ఇంటిని మెయింటెన్ చేయడమంటే అంత ఆషామాషీ విషయం కాదు. ఎన్ని వస్తువులు అవసరం ఉంటాయో. అలాంటి వస్తువుల్లో ఏది లేకపోయినా పని ఆగిపోతుంది. సమయం వృధా అయిపోతుంది. మనకు రోజు వారీ పనుల్లో ఎంతో సహకరించే కొన్ని గ్యాడ్జెట్లు ఉన్నాయి. వీటిని తప్పకుండా ఇంట్లో ఉంచుకోవడం వల్ల మన పనులు ఎంతో సులభం అయిపోతాయి. సౌకర్యంగానూ అనిపిస్తాయి. అలాంటి టాప్ హోం గ్యాడ్జెట్లేంటో చూసేయండి.
ఇవాళ రేపు మనం బజార్ నుంచి కొని తెచ్చుకునే పచారీ సామాన్లన్నీ పాలిథిన్ సంచుల్లోనే ప్యాక్ అయి వస్తున్నాయి. వాటిని కట్ చేసి కొంచెం వాడుకున్న తర్వాత మళ్లీ దాన్ని రబ్బరు బ్యాండు వేసో, ముడి వేసే పెడుతుంటాం. లేదంటే దానికో డబ్బా చూసి అందులో ఉంచుతాం. ఇలాంటి జంఝాటాలు ఏమీ లేకుండా చక్కగా అదే ప్యాకెట్‌ని పాలిథిన్ బ్యాగ్ సీలర్‌తో సీల్ చేసేసుకోవచ్చు. మళ్లీ షాపు నుంచి తెచ్చుకున్నప్పుడు ఎలా ఉందో అచ్చంగా అలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇందుకోసం అచ్చంగా పిన్నుల మిషన్ అంత సైజులోనే మార్కెట్‌లో మినీ ఫుడ్ సీలర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్యాకింగ్ చేసేయడం వల్ల గాలి తగలదు కాబట్టి ప్యాక్ లోని పదార్థాలకు ఫంగస్‌లు పట్టడం లాంటివి జరగవు.
సాధారణంగా అందరి ఇళ్లల్లోనూ కాలింగ్ బెల్ ఉంటుంది. అయితే స్విచ్ ఆన్ చేస్తే అది ఇంట్లో మోగాలి. కాబట్టి దానికి సంబంధించిన వైరింగ్ తప్పకుండా ఉండాల్సి ఉంటుంది. ఒక వేళ అలా వైరింగ్ ఏర్పాట్లు లేకపోతే గనుక ఇప్పుడు వైర్‌లెస్ డోర్ బెల్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంట్లో బెల్ స్విచ్ ఒకటి, రిసీవర్ ఒకటి రెండూ సెట్‌గా వస్తాయి. కాలింగ్ బెల్‌ని ఇంటి బయటి తలుపు దగ్గర అంటించాలి. రిసీవర్ డివైజ్‌ని ఇంట్లో ఏదో ఒక ప్లగ్‌లో పెట్టి స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. వీటిలో మనకు కావాల్సిన రింగ్ టోన్‌ని ఎంపిక చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది.
మనలో చాలా మందికి తాళాలు ఎక్కడో ఒకచోట పెట్టేసి వెతుక్కునే అలవాటు ఉంటుంది. మీరు ఇలాంటి జాబితాలో ఉన్నట్లయితే ఈ కీ ఫైండర్లను ట్రై చేయండి. చిన్నగా ఉండే వీటిని మీ తాళం చెవికి తగిలించేస్తే సరిపోతుంది. దీన్ని ఒకసారి మన స్మార్ట్ ఫోన్‌లోని యాప్‌తో కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్‌లో దీన్ని ఫౌండ్ చేయడానికి ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇది బీప్ సౌండ్ రావడం ప్రారంభం అవుతుంది. చాలా రకాల కంపెనీలకు సంబంధించిన కీ ఫైండర్లు ఇప్పుడు మార్కటెల్లో అందుబాటులో ఉన్నాయి.
టాపిక్