Kitchen Hacks: ఫ్రిజ్ లేకుండా పాలను ఎక్కువసేపు నిల్వ చేయాలనుకుంటున్నారా? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి
Kitchen Hacks: ఇంట్లో ఫ్రిజ్ పాడైపోతే పాలను ఎలా నిల్వ చేయాలో తెలియక ఎంతో మంది సతమతమవుతారు. ఫ్రిజ్ పాడైనా కూడా పాలను కొన్ని పద్ధతుల్లో వాటిని కాపాడుకోవచ్చు. పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఈ విధంగా నిల్వ చేసుకోండి
ప్రతి ఇంట్లో పాలు కచ్చితంగా ఉంటాయి. చంటి పిల్లలకు పాల కోసం, పెద్దలకు టీ, కాఫీల కోసం పాలు ఇంట్లో ఉండాల్సిందే. పాలను ఫ్రిజ్ లో పెడితేనే నిల్వ ఉంటాయి. ఫ్రిజ్ కారణంగా జీవితం చాలా సులభంగా మారింది. ఆహారం, పానీయాలను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం వల్ల అన్ని పనులు సులువైపోయింది . అయితే కొన్ని సందర్భాల్లో ఫ్రిజ్ పాడవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు పాలను బయటే నిల్వ చేయాలి. ఫ్రిజ్ లేకపోయినా పాలు రోజంతా చెడిపోకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి పాలను బయట నిల్వ చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.
తక్కువ మంట మీద పాలను మరిగించాలి. ముందుగా తక్కువ మంట మీద పాలను బాగా మరిగించాలి. పాలు మరిగిన తర్వాత తక్కువ మంట మీద మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి. దీనివల్ల పాలల్లో ఉన్న అన్ని బ్యాక్టీరియాలు చనిపోతాయి. కాబట్టి పాలు ఎక్కువ గంటలు నిల్వ ఉంటాయి. పాలు సరిగా మరగకపోతే బ్యాక్టిరియాలు సజీవంగా ఉండి వాటిని చెడగొడతాయి.
మరగబెట్టిన పాలను చల్లబరచాలి. తరువాత మీ ఇంట్లో చల్లటి ప్రదేశంలో ఉంచాలి. వంటగదిలో మాత్రం ఉంచకూడదు. మిగతా అన్ని గదులతో పోలిస్తే వంటగది వేడిగా ఉంటుంది. ఇంట్లో చల్లని మూలలో ఉంచడానికి ఏర్పాట్లు చేయండి. వెలుతురు, సూర్యరశ్మి తగలని చోట పాల గిన్నె ఉంచితే అవి చెడిపోయే అవకాశం తగ్గుతుంది.
పాలను స్టీలు గిన్నె కన్నా మట్టి పాత్రలు లేదా గాజు పాత్రలలో నిల్వ చేయండి. ఆ పాత్రలు పాలను చల్లగా ఉంచుతాయి. చెడిపోకుండా కాపాడుతాయి. ఫ్రిజ్ లేనప్పుడు కచ్చితంగా పాలను మట్టి పాత్ర, గాజు పాత్రలోనే నిల్వ ఉంచండి.
మీకు ఏసీ వేసుకునే అలవాటు ఉంటే… ఏసీ రూముల్లో పాల గిన్నెను ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాలు విరిగిపోవు. కూలర్ గాలి వల్ల కూడా గది చల్లబడుతుంది. ఆ గదిలో పాలను ఉంచినా మంచిదే. పాల గిన్నెపైన పెట్టిన మూతపై ఐసుగడ్డలు ఉంచినా కూడా పాలు చెడిపోకుండా ఉంటాయి.
పాలగిన్నెను నీరు ఉంచిన పాత్రలో దించాలి. పాల గిన్నె మునిగిపోయేంత నీళ్లు వేయకూడదు. ఇలా చేయడం వల్ల పాలు చల్లగా ఉంటాయి. కాబట్టి పాలు చెడిపోవు. లేదా చల్లటి నీటిలో నానబెట్టిన వస్త్రాన్ని చుట్టి పాల గిన్నెను దానిపై ఉంచాలి. ఇలా చేస్తే పాల గిన్నె చల్లగా ఉంటుంది. పాలు కూడా గది ఉష్ణోగ్రత కన్నా తక్కువ వేడి వద్దే ఉంటాయి. కాబట్టి త్వరగా పాడైపోవు. కాబట్టి ఎప్పుడైనా ఫ్రిజ్ పాడైతే పాలు చెడిపోతాయేమోనని భయపడకుండా పైన చెప్పినట్టు పాలను రక్షించుకోండి.
టాపిక్