మేము 05 మార్చి 2024 తెల్లవారుజామున 4.30కి విశాఖపట్నం నుంచి ట్రైన్ లో వారణాసికి బయలుదేరాం. అది 30 గంటల సుదీర్ఘ రైలు ప్రయాణం. మాకు మొదటిసారి ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణం. పుస్తకపఠనంతోనే రైలు ప్రయాణ కాలం గడిచిపోయింది.
మర్నాడు ఉదయం ట్రైన్ 12.30కి కాశీ చేరుకుంది. వారణాసిలో అడుగపెట్టగానే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. ఆటో తీసుకుని మేం రూమ్ తీసుకున్న విశాఖ శారదాపీఠం ఆశ్రమానికి వెళ్లిపోయాం. మెయిన్ రోడ్ మీద నుంచి ఆశ్రమానికి ఒక అర కిలోమీటర్ దూరం నడిచి వెళ్లాల్సి వచ్చింది. కాశీలో ఆశ్రమాలన్నీ ప్రధాన రోడ్లకు సమీపంలో ఉండవు. అన్నీ కూడా చిన్న చిన్న సందులు, గొందుల్లోనే ఉంటాయి.
రూమ్ కి వెళ్లిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి వెంటనే గంగా స్నానానికి వెళ్లాం. మా రూమ్ నుంచి ఒక 300 మీటర్లు దూరం వెనక్కి వెళ్తే... మానససరోవర్ ఘాట్ ఉంది. అక్కడ స్నానాలు చేసుకుని తిరిగి రూమ్ కి వచ్చేశాం. బట్టలు మార్చుకుని అక్కడికి దగ్గరలోనే ఉన్న ఎస్ విఆర్. హోటల్ లో భోజనం చేశాం. ఆంధ్రా భోజనం చాలా బాగుంది.
ఆ తర్వాత మెయిన్ రోడ్ మీదకు వచ్చి కాలభైరవ ఆలయానికి బయలుదేరాం. ఆటోలు ఎక్కువ డబ్బులు అడిగారు. దాంతో రిక్షాలో 300 రూపాయలు ఇచ్చి వెళ్లాము. కాలభైరవుడి దర్శనం చేసుకుని, కాశీ తాళ్లు కట్టించుకుని బయటకు వచ్చాం. కాలభైరవ ఆలయం నుంచి మెయిన్ రోడ్ కి వచ్చి అవతలివైపు ఒక అరకిలోమీటర్ దూరంలో ఉన్న మృత్యుంజయ మహదేవ్ ఆలయానికి వెళ్లాం. వెనుక వైపు బావిలో నీళ్లు తాగితే సర్వరోగాలు పోతాయని చెబుతారు.
ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చే సరికి టైం 5 దాటిపోయింది. బోట్ లో ఘాట్ల సందర్శనకు వెళ్లి గంగా హారతి చూడాలని చెబితే ఒక ఆటో అతను మమ్మల్ని ఒక ఘాట్ దగ్గరకు తీసుకెళ్లి దింపాడు. అక్కడ నుంచి బోట్లు బయలుదేరుతున్నాయి. ఘాట్లు అన్ని తిప్పి, గంగా హారతి చూపించడానికి మనిషి ఒక్కొరికి 300 రూపాయలకి ఒప్పుకున్నాడు. కొన్ని ఘాట్లను చూపించి దశాశ్వమేధ ఘాట్ లోని గంగాహారతికి తీసుకెళ్లాడు.
బోట్లు ఎక్కువగా ఉండటంతో హారతి కొంచెం దూరం నుంచే వీక్షించాం. హారతి అయిపోయిన తర్వాత మిగతా ఘాట్లు అన్ని చూపించారు. లలితా ఘాట్ నుంచి విశ్వనాధ కారిడార్ లోకి ప్రవేశించగానే ఏదో గొప్ప అనుభూతి మనసులో కలిగింది. అక్కడ ప్రతిష్ఠించిన రాణి అహల్యాబాయ్ హోలక్కర్ విగ్రహాన్ని చూడగానే మనసు పులకించిపోయింది. భారతదేశంలో హిందూ ఆలయాల పరిరక్షణకు మొక్కవోని దీక్షతో కృషి చేసిన ఆ మహాసాధ్వికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ముందుకు కదిలాం. క్యూ చిన్నగా ఉండడంతో కాశీ విశ్వనాధుని దర్శనం అరగంటలో అయిపోయింది. ఆ తర్వాత పక్కనే ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయానికి వెళ్లాం. అక్కడ్నించి రూమ్ కు చేరుకున్నాం.
