అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? స్టెప్ బై స్టెప్ ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి-want to go on amarnath yatra register online step by step like this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? స్టెప్ బై స్టెప్ ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? స్టెప్ బై స్టెప్ ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

Haritha Chappa HT Telugu

అమర్ నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ప్రారంభమైపోయింది. అమర్ నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే భక్తులు ఆ యాత్రకు ఎలా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలో తెలుసుకోండి.

అమర్ నాథ్ లోని శివలింగం

అమర్ నాథ్ యాత్ర చేయాలని ప్రతి శివ భక్తుడు కోరుకుంటారు. జీవిత కాలంలో ఒక్కసారి అయినా అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే వారి సంఖ్య ఎక్కువే. అక్కడ కొలువై ఉన్న శివుడిని చూసి తమ కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు భక్తులు. అందుకే ఈ ప్రయాణం ఎంత కష్టమైనదైనా కూడా ఆనందంగా ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ప్రతి ఏడాది అమర్ నాథ్ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. అమర్ నాథ్ యాత్రకు ఈ ఏడాది ఏప్రిల్ 14న రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది.

రిజిస్ట్రేషన్ కు కావాల్సినవి

అమర్ నాథ్ యాత్రకు వెళ్ళేందుకు ముందుగా మీ పేరును నమోదు చేసుకోవాలి. అమర్ నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు అధికారిక వెబ్‌సైటు https://jksasb.nic.in/ ని ఇందుకోసం సందర్శించాలి. భక్తులు ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో కూడా తమ పేరును నమోదు చేసుకోవచ్చు. దూరంగా ఉన్న వాళ్ళు ఆన్ లైన్లో నమోదు చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ కోసం ఒక ఫోటో, ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి వంటివి అవసరం పడతాయి. అలాగే ప్రయాణికులు తాము ఆరోగ్యంగా, ఫిట్ గా ఉన్నామని ధ్రువీకరణ పత్రాన్ని కూడా వైద్యుల నుంచి తీసుకువెళ్లాలి. ఇక గర్భిణీ స్త్రీలు, 70 ఏళ్లు పైబడిన వారు, 13 ఏళ్లలోపు పిల్లలు మాత్రం అమర్ నాథ్ యాత్రకు అర్హులు కాదు.

అమర్‌నాథ్ యాత్రకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్

అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు అధికారిక వెబ్ సైటులోకి వెళ్ళండి. హోం పేజీలో ఆన్ లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ యాత్రకు ‘పర్మిట్ రిజిస్ట్రేషన్’ ఎంపికను ఎంచుకోండి. ఇక్కడ ఉన్న అన్ని నిబంధనలను చదివాక ‘I Agree’ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజిస్టర్ ను ఎంచుకోండి. అక్కడ మీ పేరు, ప్రయాణ తేదీ, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ వంటి సమాచారాన్ని అడుగుతుంది. వాటన్నింటినీ పూర్తి చేయండి. ఇప్పుడు పాస్ పోర్టు సైజ్ ఫోటోను మీరు ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నారనే హెల్త్ సర్టిఫికెట్ ను కూడా అక్కడ అప్లోడ్ చేయండి. ఇది మీ మొబైల్ నెంబర్ కు OTP పంపుతుంది. ఆ ఓటీపీ నెంబరును నమోదు చేసి OK అని కొట్టండి.

ఇలా చేసిన తర్వాత రెండు గంటల్లోపు మీకు అమర్‌నాథ్ యాత్రకు రుసుము కట్టమని లింక్ వస్తుంది. ఆ లింక్ లోకి వెళ్లి ఒక మనిషికి 220 రూపాయలు రుసుము చెల్లించాలి. అలా చెల్లించిన తర్వాత మళ్లీ అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు, అధికారిక వెబ్ సైటులోకి వెళ్లి మీ ప్రయాణానికి కావలసిన అనుమతి పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ అనుమతి పత్రం అత్యవసరం.

అమర్ నాథ్ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఈ ఏడాది జూలై 25 నుండి ఆగస్టు 19 వరకు అమర్ నాథ్ యాత్ర సాగుతుంది. జూలై 25 నుండి భక్తులు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఈ యాత్రకు వచ్చే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ యాత్ర చేయకపోవడమే మంచిది.

అమర్ నాథ్‌లోని శివలింగం గుహ పైకప్పు నుండి కారుతున్న మంచు బిందువుల వల్ల ఏర్పడిందని చెబుతారు. అందుకే మంచుతో చేసిన శివలింగం కాబట్టే దీన్ని బాబా బర్ఫానీ అని పిలుస్తారు.

అమర్ నాథ్ యాత్ర చేయాలనుకునేవారు బస్సు లేదా రైలు విమానం ద్వారా ఢిల్లీకి లేదా శ్రీనగర్ కి చేరుకోవాలి. అక్కడ నుంచి బల్తాల్ లేదా పహల్గామ్ టాక్సీల ద్వారా చేరుకోవచ్చు. పహల్గామ్ లేదా బల్తాల్ దగ్గర నుంచి అమర్నాథ్ యాత్ర ప్రయాణం మొదలవుతుంది. ఎవరైనా కూడా దేశం నలుమూలల నుంచి వచ్చేవారు బల్తాల్ లేదా పహాల్గామ్ ప్రాంతానికి చేరుకోవాల్సి వస్తుంది. భక్తులంతా అక్కడే అమర్నాథ్ యాత్రను ప్రారంభిస్తారు.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం