Vankaya Nuvvula Pachadi: వంకాయ నువ్వుల పచ్చడి ఇలా చేశారంటే, వేడి వేడి అన్నంతో అదిరిపోతుంది-vankaya nuvvula pachadi recipe in telugu know how to make this chutney ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vankaya Nuvvula Pachadi: వంకాయ నువ్వుల పచ్చడి ఇలా చేశారంటే, వేడి వేడి అన్నంతో అదిరిపోతుంది

Vankaya Nuvvula Pachadi: వంకాయ నువ్వుల పచ్చడి ఇలా చేశారంటే, వేడి వేడి అన్నంతో అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Published Mar 13, 2024 05:40 PM IST

Vankaya Nuvvula Pachadi: పచ్చళ్ళు ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి వంకాయ నువ్వుల పచ్చడిని టేస్ట్ చేసి చూడండి. వంకాయ పచ్చడి లేదా నువ్వుల పచ్చడి వేరువేరుగా తిని ఉంటారు. ఈ రెండిటినీ కలిపి చేస్తే రుచి అదిరిపోతుంది.

వంకాయ నువ్వుల పచ్చడి రెసిపీ
వంకాయ నువ్వుల పచ్చడి రెసిపీ (youtube)

Vankaya Nuvvula Pachadi: కొన్ని రకాల పచ్చళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని అన్నంలోనూ కలుపుకోవచ్చు, ఇడ్లీ, దోశలతోనూ తినవచ్చు. అలాంటి కోవకే చెందుతుంది ఈ వంకాయ నువ్వుల పచ్చడి. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. అలాగే ఇడ్లీ, దోశలకు జతగా తిన్నా కూడా రుచిగా ఉంటుంది. వంకాయ పచ్చడి లేదా నువ్వుల పచ్చడి విడివిడిగా తిని ఉంటారు. ఒక్కసారి ఈ రెండింటినీ కలిపి చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందో... ఈ వంకాయ నువ్వులు పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

వంకాయ నువ్వుల పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

వంకాయ - పావు కిలో

నువ్వులు - పావు కప్పు

వెల్లుల్లి - నాలుగు రెబ్బలు

ఉల్లిపాయ - ఒకటి

టమోటోలు - రెండు

నీరు - సరిపడా

ఉప్పు - రుచికి సరిపడా

ఆవాలు - పావు స్పూను

జీలకర్ర - అర స్పూను

పచ్చిమిరపకాయలు - ఐదు

ఎండుమిర్చి - రెండు

వెల్లుల్లి రెబ్బలు - ఐదు

కరివేపాకులు - గుప్పెడు

వంకాయ నువ్వుల పచ్చడి రెసిపీ

1. వంకాయను ముక్కలుగా కోసుకొని కుక్కర్లో వేయాలి. కాస్త నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టాలి.

2. మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆవిరి తగ్గిపోయాక కుక్కర్ మూతను తీయాలి.

3. వంకాయ మీదున్న తొక్క సులువుగా వచ్చేస్తుంది. దాన్ని తీసి పడేయాలి.

4. తర్వాత మిగతా వంకాయలను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టాలి. అందులో నువ్వులు వేసి వేయించి చల్లారనివ్వాలి.

6. ఈ నువ్వులను కూడా మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

8. నూనె వేడెక్కాక ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి.

9. అలాగే సన్నగా తరిగిన టమోటోలను కూడా వేయాలి.

10. పచ్చిమిర్చి తరుగును వేసి వేయించుకోవాలి.

11. మూత పెడితే టమోటోలు ఇగురులాగా మెత్తగా ఉడికిపోతాయి.

12. ఆ తర్వాత అందులో ఈ వంకాయ పేస్టును వేసి రెండు నిమిషాలు కలుపుకోవాలి.

13. తర్వాత నువ్వుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి.

14. రుచికి సరిపడా ఉప్పును వేసి చిన్న మంట మీద ఉడికించాలి.

15. ఇప్పుడు మరొక స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, గుప్పెడు కరివేపాకులు వేసుకొని పోపు పెట్టి నువ్వుల వంకాయ నువ్వుల పచ్చడి పై వేయాలి. అంతే వంకాయ నువ్వుల పచ్చడి రెడీ అయినట్టే.

16. స్టవ్ కట్టేసి వేడి వేడి అన్నం పై ఈ వంకాయ నువ్వుల పచ్చడి వేసుకొని తినండి రుచి మామూలుగా ఉండదు.

17. మిగిలిపోతే ఇడ్లీ, దోశెల్లోకి కూడా ఉపయోగపడుతుంది. పైగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి వంకాయ నువ్వులు పచ్చడి ఇలా చేసుకొని తిన్నారంటే రుచి అదిరిపోతుంది.

వంకాయలు ఇష్టం లేనివారి సంఖ్య ఎక్కువే. నిజానికి వంకాయలు మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతిరోజూ వంకాయలు తినేవారికి ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. వంకాయ కూరను ఇష్టపడకపోతే ఇలా వంకాయ నువ్వుల చట్నీని చేసుకుని తినండి. ఇక నువ్వులు ప్రతిరోజు మహిళ ఆహారంలో ఉండాల్సిందే. నెలసరి సమయంలో వచ్చే ఎన్నో ఆరోగ్య పరిస్థితులకు నువ్వులు చెక్ పెడతాయి. నువ్వులు ప్రతిరోజూ తినేవారికి నెలసరి సమయంలో పొట్టనొప్పి, పొట్ట తిమ్మిరి వంటి లక్షణాలు రాకుండా ఉంటాయి. వంకాయ నువ్వులు పచ్చడి వారానికి ఒక్కసారైనా తినడం అలవాటు చేసుకోండి. ఇది రుచిగా కూడా ఉంటుంది.

Whats_app_banner