మా యాత్రలో రెండవ రోజు కాశీలో స్థానికంగా ఉన్న ఆలయాల సందర్శనకు కేటాయించాం. ఆ రోజు ఉదయాన్నే 6 గంటలకు కాశీనగరానికి కాపాలా కాసే వారాహి అమ్మవారిని దర్శించుకున్నాం. అక్కడ జనం పెరగడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ నుంచి బయటపడి, ఆ సమీపంలో ఉన్న విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లాం. అక్కడ జనం రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ అమ్మ దర్శనం చాలా చక్కగా జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చి చుట్టుపక్కల ఆలయాల సందర్శనకు ఆటో మాట్లాడుకున్నాం.
మొదటిగా అక్కడ బాగా ప్రసిద్ది చెందిన హనుమాన్ ఆలయానికి వెళ్లాము. అంజనేయుడు గుడి, దుర్గమ్మ గుడికి వెళ్లాము. ఆ సమీపంలోనే ఉన్న త్రిదేవ్ ఆలయాన్ని సందర్శించాము.అక్కడ నుంచి గవ్వాలమ్మ గుడిని చూసి ఎన్నో రకాల గవ్వలు కొనుక్కున్నాము. ఆ తర్వాత వ్యాస కాశీకి బయలుదేరాము. వ్యాస కాశీ గంగనదికి అవతలి ఒడ్డున ఉంది.వ్యాస కాశీలోనే వేదవ్యాసుడు ప్రతిష్టించిన శివలింగం ఉందని అంటారు.
వ్యాస కాశీని చూశాక రూమ్ కి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు నంది సర్కిల్ కి చేరుకున్నాము. గేట్ నెంబర్ 1 ద్వారా విశ్వనాధ ఆలయానికి చేరుకునే క్రమంలో అత్యంత శక్తివంతమైన గణపతిగా చెప్పుకునే డుండీ గణపతి దర్శన భాగ్యం అయింది. రెండో రోజు కూడా ఆ కాశీవిశ్వనాధుడిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో కాసేపు గడిపాం.మార్కెట్లో కొన్ని వస్తువులు కొనుక్కుని రాత్రి 9 గంటలకు రూమ్ కి చేరుకున్నాము. కాశీలో రెండో రోజు కూడా ఆనందంగా ముగిసిపోయింది.
ఇక మూడో రోజు అయోధ్యకు వెళ్లి బాల రాముడిని దర్శించుకోవాలని బయలుదేరాము. వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో అయోధ్యకు బయలుదేరాం. ఆ రైలు మధ్యాహ్నం 12 గంటలకు మమ్మల్ని అయోధ్యలో దింపేసింది. అయోధ్య రైల్వే స్టేషన్ అత్యధ్భుతంగా ఉంది. ఎయిర్ పోర్ట్ స్టయిల్ లో స్టేషన్ పైభాగం తీర్చిదిద్దారు. స్టేషన్ నుంచి బాలరాముడి ఆలయం కిలోమీటర్ దూరం ఉంటుంది. కొంత మంది ఆటోవాళ్లు మోసాలు చేస్తున్నారు, జాగ్రత్తగా చూసుకోవాలి. రోడ్డు మీద నుంచి ఆలయం చేరుకోవడానికి చాలా పెద్ద కారిడార్ ఉంటుంది. దాదాపు అర కిలోమీర్ పైనే నడవాల్సి ఉంటుంది. మేం మధ్యాహ్నం వేళ వెళ్లినప్పటికీ శనివారం కావటంతో విపరీతమైన రద్దీ ఉంది. మాకు దర్శనం పూర్తవ్వడానికి గంట సమయం పట్టింది.
