కొన్ని ఆసనాలు వేయడం కష్టంగా ఉంటుంది. కానీ వృక్షాసనం మాత్రం వేయడం చాలా సులువు. ఒక కాలు మీద నిలబడి చేసే ఈ ఆసనం వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎవరైతే స్థిరత్వం తక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నారో వారు ఈ ఆసనాన్ని అలవాటు చేసుకోండి. ఇది ఒత్తిడి తగ్గించడంతోపాటు మీలో ఆలోచనలు స్థిరంగా ఉండేలా చూస్తుంది.
ఒక మనిషికి స్థిరత్వం చాలా అవసరం. లేకుంటే ఒక పని మీద లేదా ఒక ఆలోచన మీద దృష్టి నిలబడదు. ఆలోచనల్లో స్థిరత్వం ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేకుంటే మనసులో గందరగోళంగా కలత చెందినట్టు అనిపిస్తుంది. లక్ష్యంపై దృష్టి సారించడం కష్టంగా మారుతుంది. అందుకే స్థిరమైన ఆలోచనలు కావాలంటే ముందు మీ మనసును స్థిరంగా ఉంచుకోవాలి. అందుకు వృక్షాసనం అవసరం. ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది.
వృక్షాసనం వేయడం వల్ల మీ శరీరంలో కూడా సమతుల్యత పెరుగుతుంది. శరీరంలోని అవయవాల మధ్య సమతుల్యత మెరుగుపడుతుంది. అలాగే దృష్టిని మెరుగుపరిచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. శ్వాసను నియంత్రించడంలో వృక్షాసనం అద్భుతంగా పనిచేస్తుంది. కాళ్ల కండరాలను బలపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. వెన్నెముక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వృక్షాసనం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎవరైతే ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారో వారి ప్రతిరోజూ వృక్షాసనం వేయడానికి ప్రయత్నించండి. ఇది ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తుంది.
అయితే వృక్షాసనం వెన్నుముక గాయం తగిలిన వారు, మోకాళ్ళ గాయం ఉన్నవారు మాత్రం చేయకూడదు. ఇది ఆ సమస్యను మరింత పెంచే అవకాశం ఉంటుంది.
వృక్షాసనం వేయడం చాలా సులువు. ముందుగా ఒక చోట స్థిరంగా నిల్చోవాలి. ఒంటి కాలు మీద నిలబడి ఒక కాలును మరొక కాలుపై చిత్రంలో చూపించినట్టు పెట్టాలి. చేతులు పైకి లేపి అరచేతులను కలిపి ఉంచాలి. ఆ భంగిమలో ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల మీకు శ్వాసపై నియంత్రణ కలుగుతుంది. శ్వాసకోశ సమస్యలు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ వృక్షాసనం వేయడం సులువే. కాబట్టి అన్ని వయసుల వారు వేయవచ్చు.