Vellulli Recipe: అన్నం మిగిలిపోతే ఇలా వెల్లుల్లి పులిహోర చేసేయండి, రుచి అద్భుతంగా ఉంటుంది-vellulli rice or garlic pulihora recipe in telugu know how to make this rice ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vellulli Recipe: అన్నం మిగిలిపోతే ఇలా వెల్లుల్లి పులిహోర చేసేయండి, రుచి అద్భుతంగా ఉంటుంది

Vellulli Recipe: అన్నం మిగిలిపోతే ఇలా వెల్లుల్లి పులిహోర చేసేయండి, రుచి అద్భుతంగా ఉంటుంది

Haritha Chappa HT Telugu

Vellulli Recipe: అన్నం మిగిలిపోవడం ప్రతి ఇంట్లో జరిగేదే. దాన్ని పడేసే కన్నా టేస్టీగా ఆరోగ్యంగా వెల్లుల్లి పులిహోర చేయండి. రుచి అద్భుతంగా ఉంటుంది.

వెల్లుల్లి పులిహోర రెసిపీ

వెల్లుల్లి ఉండే పోషకాలు ఇన్నీ అన్నీ కావు. అయినా సరే వెల్లుల్లిని తినడానికి ఎంతో మంది సంకోచిస్తారు. అందుకే అందరికీ నచ్చేలా వెల్లుల్లి పులిహోర ఎలా చేయాలో ఇచ్చాము. అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా తాలింపు పెట్టేస్తే పులిహోర రెడీ అయిపోతుంది. పైగా ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి మీకు ఈ రెసిపీ ఎంతో నచ్చుతుంది కూడా.

వెల్లుల్లి పులిహోర రెసిపీకి కావలసిన పదార్థాలు

వెల్లుల్లి రెబ్బలు - పదిహేను

పచ్చిమిర్చి - నాలుగు

ఉల్లిపాయ - ఒకటి

కరివేపాకులు - గుప్పెడు

పల్లీలు - గుప్పెడు

శనగపప్పు - ఒక స్పూను

పసుపు - అర స్పూను

మినప్పప్పు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

కారం - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

వెల్లుల్లి పులిహోర రెసిపీ

1. వెల్లుల్లి పులిహోరను అన్ని పులిహోర లాగా కాకుండా కాస్త భిన్నంగా చేస్తాము.

2. రోటిలో వెల్లుల్లి పాయలు, ఉప్పు, కారం వేసి బాగా దంచుకోవాలి.

3. వెల్లుల్లి రెబ్బలు ముక్కలుగా కనిపిస్తే చాలామంది తీసి పడేస్తారు. కాబట్టి మనం వెల్లుల్లి రెబ్బలను దంచేయడం వల్ల అది మెత్తగా అయిపోతాయి. అన్నం నుంచి తీసి పడేయడం వేరు కాదు. దీనివల్ల వాటిని తింటాము.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.

5. ఆ నూనెలో జీలకర్ర వేసి వేయించాలి.

6. తర్వాత శెనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి వేయించుకోవాలి.

7. ఇప్పుడు చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయలను కూడా వేసి వేయించాలి.

8. గుప్పెడు కరివేపాకులను కూడా వేసి వీటన్నింటిని బాగా వేయించుకోవాలి.

9. పచ్చిమిర్చిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపును వేసి కలుపుకోవాలి.

10. ముందుగా దంచి పెట్టుకున్నా వెల్లుల్లి కారం మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి.

11. ఇలా దంచడం వల్ల అన్నానికి మంచి సువాసన వస్తుంది. తినాలన్న కోరిక పుడుతుంది.

12. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మిగిలిపోయిన అన్నాన్ని ఈ మిశ్రమంలో వేసి పులిహోర లాగా కలిపేసుకోవాలి.

13. మంట చిన్నగా పెట్టుకోవడం మర్చిపోవద్దు. లేకుంటే త్వరగా అన్నం మాడిపోయే అవకాశం ఉంటుంది.

14. ఈ అన్నంపై కాస్త కొత్తిమీర తరుగును చల్లుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

15. అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా చేసి చూడండి. ఈ వెల్లుల్లి పులిహోర లేదా వెల్లుల్లి తాలింపు అన్నాన్ని చికెన్ కర్రీతో తింటే రుచి అదిరిపోతుంది

16. ఒక్కసారి మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి.

ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా గుప్పెడు వెల్లుల్లిపాయలు ఉంటే చాలు. ఈ వంటకాన్ని సులభంగా చేసేసుకోవచ్చు. అలాగే ఇది లంచ్ బాక్స్ రెసిపీ గా కూడా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి మన ఆరోగ్యానికి మేలు చేసేదే కాబట్టి దీని వల్ల మనకు అంతా ఆరోగ్యమే.

వెల్లుల్లిని ప్రతిరోజూ తినాల్సిన అవసరం ఉంది. ఇది మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వెల్లులిలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇది మనకి గుండె జబ్బులు రాకుండా, స్ట్రోక్ ప్రమాదం రాకుండా అడ్డుకుంటుంది. రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ముందుంటుంది. ఈస్ట్రోజన్ లోపాలు ఉన్నవారు వెల్లుల్లి తినడం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం