Wednesday Motivation: మీరు ఎక్కడున్నా సెంటరాఫ్ అట్రాక్షన్ ఉండాలనుకుంటున్నారా? ఈ సైకాలజీ ట్రిక్స్ పాటించండి
Wednesday Motivation: సమాజంలో అందరి గౌరవం పొందాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ మాట్లాడడం చేతకాక, తన గురించి తాను చెప్పుకోలేక ఎంతో మంది వెనకబడిపోతారు. అలాంటి వారి కోసమే ఇక్కడ మేము కొన్ని సైకాలజీ ట్రిక్స్ ఇచ్చాము.
Wednesday Motivation: పనిచేసే చోట అయినా, కుటుంబంలో అయినా, ఎక్కడైనా కూడా వ్యక్తులతో సంభాషించడం అంటే కమ్యూనికేట్ చేయడం అనేది బలమైన బంధాలను ఏర్పరుస్తుంది. ఏ సమయంలోనైనా ఏ ప్రదేశంలో అయినా కూడా కమ్యూనికేట్ చేయడం ద్వారా చుట్టూ ఉన్న వారిని ఆకట్టుకోవచ్చు. మాట్లాడేటప్పుడు మీలో ఉన్న ఆత్మవిశ్వాసం కనబడాలి. అలా కాకుండా అభద్రతా, భయం, గందరగోళం వంటివి కనిపిస్తే మిమ్మల్ని ఇష్టపడే వారి సంఖ్య తగ్గిపోతుంది.
కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు బెదురు లేకుండా ఉండండి. కొన్ని సైకాలజీ ట్రిక్స్ పాటించడం ద్వారా ఎక్కడున్నా కూడా మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోవచ్చు. మీరు కమ్యూనికేట్ చేయడంలో నిపుణులుగా మారచ్చు. కమ్యూనిటీ చేయడం అనేది ఒక కళ. దానిలో ప్రావీణ్యం సంపాదించాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
నేను వద్దు, మనమూ బెటర్
కుటుంబంలో అయినా పనిచేసే చోట అయినా మీరు ఒక వ్యక్తితో లేదా ఒక గ్రూపుతో మాట్లాడుతున్నప్పుడు మేము లేదా మనము అనే పదాన్ని వాడండి. నేను అనే పదాన్ని ఎక్కువగా వాడితే మీరు ఒంటరిగా మిగిలిపోతారు. అదే మనము అని వాడితే అందరినీ కలుపుకున్న వారిగా అవుతారు, ఇది చాలా సులువైన పద్ధతి. ఇది మిమ్మల్ని మీ కుటుంబంలోని వారికి లేదా మీ టీమ్ లో ఉన్నవారికి దగ్గర చేస్తుంది. ఐక్యతను పెంచుతుంది. మీరంటే ఎంతో సౌకర్యవంతంగా వారు ఉండేలా చేస్తుంది. మీ మధ్య పరస్పర అనుబంధం కూడా పెరుగుతుంది.
ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ నమ్మకాలు, మీ ఇష్టాలు, మీ అయిష్టాల గురించి మాట్లాడకండి. ఎదుటివారివి తెలుసుకునేందుకు ప్రయత్నించండి. వారి విశ్వాసాలను, వారి నమ్మకాలను ఖండించి మాట్లాడకండి. ఇది మిమ్మల్ని త్వరగా శత్రువులుగా మార్చేస్తుంది. భాగస్వామ్య ఆసక్తులు, అభిరుచులు అనేవి ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి మంచి మార్గాలు. కాబట్టి మీ ఇద్దరిలో ఉన్న ఒకేలాంటి అభిరుచుల గురించి ఆసక్తుల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండండి. ఇది మీ అనుబంధాల్ని బలంగా మారుస్తుంది. అలాగే మిమ్మల్ని ఇష్టపడే వారిగా కూడా చేస్తుంది.
పేరు చెప్పి మాట్లాడండి
ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి పేరును ఉపయోగించడం గుర్తుపెట్టుకోండి. మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా అలా ఎదుటి వారి పేర్లు పెట్టి మాట్లాడితే వారిలో పాజిటివిటీ పెరుగుతుందని చెప్పారు. ఇది నిజానికి చాలా సులువైన, ప్రభావంతమైన పద్ధతి. ఇలా పేర్లను ఉపయోగించి మాట్లాడటం వల్ల వారికి మిమ్మల్ని మీరు దగ్గర చేసుకున్న వారవుతారు. ఇది మీ మధ్య వ్యక్తిగత అనుబంధాన్ని పెంచుతుంది. కలిసి పని చేసేందుకు ఇది చాలా ముఖ్యం.
ఎప్పుడూ ప్రాజెక్టులు, చేయాల్సిన పని గురించి మాత్రమే కాదు, అప్పుడప్పుడు మీ సహోద్యోగులతో లేదా మీ ఇరుగు పొరుగు వారితో వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకోండి. ఇది మిమ్మల్ని వారికి మరింత దగ్గర చేస్తుంది. మీరు ఇంటరాక్ట్ చేసే పద్ధతి కూడా వారికి నచ్చుతుంది.
ఎప్పుడూ మీరే మాట్లాడాలి అనుకోకండి. ఎదుటివారికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి. మీరు శ్రోతగా మారితే మంచిది. ఎదుటివారి కోణాన్ని కూడా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నించాలంటే వారు చెప్పేది మీరు ఓపికగా వినాలి. అలా వింటే ఎదుటివారికి కూడా మీపై ఒక నమ్మకం, గురి కుదురుతాయి. మీతో మాట్లాడేందుకు ఇష్టపడతారు.