వివాహ జీవితాన్ని సంతోషంగా గడపడం రోజురోజుకూ కష్టతరమవుతోంది. తన భాగస్వామి అధిక అంచనాల కారణంగా భార్య లేదా భర్తకు వివాహా బంధాన్ని బలంగా నిలబెట్టుకోవడం చాలా కష్టంగా మారిపోతుంది. నిజానికి పెళ్లి తర్వాత జీవితంలో కీలకమైన వ్యక్తి భాగస్వామి మాత్రమే కనుక వారి కోసం కొంత సమయం ఇవ్వడం, వారితో సంతోషకరమైన సంబంధానికి కీలకం అవుతుంది. ఇది లేకనే చాలా మంది భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడుతున్నాయి. గొడవలు, చికాకులు పెరిగి చివరకు విడాకుల వరకూ వెళ్లాల్సి వస్తుంది. ఇది జరగకుండా ఉండేందుకు ఒక రూల్ ను పాటిస్తే చాలని వచ్చిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదే 2-2-2 రూల్.
ఈ 2-2-2 రూల్ కొత్తగా పెళ్లయిన వారి నుంచి షష్టి పూర్తి చేసుకోయే జంటల వరకూ ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుందనీ, వీటిని పాటిస్తే వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ రూల్ ని అమలు చేయడం వల్ల మ్యారేజ్ లైఫ్‌లో ఏర్పడే మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ఆనందం పెరుగుతుందని అంతా నమ్ముతున్నారు. మీ భాగస్వామి కూడా మీరు సమయం ఇవ్వకపోవడం వల్ల అసంతృప్తిగా ఉంటే 2-2-2 రూల్ గురించి తెలుసుకుని మీరూ అమలు చేయండి.
రోజంతా పనుల్లో బిజీగా ఉంటారు. రాత్రయ్యే సరికి అలిసిపోయి నిద్రపోతారు. సెలవుల్లో ఇంటి పనులు, ఇతర కార్యకాలపాల్లో మునిగిపోతారు. మరి మీకూ మీ భాగస్వామికీ ప్రత్యేకంగా సమయం ఎక్కడుంటుంది. ఇలాగే ఉంటే మీ ఇద్దరి మధ్య దూరం తప్ప ఇంకేం మిగులుతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఇలా జరగకుండా ఉండాలంటే 2-2-2 లో మొదటి 2 ను అనుసరించండి. అంటే ప్రతి రెండు వారాలకు ఒకసారి మీ భాగస్వామితో డిన్నర్ లేదా లంచ్ డేట్‌కి వెళ్ళండి. మూవీ డేట్ కూడా మంచి ఎంపిక. కొంత సమయం కలిసి గడపడం వల్ల మనసులో బాధలను పంచుకోవచ్చు, అపోహలను తొలగించుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది.
ఎప్పుడూ ఇంటి పనులు, ఆఫీసు పనులు, వ్యాపార లావాదేవీల్లోనే మునిగిపోతే ఏ వ్యక్తిలో అయినా చికాకు, కోపం పెరుగుతాయి. గొడవలు మొదలవుతాయి. కనుక వీటిన్నిటినీ కాస్త బ్రేక్ ఇచ్చి రెండు నెలలకు ఒకసారి వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేయండి. దూరం ప్రాంతాలకు వెళ్లేలేకపోయినా, నగరం చుట్టూ విహారయాత్రకైనా వెళ్లండి. అక్కడ ఇతర విషయాలన్నింటినీ మర్చిపోయి వేరే ఆలోచనలు, పని ఒత్తిడి వంటివి ఏవీ లేకుండా ఒకరితో ఒకరి ప్రశాంతంగా సమయం గడపండి. ఇలా చేయడం వల్ల మీలో అపోహలకు తావుండదు. ప్రేమకు కొదవుండదు.
ఏడాది పూర్తవుతుందంటే మీ వయసు పెరిగిపోతున్నట్టే. ఒకరితో ఒకరు గడిపే సమయం కరిగిపోతున్నట్టే. మీ భాగస్వామితో మరపురాని గురుతులను ఏర్పరుచుకోవాలంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పూర్తిగా ఒక వారం కలిసి గడపండి. కుటుంబం, వ్యాపారం, కెరీర్, పిల్లలు వంటి చింతలన్నింటినీ పక్కన పెట్టి, మీ కోసం మీ ఇద్దరి కోసం సమయం కేటాయించుకోండి. ఒకరితో ఒకరు అభిరుచుల గురించి, ఇష్టాయిష్టాల గురించి చర్చించుకోండి. ఇలా చేయడం వల్ల వివాహ జీవితాన్ని సంతోషంగా గడపడం సులభం అవుతుంది. ఒకరిపై ఒకరికి ప్రేమ రెట్టింపు అవుతుంది.