పీరియడ్ సమయంలో మీ ఆహార కోరికలు మీ శరీరం గురించి కొన్ని విషయాలు చెప్తాయట, అవేంటో తెలుసా?-unraveling your period cravings the hidden messages your body sends each month through food preferences ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పీరియడ్ సమయంలో మీ ఆహార కోరికలు మీ శరీరం గురించి కొన్ని విషయాలు చెప్తాయట, అవేంటో తెలుసా?

పీరియడ్ సమయంలో మీ ఆహార కోరికలు మీ శరీరం గురించి కొన్ని విషయాలు చెప్తాయట, అవేంటో తెలుసా?

Ramya Sri Marka HT Telugu

పీరియడ్స్ సమయంలో అమ్మాయిలకు కొన్ని వింత కోరికలు పుడుతుంటాయి. ఇది తినాలి, అది తినాలి అంటూ మనసు లాగేస్తుంటుంది. ఇవన్నీ సాధారణమే అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ కోరికలు మీ శరీరం లోపల ఏం జరుగుతుందో చెప్పే రహస్య సంకేతాలు కూడా కావచ్చట! ఎలాగో తెలుసుకోండి.

చాక్లెట్ తింటున్న యువతి

పీరియడ్స్ అమ్మాయిలకు ప్రతి నెలా వచ్చే సహజ ప్రక్రియ. అయితే ఈ సమయంలో వారిలో కొన్ని రకాల ఆహారాల పదార్థాలను తినాలనే కోరిక పుడుతుంది. కొందరు పీరియడ్స్ లో చాక్లెట్ తినాలని ఆరాటపడితే ఇంకొందరు కారంగా ఏదైనా ఉండాలని కోరుకుంటారు. కొన్నిసార్లు అప్పటివరకు ఇష్టపడని ఆహారాలపై కూడా విపరీతమైన కోరిక కలగడం కూడా జరుగుతుంది.ఇలాంటివన్నీ సహజమే ఇవి కేవలం పీరియడ్స్ లో వచ్చే మూడ్ స్వింగ్స్ కారణంగానే జరుగుతాయని అంతా అనుకుంటారు. నిజానికి ఆ ఆలోచన తప్పు.

ఎందుకంటే పీరియడ్స్ సమయంలో కలిగే ఆహారపు కోరికలు అన్ని సార్లు మానసిక స్థితి మీద ఆధారపడి ఉండవు. కొన్నిసార్లు ఈ కోరికలు మీ శరీరం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేస్తాయట. అవేంటో తెలుసుకుందాం రండి.

1. పిండి పదార్థాలు తినాలనిపించడం:

పీరియడ్స్ సమయంలో బ్రెడ్, పాస్తా లేదా బేక్ చేసిన తినుబండారాలు తినాలనిపించడం సాధారణమైన కోరిక. మీ శరీరం శక్తి కోసం అడుగుతోందని దీని అర్థం కావచ్చు. ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ నిర్మల ఎం. చెప్పిన ప్రకారం పీరియడ్స్ సమయంలో మనసును సంతోషంగా ఉంచే సెరోటోనిన్ అనే రసాయనం స్థాయిలు తగ్గుతాయి. దీని వల్ల శక్తి తగ్గి, మూడ్ మారిపోతుంది. పిండి పదార్థాలు సెరోటోనిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. అందుకే టోస్ట్ లేదా పాస్తా వంటివి తింటే హాయిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు వీటిని తినడం మంచిదే అయినప్పటికీ స్వీట్ పొటాటో, హోల్ గ్రెయిన్ టోస్ట్ లేదా ఓట్స్ వంటి సంక్లిష్ట పిండి పదార్థాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇవి మీ శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి.