రాముడి దర్శనం పూర్తయిన తర్వాత భోజనం చేసుకుని హనుమాన్ గడి ఆలయంలో అంజనేయుడిని దర్శించుకున్నాము. ఆ తర్వాత అక్కడ నుంచి దశరధుడి కోట కూడా చూసి వచ్చాము. సాయంత్రం 5.20కి తిరిగి వందేభారత్ ట్రైన్ లో బయలుదేరి 8.30గంటలకు వారణాసి చేరుకున్నాం.
మేం కాశీ యాత్రలో వందేభారత్ రైళ్లను పూర్తిగా ఉపయోగించుకున్నాం. వారణాసిని సెంటర్ పాయింట్ గా చేసుకుని చుట్టుపక్కల ప్రముఖ ప్రాంతాలకు వందేభారత్ రైళ్లలో వెళ్లి వచ్చేలా ప్లాన్ చేసుకున్నాం. మా కాశీ యాత్రలో నాల్గవ రోజు గయకు ప్రయాణం అయ్యాం. ఉదయం 6.20కి వారణాసిలో ట్రైన్ ఎక్కితే 9.20 కల్లా గయ చేరుకున్నాం. అక్కడ రైల్వే స్టేషన్ లోనే పాదగయ, మాంగళ్య గౌరీ ఆలయం, బౌద్ధ గయ వెళ్లడానికి ఆటో మాట్లాడుకున్నాము. విష్ణుపాదం ఆలయం పరిసరాల్లో అంతా పిండ తర్పణాల హడావుడే కనిపించింది. ఆలయం వెనుక వైపు ఫాల్గుణి నది ఉంది. ఆ నదిని కూడా చూశాం. ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరి అక్షయవటం చూసుకుని, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక్కటైన మంగళగౌరీ ఆలయానికి వెళ్లాం. అది చాలా పవర్ ఫుల్ శక్తిపీఠం అని చెబుతారు. ఈ ఆలయం ఒంటి గంట కల్లా మూసేస్తారని తిరిగి మూడు గంటలకు తెరుస్తారని అక్కడి స్థానికులు చెప్పారు.
అమ్మవారి దర్శనం అయిపోయాక శివాలయంలో స్వామిని భక్తితో కొలిచాం. ఆ తర్వాత భోజనం చేసి బౌద్ద గయకు బయలుదేరాం. ఆలయం లోపల తధాగతుడి నిండైన విగ్రహం చూడటానికి రెండు కళ్లు సరిపోవనిపించింది. ఆలయ పరిసరాల్లో ఎక్కడ చూసినా ధ్యానం చేసుకుంటున్న బౌద్ద సన్యాసులే కనిపించారు. ఆలయ ప్రాంగణం మొత్తం తిరగడానికి మాకు రెండు మూడు గంటలు పట్టింది. జీవితంలో ఒక్కసారైనా కచ్చితంగా బౌద్ద గయను చూసి తీరాల్సిందే. రాత్రి ఏడు గంటలకి రైలు రావడంతో మళ్లీ వందేభారత్ ప్రయాణం మొదలైంది. రాత్రి 10.30 గంటలకు వారణాసి చేరుకున్నాం.
మా కాశీ యాత్రలో చివరి మజిలీ ప్రయాగరాజ్. ఉదయం 7 గంటలకు క్యాబ్ లో ప్రయాగరాజ్ కి బయలుదేరాం. మార్గమధ్యలో సీతాదేవి భూమాతలో ఐక్యం అయిన చోటు చూశాము. ఉదయాన్నే ఆ ప్రాంతం అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఆ పరిసరాలను ఆస్వాధిస్తూ కాసేపు అక్కడ గడిపాం. 10.30 గంటలకు ప్రయాగరాజ్ చేరుకున్నాం. మొదటగా మేము త్రివేణి సంగమంలో స్నానానికి ప్లాన్ చేసుకున్నాం. త్రివేణి సంగమం అంటే గంగ, యమునా, సరస్వతి నదుల సంగమ ప్రాంతంగా చెబుతారు.
