Vitamin E Tablet: అందం కోసం ముఖానికి విటమిన్ E టాబ్లెట్ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది!
Vitamin E Tablet: అందంగా కనిపించాలనే ప్రయత్నంలో ఈ మధ్య చాలా మంది ముఖానికి విటమిన్-ఈ ట్యాబ్లెట్లను ఉపయోగిస్తున్నారు. ఇవి నిజంగానే మీ అందాన్ని రెట్టింపు చేస్తాయా? విటమిన్ - ఈ క్యాప్సుల్స్‌ను ముఖానికి అప్లై చేసేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం రండి.
సోషల్ మీడియా ప్రపంచం వచ్చాక చూసిన ప్రతిదీ అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ముఖ్యంగా అందం, ఆభరణాలు, వస్త్రాల గురించి అయితే చెప్పక్కర్లేదు. శరీర ఆరోగ్యం నుండి వ్యాధి నివారణ వరకు యూట్యూబ్(YouTube)లో, ఇన్‌స్టాగ్రామ్‌లలో కోట్ల కొద్దీ వీడియోలు ఉన్నాయి. ఎలా వంట చేయాలి, ఏం తినాలి వంటి విషయాల దగ్గర నుంచి అందం కోసం ఏం వాడాలి, ఎలా వాడాలి వరకూ చాలా విషయాలను వీడియోల్లో చూసి తూచా తప్పకుండా పాటించేస్తున్నారు. అందులో ఎక్కువ మంది ఫాలో అవుతున్న టిప్స్ ముఖం, జుట్టుకు సంబంధినవే ఉంటాయి. వీటిల్లో ఒకటే విటమిన్-ఈ క్యాప్సుల్ వాడకం. బ్యూటీ సంబంధించిన చాలా వీడియోల్లో వీటిని విరివిగా వాడుతున్నారు. అవి చూసి జనాలు యాజిటీజ్ ఫాలో అయిపోతున్నారు. ఇలా ముఖానికి విటమిన్-ఈ ట్యాబ్లెట్లను ముఖానికి వాడచ్చా.. వాడకూడదా? అని ఆలోచించే వారిలో మీరూ ఉంటే ఇక్కడ కొన్ని విషయాలున్నాయి తెలుసుకోండి.
Vitamin E ప్రయోజనాలు:
- వాస్తవానికి Vitamin E టాబ్లెట్ తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. Vitamin E ను ఆల్ఫా-టోకోఫెరోల్ అని కూడా అంటారు. చర్మంలో ఫ్రీ రాడికల్ నష్టాన్ని నివారించడంలో, శరీర కణాలను రక్షించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
- విటమిన్-ఈ చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి, పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇది చర్మం నిర్మాణం, సాగే గుణం, దృఢత్వాన్ని సమర్ధించే ప్రోటీన్‌ను కూడా బలపరుస్తుంది.
- Vitamin E లోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు జుట్టు రాలడాన్ని నివారించడానికి, నష్టాన్ని పునరుద్ధరించడానికి సహాయపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
కానీ డాక్టర్ సలహా లేకుండా ఏ మందులు వాడినా ప్రమాదమే. ఇదే కాదు.. డాక్టర్ సలహా లేకుండా స్వయంగా ఎలాంటి మందులు వాడిన ప్రమాదమే. Vitamin E టాబ్లెట్‌ను డాక్టర్ సలహా లేకుండా వాడకూడదని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందుకు కారణం వీటిని ఎక్కువగా ఉపయెగించే వారికి క్యాన్సర్ రావడం. చర్మ సంరక్షణ కోసం దొరికే Vitamin E టాబ్లెట్‌లు కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.
Vitamin E ఎందుకు ప్రమాదకరంగా మారుతుంది?
- ఎన్ని ప్రయోజనాలున్నప్పటికీ కొన్ని వస్తువులను ఉపయోగించే విధానం లాభం కన్నా ఎక్కువ నష్టాన్నే కలిగిస్తాయి. విటమిన్-ఈ విషయంలో కూడా అదే జరుగుతుంది.
- చర్మం, జుట్టు విషయంలో దీని ప్రయోజనాలన్నీ విని నేరుగా Vitamin E టాబ్లెట్‌లు కొనడం తెలివితక్కువ పని. ఎందుకంటే ఈ సప్లిమెంట్లలో ఆల్-రేస్-ఆల్ఫా-టోకోఫెరోల్ ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి.
- Vitamin E సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు, వికారం, విరేచనాలు, కడుపు నొప్పి, అలసట, మైకము, అస్పష్టమైన దృష్టి, తలనొప్పి వంటి వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
- శరీరంలో Vitamin E లోపం ఉన్నప్పుడు మాత్రమే Vitamin సప్లిమెంట్లను ఉపయోగించవచ్చు. అది కూడా రోజుకు 400 IU కంటే ఎక్కువ Vitamin E టాబ్లెట్‌లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ కూడా రావచ్చు.
ముఖానికి Vitamin E రాసుకునేటప్పుడు..
Vitamin E టాబ్లెట్‌లను చర్మానికి నేరుగా రాసుకోవడం మంచిది కాదని తెలుసుకోండి. తప్పని పరిస్థితుల్లో రాసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నేరుగా రాసుకునే బదులు మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనెతో కలిపి రాసుకోండి. లేకపోతే, చర్మం అసౌకర్యంగా అనిపించవచ్చు. పండ్లు, కూరకాయలు, గుడ్లు, మాంసంలో సహజంగానే Vitamin E ఉంటుంది. కనుక అందం కోసం సప్లిమెంట్లకు బదులుగా వీటిని తిని విటమిన్-ఈ ని పొందే ప్రయత్నం చేయండి. ఇదే అన్ని రకాలుగా మంచిది. దీర్ఘకాలిక లేదా తీవ్రమైన సమస్యలకు వీటిని ఉపయోగించడానికి ముందు డాక్టర్‌ను సంప్రదించడమే ఉత్తమ మార్గం.