Vankaya Palli karam: వంకాయ కర్రీ బోర్ కొడితే వంకాయ పల్లీ కారం వేపుడు చేసి చూడండి, రుచి అద్భుతం-vankaya palli karam fry recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vankaya Palli Karam: వంకాయ కర్రీ బోర్ కొడితే వంకాయ పల్లీ కారం వేపుడు చేసి చూడండి, రుచి అద్భుతం

Vankaya Palli karam: వంకాయ కర్రీ బోర్ కొడితే వంకాయ పల్లీ కారం వేపుడు చేసి చూడండి, రుచి అద్భుతం

Haritha Chappa HT Telugu
Jan 02, 2025 11:30 AM IST

Vankaya Palli karam: ఎక్కువ ఇళ్లల్లో వంకాయ కూరను వారానికి ఒకసారి అయినా వండుతారు. ప్రతిసారీ వంకాయని ఒకేలా వండే కన్నా ఒకసారి వంకాయ పల్లీ కారం వేపుడు ట్రై చేయండి. ఇది అదిరిపోతుంది. రెసిపీ చాలా సులువు.

వంకాయ పల్లీ కారం రెసిపీ
వంకాయ పల్లీ కారం రెసిపీ (Mana Chef/Youtube)

వంకాయ కూరను ఇష్టపడే వారి సంఖ్య తక్కువే. కానీ దాన్ని సరైన పద్ధతిలో వండితే రుచి అదిరిపోతుంది. వంకాయ ఇష్టం లేకపోయినా కూడా ప్రతి వారం ప్రతి ఇంట్లో ఒక్కసారి అయినా వంకాయ కచ్చితంగా వండుతారు. పిల్లల్లో కూడా వంకాయ మసాలా కూర వంటివి వడ్డిస్తారు. ఇక్కడ మేము వంకాయ పల్లి కారం వేపుడు రెసిపీ ఇచ్చాము. ఇది అద్భుతంగా ఉంటుంది. కొత్త రుచితో మీకు నచ్చుతుంది. సాంబార్ చేసుకున్నప్పుడు, పప్పు వండుకున్నప్పుడు, రసం చేసుకున్నప్పుడు పక్కన వంకాయ పల్లి కారం వేపుడు కూడా చేసి పెట్టుకోండి. ఆ రుచి అద్భుతంగా ఉండటం ఖాయం. ఒక్కసారి మీరు వండుకుంటే దీనికి మీరు దాసోహం అయిపోతారు. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

yearly horoscope entry point

వంకాయ పల్లి కారం వేపుడు రెసిపీకి కావలసిన పదార్థాలు

వంకాయలు - అరకిలో

నూనె - రెండు స్పూన్లు

మినప్పప్పు - ఒక స్పూను

పచ్చిశనగపప్పు - ఒక స్పూను

ఆవాలు - ఒక స్పూను

జీలకర్ర - రెండు స్పూన్లు

ఉల్లిపాయ - ఒకటి

కరివేపాకులు - గుప్పెడు

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - పావు స్పూను

వేరుశెనగ పలుకులు - పావు కప్పు

ధనియాలు - ఒక స్పూను

వెల్లుల్లి రెబ్బలు - 10

కారం - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

వంకాయ పల్లి కారం వేపుడు రెసిపీ

1. వంకాయలను నిలువుగా కోసుకోవాలి. ఒక్కో వంకాయను అయిదారు ముక్కలు చేసుకోవాలి. నీటిలో వేసి వదిలేయాలి.

2. ఇప్పుడు వేరుశెనగ పలుకులను తీసుకొని కళాయిలో వేయించాలి.

3. ఆ వేయించిన వేరుశెనగ పలుకుల పొట్టును తీసేయాలి.

4. మిక్సీలో ఈ వేరుశెనగ పలుకులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కారం వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పల్లీకారం రెడీ అయినట్టే.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

6. ఆ నూనెలో ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఒక స్పూను జీలకర్ర వేసి వేయించాలి.

7. అవి వేగాక కరివేపాకులను వేసి వేయించాలి.

8. ఆ తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి.

9. అలాగే ఉల్లిపాయలను ముక్కలుగా కోసి దానికి వాటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి.

10. రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలిపి మూత పెట్టాలి.

11. పది నిమిషాలు పాటు అలా వదిలేయాలి. తర్వాత మూత తీసి పసుపు వేసి బాగా కలపాలి.

12. తర్వాత మూత పెట్టి వంకాయలు మెత్తగా మగ్గే వరకు అలా ఉంచాలి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి.

13. వంకాయలు మెత్తగా మగ్గిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పల్లి కారాన్ని వేసి బాగా కలపాలి.

14. ఇది వేపుడు లాగా అవుతుంది. అప్పుడు పైన కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి.

15. అంతే టేస్టీ వంకాయ పల్లి కారం వేపుడు రెడీ అయినట్టే.

దీన్ని అన్నంలో కలుపుకొని తింటే రుచిగా ఉంటుంది. లేదా సాంబారు, పప్పు అన్నం తో పాటు పక్కన సైడ్ డిష్ లా పెట్టి నంజుకున్నా టేస్టీగా ఉంటుంది.

వంకాయలను చాలామంది తక్కువగా చూస్తారు. నిజానికి అవి చేసే మేలు ఇంతా అంతా కాదు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వంకాయలతో చేసిన రెసిపీలను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వారానికి ఒకటి నుంచి రెండుసార్లు వంకాయ కూరను తినేందుకు ప్రయత్నించండి. ఇలా రుచిగా వండుకుంటే ఎవరికైనా తినాలనిపిస్తుంది.

Whats_app_banner