ఒడ్డు నుంచి అక్కడికి చేరుకోవడానికి బోటులో వెళ్లాలి. 5వేలకు బోటు మాట్లాడుకుని త్రివేణి సంగమం చేరుకున్నాం. అక్కడ స్నానాలు చేశాము. ఆ తర్వాత అష్ఠాదశ శక్తిపీఠాల్లో ఒక్కటైన మాధవేశ్వరీ అమ్మవారి దర్శనానికి వెళ్లాం. అక్కడి వాళ్లు అమ్మను అలూపిదేవి అని పిలుస్తారు. అక్కడ అమ్మవారి విగ్రహాలు ఏమీ ఉండవు. కేవలం ఒక ఉయ్యాల మాత్రమే ఉంటుంది. ఆ ఉయ్యాలకు నమస్కరించుకుని ముడుపులు ఏమైనా ఉంటే అక్కడ చెల్లించుకుని బయటకు రావడమే.
ఆలయం నుంచి బయటకు వచ్చేసరికి 3 గంటలైపోయింది. అప్పుడు తిరిగి వారణాసికి బయలుదేరిపోయాం. మధ్యలో భోజనం చేసుకుని, తిరిగి వారణాసికి వచ్చేసరికి సాయంత్రం ఆరున్నర దాటిపోయింది.
మా కాశీ యాత్ర అంతా అనుకున్న ప్లాన్ ప్రకారం చాలా బాగా గడిచింది. కానీ మేం ముందుగా అనుకున్నట్టుగా బిందుమాధవ స్వామిని చూడలేకపోయామన్న వెలితి ఒకటి మమ్మల్ని వేధిస్తూ వచ్చింది. చివరి రోజు ఉదయం 10.30కి మా విమానం. ఈ లోపు బిందు మాధవ స్వామిని చూసేందుకు బయలుదేరాం. తెల్లవారుజామున 4 గంటలకు మా రూమ్ నుంచి బయలుదేరి, వెనుక వైపు ఉన్న ఘాట్ల ద్వారా నడక మొదలుపెట్టాం. అస్సీ ఘాట్, గంగా ఘాట్ లను దాటుకుని లలితా ఘాట్ కి చేరుకున్నాము.
శవ దహనాలతో బిజీగా ఉండే హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణిక ఘాట్ లను చూశాము. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్లి 90 డిగ్రీల కోణంలో వంగిపోయి ఉండే రత్నేశ్వర్ మహదేవ్ ఆలయాన్ని సందర్శించుకున్నాం. తరువాత పంచగంగా ఘాట్ కి చేరుకున్నాము. అయితే అక్కడ నుంచి బిందు మాధవ స్వామి ఆలయానికి వెళ్లేందుకు దాదాపు 100కిపైగా మెట్లు ఎక్కాలి. అవి చిన్నగా, నిలువుగా ఉన్నాయి. అతి కష్టం మీద ఆ మెట్లన్నీ ఎక్కితే చివరకు బిందుమాధవ స్వామి ఆలయం కనిపించింది. అప్పటికి సమయం ఉదయం 5.30 అయింది.
ఆలయం ఇళ్ల మధ్యలో ఉన్నప్పటికీ ఆ సమయంలో అత్యంత ప్రశాతంగా ఉంది. ఆలయం పెద్దదే. ఈ ఆలయ నిర్వహణను శృంగేరి శారదా పీఠాదిపతులే చూసుకుంటున్నారు. స్వామి వారికి నమస్కరించి ప్రసాదం తీసుకుని అక్కడ నుంచి బయటకు వచ్చేశాము. ఉదయం 8.30 కల్లా రూమ్ ఖాళీ చేసి క్యాబ్ లో ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాం. 10.30 గంటలకు మా విమానం కాశీల బయలదేరింది 12.30 గంటలకు కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది. ఒక పూట అక్కడే ఉండి విశాఖపట్నం వెళ్లే విమానం సాయం త్రం 6.00 గంటలకు ఎక్కాము. రాత్రి ఎనిమిదన్నర గంటలకు విశాఖపట్నం చేరుకున్నాం. అలా మా కాశీయాత్ర సాఫీగా సాగిపోయి ఓ అందమైన అనుభూతిని మిగిల్చింది.