ప్రపంచంలో ఉన్న ఎన్నో అద్భుతాలలో లండన్ బ్రిడ్జి, ఇటలీలోని పీసా టవర్, రోమ్‌లోని కొలోసియం వంటి ఐకానిక్ నిర్మాణాలు ఉన్నాయి. వాటిని చూడాలంటే విదేశాలు తిరగడం అంత మంది వల్ల కాదు. కేవలం కోటీశ్వరులు మాత్రమే వాటిని నేరుగా చూడగలరు.
ప్రపంచ దేశాలను తిరుగుతూ వాటిని చూడలేని వారి కోసం వైజాగ్ లో ఒక మినీ వరల్డ్ ను నిర్మించారు. అక్కడకు వెళితే మీరు ప్రపంచ దేశాల్లోకి అడుగుపెట్టినంత ఫీలింగ్ వస్తుంది.
వైజాగ్‌లోని పోర్ట్ స్టేడియంలోని విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్‌లో మినీ వరల్డ్‌ను కొత్తగా ప్రారంభించారు. అక్కడ సందర్శిస్తున్నప్పుడు మీకు లండన్ లో ఉన్నారా లేక ఇటలీలో ఉన్నారా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇటలీలో ఉన్న పీసా లీనింగ్ టవర్ ఇక్కడ కనిపిస్తుంది. అచ్చు గుద్దినట్టు అలాగే దీన్ని ఇక్కడ నిర్మించారు.
అలా ముందుకు వెళితే మరోచోట లండన్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే లండన్ బ్రిడ్జి ఎంత ప్రముఖమైనదో అందరికీ తెలుసు. లండన్లోని ఆ టవర్ బ్రిడ్జిని ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ మినీ రూపంలో కట్టారు. అలాగే యూనివర్సల్ స్టూడియోస్ కూడా ఇక్కడ మినీ సైజులో కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఐకానిక్ నిర్మాణాలు కళ్ళకు ఆనందాన్ని ఇస్తాయి.
ఈ మినీ వరల్డ్ లో ప్రపంచ ఐకానిక్ ల్యాండ్ మార్కులైన 12 ప్రతిరూపాలను నిర్మించారు. వాటిలో చార్మినార్ కూడా ఒకటి. అమెరికాలోని అధ్యక్షుడి భవనాన్ని కూడా ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా ప్రతిరూపించేలా కట్టారు.
ఈ ప్రదేశాన్ని చూసేందుకు టికెట్లను కొనుగోలు చేయాల్సి వస్తుంది. నలుగురు ఉన్న ఫ్యామిలీ 499 రూపాయలు పెట్టి ఒక టికెట్ కొనాల్సి వస్తుంది. అంటే 500 రూపాయల్లోపే నలుగురు ఈ ప్రదేశాన్ని దర్శించవచ్చు.
ఈ మినీ వరల్డ్ ఉదయం 10:00 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఒక్కరే ఈ మినీ వరల్డ్ చూడడానికి వెళ్లాలనుకుంటే 199 రూపాయలు పెట్టి టికెట్ కొనాల్సి వస్తుంది. అదే ఫ్యామిలీతో వెళ్తే నలుగురు కలిపి 499 రూపాయలుకే దర్శించవచ్చు.
ఈ మొత్తం ప్రాజెక్టును ఫైబర్ తో తయారు చేశారు. ఈ 12 ఐకానిక్ నిర్మాణాలు పూర్తయ్యేందుకు తొమ్మిది నెలల సమయం పట్టింది. కోల్ కతా నుంచి 55 మంది నైపుణ్యం కలిగిన కళాబృందాలు ఇక్కడ వచ్చాయి. ఈ మొత్తం నిర్మించడానికి దాదాపు ఒక కోటి 80 లక్షలు ఖర్చు అయినట్టు తెలుస్తోంది. అలాగే వైజాగ్ లోని గీతం విశ్వవిద్యాలయం నుండి వచ్చిన ఆర్కిటెక్చర్ విద్యార్థులు కూడా ఈ ప్రాజెక్టుకు తుది మెరుగులు దిద్దారు.
టాపిక్