సాయంత్రం అయితే ఏవైనా స్నాక్స్ తినాలని పిల్లలు అడుగుతూ ఉంటారు. ప్రతిసారీ పిజ్జాలు, బర్గర్లు ఇచ్చే కన్నా ఇంట్లోనే వరిపిండి చెక్క లాంటి స్నాక్స్ చేయడం మంచిది. ఇవి కరకరలాడుతూ ఉంటాయి. కాబట్టి పిల్లలకు కూడా నచ్చుతాయి. పూర్వం ప్రతి ఇళ్లల్లో వరిపిండి చెక్కలు కనిపించేవి. కానీ ఆధునిక కాలంలో వీటిని తినేవారి సంఖ్య, చేసే వారి సంఖ్య తగ్గిపోయింది. వరిపిండి చెక్కల రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఇలా చేస్తే చాలా సులువు.
బియ్యప్పిండి - ఒక గ్లాసు
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
బటర్ - రెండు స్పూన్లు
అల్లం - చిన్న ముక్క
శెనగపప్పు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నువ్వులు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
1. పచ్చిమిర్చిని, కరివేపాకును, జీలకర్రను, అల్లాన్ని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
2. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెను స్టవ్ మీద పెట్టి అందులో అరగ్లాసు నీళ్లను వేయాలి.
3. ఆ నీళ్లను వేడి చేసి అందులో బటర్ ను వేయాలి.
4. అలాగే ఉప్పు కూడా వేయాలి. ఇప్పుడు ఆ నీటిలో శెనగపప్పు, నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి.
5. ముందుగా దంచుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
6. ఇప్పుడు ఆ వేడి నీటిలో వరిపిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా గరిటతో కలుపుతూనే ఉండాలి.
7. అలా వరిపిండి మొత్తాన్ని వేసి దగ్గరగా గట్టిగా అయ్యేలా చూసుకోవాలి.
8. ఇప్పుడు ఆ వరిపిండి ముద్దను చిన్న చిన్నవి తీసుకుని ఉండలుగా చుట్టుకోవాలి.
9. ఒక ప్లాస్టిక్ కవర్ పై వేసి చేతికి నూనె రాసుకొని వాటిని గుండ్రంగా ఒత్తుకోవాలి.
10. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.
11. ఆ నూనెలో ఈ ఒత్తుకున్న చిన్న పూరీలను వేసి రెండు వైపులా రంగు మారేవరకు వేయించుకోవాలి.
12. తర్వాత టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. అంతే వరిపిండి చెక్కలు రెడీ అయినట్టే. ఇవి కరకరలాడుతూ ఉంటాయి.
వరిపిండి చెక్కలు ఒకసారి చేసుకుంటే రెండు వారాలపాటు తాజాగా ఉంటాయి. క్రిస్పీగా ఉంటాయి. కాబట్టి పిల్లలకు కూడా నచ్చుతాయి. ఇంట్లోనే చేశారు కాబట్టి శుచిగా, శుభ్రంగా ఉన్నవి పిల్లలకు సంతోషంగా తినిపించవచ్చు.
సంబంధిత కథనం