2. తీపి తినాలనిపించడం:

కుకీలు, చాక్లెట్లు, కేకులు లేదా సోడా వంటి తీపి పానీయాలు తాగాలనిపించడం కూడా పీరియడ్స్ సమయంలో చాలా సాధారణమైన కోరిక. హార్మోన్ల మార్పుల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీని వల్ల ఇలాంటివి తినాలనే కోరిక విపరీతంగా ఉంటుంది. తీపి తింటే త్వరగా శక్తి వస్తుంది నిజమే కానీ రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి, తర్వాత మీరు మరింత అలసిపోయినట్లు అవచ్చు. చిరాకుగా లేదా బాధగా కూడా అనిపించవచ్చు. కాబట్టి తీపి తినాలనే కోరికను తీర్చుకోవడానికి తాజా పండ్లు, తేనె కలిపిన పెరుగు లేదా ఒక చిన్న ముక్క డార్క్ చాక్లెట్ తినేందుకు ప్రయత్నించండి.

తీపి తినాలనే కోరికతో ఇబ్బంది పడుతున్న యువతి
తీపి తినాలనే కోరికతో ఇబ్బంది పడుతున్న యువతి (PC: Canva)

3. చాక్లెట్ తినాలనిపించడం:

పీరియడ్స్ సమయంలో చాక్లెట్ తినాలనిపించకపోతే అది పీఎంఎస్సే కాదంటారు చాలా మంది! పీఎల్ఓఎస్ వన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం చాక్లెట్ తినాలనిపించడానికి ఒక కారణం ఉంది. చాక్లెట్‌లో మెగ్నీషియం ఉంటుంది. ఇది కండరాలను రిలాక్స్ చేయడానికి , మూడ్‌ను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంటే పీరియడ్స్ నొప్పిని తగ్గించడానికి , ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీ శరీరం సాధారణంగా చాక్లెట్ కోరుకుంటుంది. ఇలాంటప్పుడు వీలైతే పాల చాక్లెట్‌, తకువ చక్కెర , ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉండే డార్క్ చాక్లెట్ ఎంచుకోండి. లేదంటే మీరు గింజలు, విత్తనాలు , అవకాడో వంటి వాటిని కూడా తీసుకోవచ్చు.

4. ఉప్పుగా ఉండేవి తినాలనిపించడం:

చిప్స్, ఫ్రైస్ వంటి సాల్టెడ్ ఫుడ్ తినాలనిపిస్తే అది శరీరంలో నీటి సమతుల్యత లేకపోవడంతో అయి ఉండచ్చు. హార్మోన్ల మార్పుల వల్ల శరీరంలో నీరు నిలుపుకోవడం , ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత ఏర్పడటం వంటివి జరగడం వల్ల ఉప్పు తినాలనిపించవచ్చు. అప్పుడప్పుడు కొంచెం సాల్ట్ తినడం మంచిదే కానీ, ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం , అసౌకర్యం పెరుగుతుంది. ఇలాంటి కోరికలు వచ్చినప్పుడు వేయించిన గింజలు లేదా ఎయిర్-పాప్డ్ పాప్‌కార్న్‌తో మీ కోరిక తీర్చుకోండి.

5. చీజ్ లేదా పాల ఉత్పత్తులు తినాలనిపించడం:

పీరియడ్స్ సమయంలో పిజ్జా, చీజీ పాస్తా లేదా ఐస్‌క్రీమ్ తినాలనిపిస్తుందా? అయితే మీ శరీరం కాల్షియం కోసం వెతుకుతూ ఉండవచ్చు లేదా కడుపు నింపే, సంతృప్తినిచ్చే ఆహారాల ద్వారా ఓదార్పు పొందాలని చూస్తుండవచ్చు. పాల ఉత్పత్తులు కాల్షియం , విటమిన్ డికి మంచి మూలం. ఇవి మూడ్‌ను మెరుగుపరచడానికి, కండరాల నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. మీకు ఇష్టమైన పాల ఉత్పత్తులను మితంగా తీసుకోండి లేదా పీరియడ్స్ కోరికలను నియంత్రించడానికి పెరుగు లేదా ఇంట్లో చేసిన చీజ్ టోస్ట్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకోండి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.