Chanakya Niti Telugu : తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు.. పిల్లల జీవితాన్ని నాశనం చేస్తాయి
Chanakya Niti on Children's : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో పిల్లల జీవితం బాగుండాలంటే తల్లిదండ్రుల నిర్ణయాలు ముఖ్యమని చెప్పాడు. కొన్ని విషయాలను తల్లిదండ్రులు సీరియస్‌గా తీసుకోకుంటే పిల్లల భవిష్యత్ పాడవుతుందని వివరించాడు.
ఆచార్య చాణక్యుడు దౌత్యవేత్త, ఆర్థికవేత్త. చాణక్యుడి సలహాలు నేటికీ మన జీవితానికి వర్తిస్తాయి. చాణక్య నీతిలో మానవ జీవితంలోని ఆచరణాత్మక అంశాలను చెప్పాడు. ఆచార్య చాణక్యుడి సలహాను సరిగ్గా పాటించడం వల్ల విజయం సాధించడమే కాకుండా జీవితంలోని మంచి, చెడు క్షణాలకు తనను తాను సిద్ధం చేసుకోవచ్చు. చాణక్యుడు సూత్రాలు నేటికీ పాటించేవారు ఉన్నారు. గొప్ప గొప్ప వ్యక్తులు సైతం చాణక్య నీతిని ఫాలో అవుతారు. ఎందుకంటే జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలో చాణక్య నీతి వివరిస్తుంది.
చాణక్యుడు తన నీతిశాస్త్రంలో తల్లిదండ్రుల బాధ్యతలను కూడా పేర్కొన్నాడు. పిల్లలను సరైన వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు పలు సలహాలు ఇచ్చాడు. బిడ్డను సమాజంలో నడిచేలా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని చాణక్యుడు అన్నాడు. తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచే సమయంలో సరిగా ప్లానింగ్ చేయాలని అన్నాడు. పిల్లలను మనం చూసుకునే విధానంతోనే వారు తయారవుతారు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలను పాటిస్తే జీవితంలో ముందుకు వెళ్లవచ్చు.
మంచి, చెడు చెప్పాలి
చాణక్యుడు చెప్పిన ప్రకారం, పిల్లవాడిని ఎంతగా ముద్దుగా చూసుకుంటే పిల్లలలో మొండితనం అణచివేయబడుతుంది. ప్రతి బిడ్డకు ఆప్యాయత, ప్రేమ అవసరం. కానీ అతి ప్రేమను ఇచ్చి పిల్లల తప్పులను అంగీకరించకపోతే, వారు చెడు మార్గంలో పయనిస్తారు. అదే తప్పులను పదే పదే చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు శిక్ష లేదా తిట్టడం పిల్లవాడిని సరైన మార్గంలో పెట్టడానికి సహాయపడుతుంది. పిల్లలు ఏది చేసినా.. సరైనదే అనే భ్రమలో తల్లిదండ్రులు ఉండకూడదని చాణక్య నీతి చెబుతుంది. వారు చేసే పనులకు తప్పు, ఒప్పులను వివరించాలి. అప్పుడే వారు సరైన దారిలో నడుస్తారు.
మంచి లక్షణాలు
తల్లిదండ్రులు తమ పిల్లల్లో మంచి లక్షణాలను అలవర్చాలి. పిల్లలు మంచి పనిలో నిమగ్నమవ్వాలి, నీతి, మర్యాద, సౌమ్యత నేర్పించాలి. ఈ లక్షణాలను కలిగి ఉన్న పిల్లలు ఇంటి పేరును ఎక్కడికో తీసుకెళ్తారు. పిల్లల్లో విజ్ఞానం, హేతుబద్ధత, విచక్షణ, సహనం వంటి లక్షణాలను పెంపొందించడం తల్లిదండ్రుల కర్తవ్యంగా ఉండాలి. ఎందుకంటే సమాజంలో రేపటి తరాన్ని నడిపేది వారే. పిల్లలు సరైన మార్గంలో నడిచేందుకు మంచి విషయాలు చెప్పాలి. ఎప్పటికప్పుడు మంచి చెడులపై అవగాహన కల్పించాలి.
చదువు ఇవ్వాలి
పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులే ముందుగా చొరవ తీసుకోవాలి. ప్రతి తల్లితండ్రులు తమ పిల్లలకు సరైన విద్యను అందించి సమాజంలో యోగ్యమైన వ్యక్తిగా నిలబెట్టాలి. కానీ తమ పిల్లలకు సరైన విద్యను అందించడంలో విఫలమైన తల్లిదండ్రులు తమ పిల్లలకు శత్రువులతో సమానం. పిల్లలకు చదువును దూరం చేయడం వల్ల వారి జీవితమంతా నాశనం అవుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యను అందించాలి. వారికి సరైన విద్య అందితేనే మీ తర్వాత తరాలు బాగుపడతాయి.
పైన చెప్పిన విషయాలు తల్లిదండ్రులు కచ్చితంగా పాటించాలి. అందులో ఒక్క విషయాన్ని విస్మరించినా.. పిల్లల జీవితాన్ని నాశనం చేసిన వారవుతారు. ఎందుకంటే పిల్లలు ఎదిగే సమయంలోనే వారికి సరైన దారి చూపించాలి. లేదంటే వారు తప్పుడు మార్గంలో వెళ్తారని చాణక్య నీతి చెబుతుంది.