వేప పుల్లను.. పంటి పుల్ల, పళ్ల పుల్ల అని పిలుస్తుంటారు. ఇది కూడా ఓ బ్రష్ లాంటిదే. ఇప్పటికీ దీనినే ఉపయోగించే అమ్మమ్మలు, తాతయ్యలు ఉన్నారు. టూత్ బ్రష్‌లు రాకముందు వేప పుల్లలతో పళ్లు తోముకునేవారు. వేప అంటే చేదు కానీ దాని నుంచి వచ్చే ప్రయోజనాలు మాత్రం చాలా ఉంటాయి. ఈ చేదులో కూడా అద్భుతమైన ఆరోగ్య గుణాలున్నాయి. ఈ లక్షణాలను తెలిసిన పెద్దలు ఇప్పటికీ వేప పుల్లలతో పళ్లు తోముతున్నారు. ఈ జనరేషన్ వారికి పదిపదిహేను ఏళ్లు వచ్చాక.. పళ్లు పుచ్చిపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి.. కానీ మన ముందు తరం వారికి అలాంటి సమస్యలు చాలా తక్కువ. అందులో ఒక కారణం వేప పుల్లతో పళ్లు తొముకోవడం కూడా.
నోటి పరిశుభ్రత కోసం వేప పుల్లలను ఉపయోగించే వ్యక్తులు ఇతరుల కంటే మెరుగైన నోటి ఆరోగ్యం కలిగి ఉన్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వేప చెట్టులో నూట ముప్పైకి పైగా ఉపయోగకరమైన పోషకాలు ఉన్నాయి. అందుకే వేప చెట్టు ఒక్కో విధంగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
వేప ఆకు, బెరడు, వేరు, పువ్వు, పండు, కర్ర ఇలా అన్నింటిని గ్రామాల్లో మందుల రూపంలో ఉపయోగిస్తారు. వేపలో యాంటీ క్యాన్సర్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. అయితే వేప పుల్లతోనూ అనేక ఉపయోగాలు ఉన్నాయి. నోటి ఆరోగ్యం కోసం వేప పుల్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే కచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు.
వేప పుల్లను పల్లెటూర్లలో ఉదయం బ్రష్‌లాగా ఉపయోగిస్తుంటారు. వేప కర్ర చివర నమలాలి, మొత్తం నారను తీసేయాలి. ఇది టూత్ బ్రష్‌లాగా పనిచేస్తుంది. దంతాల మధ్య ఇరుక్కున్న ఆహార కణాలను బయటకు తీస్తుంది. దీని నుండి వచ్చే రసం మురికి లేకుండా చేస్తుంది. చిగుళ్ళను బలపరుస్తుంది.
మన చర్మంలాగే దంతాలు సహజంగా రంగులో ఉంటాయి. కొందరి దంతాలు సహజంగా తెల్లగా ఉంటే మరికొందరికి పసుపు రంగులో ఉంటాయి. కానీ వేప దంతాల సహజ రంగును కాపాడుతుంది. జీవితాంతం దంతాల ఆరోగ్యాన్ని చూసుకుంటుంది. సాధారణంగా ఒక పదిహేను సెంటీమీటర్ల పొడవు, చిటికెన వేలు అంత లావు ఉండే వేప పుల్ల సరిపోతుంది. దీనితో రోజు మీ పళ్లు తొముకుంటే ఎనలేని ప్రయోజనాలు పొందవచ్చు.
వేప పుల్లను నమలడం వల్ల వచ్చే రసం నోటిలోని లాలాజలంలో కలిసిపోయి అద్భుతమైన యాంటీ బ్యాక్టీరియల్ లిక్విడ్‌గా మారుతుంది. ఇవి బ్యాక్టీరియాను తక్షణమే చంపి నోటిని శుభ్రంగా ఉంచుతాయి. అలాగే చెంప, చిగుళ్లు, నాలుక మొదలైన వాటి లోపలి భాగంలో మంట వల్ల ఏర్పడే పొక్కులు, కోతలు మొదలైన వాటిని ఉపశమింపజేసే శక్తి ఈ ద్రవానికి ఉంది. కానీ ఈ ద్రవాన్ని మింగకుండా ఉమ్మి వేయాలి.
వేప పుల్ల దంతాలకు హాని కలిగించదు. కానీ మృదువైన చిగుళ్ళను గాయపరుస్తుంది. అందుకే వేప పుల్లతో పళ్లు తొముకునే సమయంలో కాస్త జాగ్రత్తలు వహించాలి. వేప పుల్లను ఒక్కటి ఒక్కసారే ఉపయోగించాలి. పదే పదే ఉపయోగించకూడదు. ఎందుకంటే దాని రసమంతా ఒక వాడకంలోనే పోతుంది. తర్వాత కావాలంటే కొత్త కర్రను ఉపయోగించాలి. వాడిన కర్రను అడ్డంగా చీల్చి.. నాలుకను కూడా శుభ్రం చేసుకోవచ్చు.