ఆరోగ్యంగా ఉండాలంటే అధిక ప్రొటీన్లు కలిగిన ఆహారాలను తినాలి. శరీరానికి ప్రొటీన్లు సరిగ్గా అందితేనే కండరాల పనితీరు బాగుంటుంది. కడుపు నిండా తిన్న తృప్తితో పాటు శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకనే వారు, ఫిట్‌నెస్ కోసం డైట్ పాటించే వారు ఉపవాసాలు వంటివి చేస్తున్న వారు ఆహారాన్ని సమతుల్యగా తీసుకునేందుకు ప్రొటీన్లు చాలా బాగా సహాయపడతాయి.
ప్రొటీన్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేవి గుడ్లు, చికెన్, మటన్, ఫిష్ వంటి మాంసాహారమే. ఇవి ఆరోగ్యానికి మంచివే కానీ రోజూ ఇలా మాంసాహారం తినడం చాలా మందికి బోరింగ్‌గా అనిపించచ్చు. వారి వారి ఆచారాలు, వ్యవహారాలు, రుచుల రీత్యా ప్రతిరోజూ నాన్ వెజ్ తినడం కొందరికి ఇబ్బందిగా కూడా అనిపించచ్చు. మీరు కూడా ఇలాంటి రకరకాల కారణాల వల్లే మాంసం తినడం తగ్గించాలనుకుంటే ఈ 5 రకాల ఆహారాలు మీ కోసమే.
వీటిని మీ డైట్లో చేర్చుకున్నారంటే మాంసం తినడం వల్ల పొందే ప్రయోజనాలన్నింటినీ పొందచ్చు. వీటితో మీ డైట్ పాడవకుండా కాపాడుకోవచ్చు అలాగే మీరు కోరుకున్నప్పుడల్లా నాన్‌వెజ్‌ను స్కిప్ చేసేయచ్చు. మరి ఇంకెందుకు లేడు మాంసాహారికి ధీటుగా పనిచేసే ఈ 5 రకాల ఆహార పదార్థాలేంటో చూసేద్దాం రండి..
పప్పులు, శనగలు, బీన్స్, చిక్కుళ్లు వంటి కాయ ధాన్యాలు అధిక ప్రోటీన్లు కలిగిన ఆహారాలు. వీటిని కూరలుగా తిన్నా, సూప్‌లు, సలాడ్‌ల రూపంలో తిన్నా మీకు కావాల్సినంత ప్రొటీన్ అందుతుంది. ఇందులో అధిక ప్రోటీన్లతో పాటు ఫైబర్, నెమ్మదిగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మీరు ఎక్కువ సేపు సంతృప్తిగా ఫీలవుతారు. ఆరోగ్యంగా కూడా ఉంటారు.
పెరుగు, పనీర్, మజ్జిగ వంటి అధిక-నాణ్యత కలిగిన ప్రోటీన్లతో నిండి ఉంటాయి. అలాగే వీటిలో ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రోబయోటిక్స్ కూడా లభిస్తాయి. మాంసానికి బదులుగా వీటిని తినడం వల్ల మీరు శక్తిని, పోషణను పొందచ్చు.
మీకు పాలు, పాల పదార్థాలు పడకపోతే పాలేతర ఎంపికలను ఇష్టపడితే, పోషకాలతో కూడిన బాదం, సోయా ఆధారిత ప్రోటీన్లు వంటి టోఫు, టెంపే లేదా సోయా పాలు, ఓట్స్ పాలు వంటి వాటిని ఎంచుకోవచ్చు. పెరుగు, గింజలు, పండ్లతో తయారు చేసిన స్మూతీలు, సలాడ్ లను తిని కూడా ప్రొటీన్లను పొందచ్చు.
బాదం, అక్రోట్లు, చియా విత్తనాలు, అవిసె గింజలు వంటి విత్తనాలు మొక్కల ఆధారిత ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ లకు అద్భుతమైన వనరులు. వీటిని తినడం వల్ల మీరు శరీరానికి కావాల్సినన్ని పోషకాలను పొందచ్చు. శక్తిని, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. నట్స్, విత్తనాలను మీరు నానబెట్టుకుని నేరుగా తినచ్చు లేదా సలాడ్లు, స్మూతీలు, పండ్ల రసాలలో కలుపుకుని కూడా తీసుకోవచ్చు.
క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్స్, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు వంటి చిరు ధాన్యాలలో అధిక ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. ఇవి శక్తిని నిలకడగా విడుదల చేస్తాయి. ముఖ్యంగా క్వినోవా ప్రోటీన్లతో నిండిన చక్కటి పదార్థం. ఇది మన శరీరం స్వయంగా తయారు చేయలేని 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. వీటిని సలాడ్లుగా లేదంటే సైడ్ డిష్‌లలో మాంసానికి ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు.
గుడ్లు ఉత్తమ ప్రోటీన్ వనరులలో ఒకటి. ఇది అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలను అందిస్తుంది. వాటిని అనేక విధాలుగా తయారు చేయవచ్చు. మాంసం తినడం తగ్గించాలనుకున్నప్పుడు మీరు మీ డైట్లో ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లెట్ వంటి వాటిని చేర్చుకోవచ్చు. కావాల్సిన ప్రొటీన్లను, శక్తినీ పొందచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం