యాసిడ్ తేలికపాటి ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి చర్మాన్ని మరింత మృదువుగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి, వేసవిలో మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చల్లటి పాలను తీసుకోవడం ఒక సహజమైన, ప్రభావవంతమైన మార్గం.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.