Vankaya Recipes: వంకాయ గుజ్జు కూర, ఇలా వండితే ఇగురులాగా వస్తుంది, రెసిపీ ఇదిగో
Vankaya Recipes: వంకాయ పేరు చెబితేనే ఎక్కువ మంది ముఖాలు ముడుచుకుపోతాయి రుచి అదిరిపోతుంది ఒకసారి ప్రయత్నించండి.
వంకాయని ఇగురులాగా వచ్చేలా వండితే వేడి వేడి అన్నంలో టేస్టీగా ఉంటుంది. వంకాయను ఇగురులాగా వచ్చేలా వండాలంటే ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. కొంచెం కూరలోనే ఎక్కువ అన్నం కలుస్తుంది. ఈ వంకాయ గుజ్జు కూర చూసేందుకు వంకాయ ఇగురు కర్రీ ఇలా ఉంటుంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
వంకాయ గుజ్జు కూర రెసిపీకి కావలసిన పదార్థాలు
వంకాయలు - అరకిలో
టమోటాలు - రెండు
ఉల్లిపాయలు - మూడు
ఇంగువ - చిటికెడు
నీళ్లు - సరిపడినన్ని
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - అర స్పూను
కారం - ఒక స్పూను
మెంతులు - పావు స్పూను
ఆవాలు - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
పచ్చిశనగపప్పు - అర స్పూను
మినప్పప్పు - అర స్పూను
వెల్లుల్లి రెబ్బలు - ఐదు
ఎండుమిర్చి - నాలుగు
కరివేపాకులు - గుప్పెడు
పచ్చిమిర్చి - నాలుగు
ధనియాల పొడి - ఒకటిన్నర స్పూను
జీలకర్ర పొడి - పావు స్పూను
చింతపండు - చిన్న ఉసిరికాయ సైజులో
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
వంకాయ గుజ్జు కూర రెసిపీ
1. వంకాయ గుజ్జు కూర కోసం మీరు నల్ల వంకాయలను ఎంపిక చేసుకుంటే మంచిది.
2. ఇప్పుడు ఈ వంకాయలను నిలువుగా ఐదారు ముక్కలుగా చేసుకోవాలి.
3. నీటిలో వేసి పది నిమిషాల ఉంచాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. ఆ నూనెలో కాస్త ఇంగువ వేయాలి. ఆ ఇంగువలోనే కోసుకున్న వంకాయ ముక్కలను వేసి మగ్గించాలి.
5. కాసేపటికి తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి కలుపుకోవాలి.
6. అలాగే టమోటో ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి.
7. ఈ మిశ్రమంలో పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి మెత్తగా మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.
8. మిక్సీలో ఈ మిశ్రమాన్ని వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
9. మరీ మెత్తగా రుబ్బుకోకూడదు. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
10. ఆ నూనెలో మెంతులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకులు, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి.
11. ఈ మొత్తం మిశ్రమం వేగాక ముందుగా మిక్సీలో కచ్చాపచ్చాగా రుబ్బుకున్న వంకాయ మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
13. ఆ తరువాత ధనియాలపొడి, జీలకర్ర పొడి, కారం వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
14. చింతపండును ముందుగానే ఒక గ్లాసుడు నీటిలో నానబెట్టుకోవాలి.
15. దాన్ని బాగా చేత్తోనే నలిపి ఆ చింతపండు నీటిని వేసి ఈ కూరను కలుపుకోవాలి.
16. పైన మూత పెట్టి చిన్న మంట మీద పావుగంట సేపు ఉడికించాలి.
17. ఇది ఇగురులాగా అయ్యేవరకు అలా ఉడికించుకోవాలి.
18. దగ్గరగా ఇగురు లాగా అయ్యాక చివరలో కొత్తిమీర తరుగును చల్లి స్టవ్ ఆఫ్ చేసేయాలి.
అంతే టేస్టీ వంకాయ ఇగురు కూర లేదా వంకాయ గుజ్జు కూర రెడీ అయినట్టే. దీన్ని ఒక్కసారి తిన్నారంటే మీరు వదల్లేరు.
వంకాయలు మన ఆరోగ్యానికి ఇచ్చే పోషకాలు ఎంతో ఎక్కువ. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో వంకాయలు ముందుంటాయి. కాబట్టి డయాబెటిస్ తో బాధపడుతున్న వారు వంకాయలు కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోండి. రక్తంలో చక్కెర శోషణను తగ్గించడంలో ఇది ముందు ఉంటుంది. అలాగే చర్మానికీ, జుట్టుకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. చర్మాన్ని మెరిపించి జుట్టును పొడవుగా ఎదిగేలా చేస్తుంది. వంకాయలో విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ b6, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటివన్నీ నిండుగా ఉంటాయి. వంకాయ తినడం వల్ల ఎలాంటి కొలెస్ట్రాల్ శరీరంలో చేరదు. కాబట్టి బరువు పెరుగుతామన్న భయం లేకుండా వంకాయను తినవచ్చు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే శక్తి వంకాయకి ఉంది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లను కూడా ఇది అడ్డుకుంటుంది.