Vankaya methi karam: వంకాయ మెంతికూర కారం రెసిపీ, ఈ కూర ఒక్కసారి వండారంటే మర్చిపోలేరు అదిరిపోతుంది
Vankaya methi karam: వంకాయ, మెంతి కూర కలిపి మేము చెప్పిన పద్ధతిలో ఒకసారి కూర వండి చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది. పైగా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా.
వంకాయ కూర ఎంతో ఫేమస్. కానీ దీన్ని ఇష్టపడే వారు మాత్రం చాలా తక్కువ. నిజానికి వంకాయను సరైన పద్ధతిలో కూరగా వండితే ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది. ఇక్కడ మేము వంకాయ మెంతికూర కలిపి కూర ఎలా వండాలో ఇచ్చాము. వంకాయ మెంతికూర కారం రెసిపీ ఎలాగో తెలుసుకోండి. మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది.
వంకాయ మెంతికూర కారం రెసిపీకి కావలసిన పదార్థాలు
వంకాయలు - అరకిలో
మెంతి ఆకులు - రెండు కప్పులు
టమోటోలు - రెండు
ఆయిల్ - సరిపడినంత
ఆవాలు - ఒక స్పూను
ఉల్లిపాయలు - రెండు
అల్లం తరుగు - ఒక స్పూను
వెల్లుల్లి తరుగు - ఒక స్పూను
పసుపు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
ఆమ్చూర్ పొడి - రెండు స్పూన్లు
నిమ్మరసం - ఒక స్పూను
ఎండుమిర్చి - ఆరు
ధనియాలు - రెండు స్పూన్లు
మినప్పప్పు - రెండు స్పూన్లు
గసగసాలు - రెండు స్పూన్లు
నువ్వులు - ఒక స్పూను
వంకాయ మెంతికూర కారం రెసిపీ
1. వంకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకోవాలి.
2. మరీ చిన్న ముక్కలు కాకుండా, అలా అని పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజులో వంకాయలను కట్ చేసుకోండి.
3. మెంతు ఆకులను కూడా వీలైనంత సన్నగా తరగండి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఎండుమిర్చి, ధనియాలు, మినప్పప్పు, గసగసాలు, నువ్వులు వేసి వేయించాలి.
5. వాటిని మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
7. ఆ నూనెలో ఆవాలు వేసి చిటపటలాడించాలి.
8. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించాలి.
9. ఉల్లిపాయలు రంగు మారేవరకు ఉంచి తర్వాత అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి వేయించుకోవాలి.
10. ఇప్పుడు సన్నగా తరిగిన టమోటో ముక్కలను వేసి అవి మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.
11. టమాటోలు మెత్తగా అయ్యాక తరిగిన వంకాయలు, మెంతికూరను వేసి బాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాలు పాటు వీటిని ఉడకనివ్వాలి.
12. ఆ తర్వాత మూత తీసి ఉప్పు, పసుపు పొడి వేసి బాగా కలపాలి.
13. అవి ఉడకడానికి సరిపడా అరకప్పు నీటిని కూడా వేయాలి.
14. ఒకసారి కలిపి మూత పెట్టి పది నిమిషాల పాటు వదిలేయాలి.
15. వంకాయలు బాగా ఉడికాక మూత తీసి ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి బాగా కలపాలి.
16. అలాగే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి.
17. నీరంతా ఇంకి అది దగ్గరగా అయ్యేవరకు చిన్న మంట మీద ఉడికించుకోవాలి.
18. దించేసేముందు పైన నిమ్మరసాన్ని జల్లుకోవాలి. అంతే టేస్టీ వంకాయ మెంతికూర కారం రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది.
వంకాయ కూర నచ్చని వారికి కూడా ఈ వంకాయ మెంతికూర కారం చాలా నచ్చుతుంది. దీన్ని అన్నంతో తింటే అదిరిపోతుంది. లేదా చపాతీ రోటీల్లో కూడా తినవచ్చు. ఇడ్లీ దోశలతో తిన్నా కూడా రుచిగానే ఉంటుంది. ఒక్కసారి దీన్ని మీరు చేసుకుని చూడండి. ఇందులో ఉండే మెంతికూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.