పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? ముందుగా చట్టపరమైన నియమాలు తెలుసుకోండి-want to adopt a child know the legal rules in india ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? ముందుగా చట్టపరమైన నియమాలు తెలుసుకోండి

పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? ముందుగా చట్టపరమైన నియమాలు తెలుసుకోండి

Haritha Chappa HT Telugu

గత కొన్ని దశాబ్దాలుగా పిల్లలను దత్తత తీసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. మీరు భవిష్యత్తులో పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటే, ముందుగా ఈ విషయంలో చట్టపరమైన సమాచారాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశంలో దత్తత నియమాలు ఎలా ఉన్నయో ఇక్కడ ఇచ్చాము.

పిల్లల దత్తత నియమాలు

భారతదేశంలో పిల్లలను దత్తత తీసుకునే ప్రక్రియ అంత సులభం కాదు. ఇది కొంచెం సవాళ్లతో కూడిన విషయమే. మీడియాలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం 2023 జనవరిలో 2,188 మంది పిల్లలను దత్తత తీసుకోవడానికి 31,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

అంటే మనదేశంలో పిల్లలను దత్తత తీసుకోవడానికి చాలా కాలంగా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. 2016లో జువెనైల్ చట్టానికి సవరణలు చేసినప్పుడు కోర్టుల్లో సుదీర్ఘ ప్రక్రియకు చెక్ పెట్టేందుకు … దత్తత ఉత్తర్వులు జారీ చేసే అధికారం జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం)కు ఇచ్చారు.

వీరే దత్తత తీసుకోగలరు

హిందూ దత్తత నిర్వహణ చట్టం 1956 ప్రకారం దత్తత తీసుకోవాలనుకునే వ్యక్తి కచ్చితంగా హిందువు, బౌద్ధ, సిక్కు, జైన మతస్థుడై ఉండాలి. యూదు, పార్శీ, క్రిస్టియన్, ముస్లిం మతస్థులకు దత్తత తీసుకునే హక్కు లేదు. దత్తత తీసుకున్న వ్యక్తికి బిడ్డను దత్తత తీసుకునే సామర్థ్యం, పెంచే శక్తి ఉండాలి.

బిడ్డను దత్తత ఇచ్చే హక్కు ఆ బిడ్డ తండ్రి లేదా తల్లికే ఉంటుంది. మరెవరికీ బిడ్డను దత్తత ఇచ్చే హక్కు ఉండదు. తల్లిదండ్రులు లేనప్పుడు మాత్రమే, చట్టబద్ధమైన సంరక్షకుడు బిడ్డను దత్తత ఇవ్వగలడు.

జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్ 2015 ప్రకారం కాబోయే తల్లిదండ్రులు మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా, ఆర్థికంగా పిల్లల బాధ్యత తీసుకునే సామర్థ్యం కలిగి ఉండాలి.

వివాహం కాని వారు కూడా

వైవాహిక స్థితితో సంబంధం లేకుండా భారతదేశంలో పెద్దలు పిల్లలను దత్తత తీసుకోవచ్చు. దంపతులు దరఖాస్తు చేసుకుంటే తల్లిదండ్రులిద్దరి సమ్మతి అవసరం. భార్యాభర్తలు రెండు సంవత్సరాల పాటు స్థిరమైన వైవాహిక సంబంధం కలిగి ఉంటేనే ఆ జంటకు బిడ్డను దత్తత ఇస్తారు.

దత్తత తీసుకునే సమయంలో కాబోయే తల్లిదండ్రుల వయస్సును పరిగణనలోకి తీసుకుంటారు. తల్లిదండ్రులకు, దత్తత తీసుకున్న బిడ్డకు మధ్య వయస్సు తేడా కనీసం 25 ఏళ్లు ఉండాలి.

ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న జంటలు బిడ్డను దత్తత తీసుకోవాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఒక బిడ్డను ఎవరూ దత్తత తీసుకునేందుకు ముందుకు రానప్పుడు లేదా దివ్యాంగుడు అయినా… పిల్లలున్న జంటకు దత్తత ఇస్తారు.

ఎవరు దత్తత తీసుకోవచ్చు?

భారతీయ దత్తత చట్టం ఏ భారతీయుడైనా, విదేశీయుడైనా లేదా ఎన్ఆర్ఐ అయినా భారతదేశంలో ఒక బిడ్డను దత్తత తీసుకోవచ్చు. స్త్రీలలో పెళ్లయిన వారు, పెళ్లి కాని వారు కూడా దత్తత తీసుకునేందుకు అర్హులే. కాని అవివాహిత పురుషుడు మాత్రం బిడ్డను దత్తత తీసుకోలేడు.

మీరు పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటే, మీరు భారతదేశ రాజధాని న్యూఢిల్లీలోని దత్తత సమన్వయ సంస్థ లేదా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ చేత ధృవీకరణ పొందిన ఏజెన్సీతో దత్తత కోసం మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకోవాలి. లైసెన్స్ లేని ఏజెన్సీ లేదా అనాథాశ్రమం నుంచి పిల్లలను దత్తత తీసుకోకూడదు.

(- న్యాయవాది వివేక్ సోనీ, సోనీ లా సంస్థ)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.