పురుషులు, మహిళల్లో సంతాన లేమి సమస్యలకు కారణాలేంటో తెలుసా?-understanding the factors leading to infertility in men and women causes and solutions ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పురుషులు, మహిళల్లో సంతాన లేమి సమస్యలకు కారణాలేంటో తెలుసా?

పురుషులు, మహిళల్లో సంతాన లేమి సమస్యలకు కారణాలేంటో తెలుసా?

HT Telugu Desk HT Telugu

ఒక ఏడాది కాలం సంతానం కోసం ప్రయత్నించినా సఫలం కానట్టయితే సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్నట్టు నిర్ధారణకు రావొచ్చు. ఈ సంతానలేమి సమస్యలకు కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

పురుషులు, మహిళల్లో సంతాన లేమికి కారణాలు ఏంటి? (Photo by Toa Heftiba on Unsplash)

భారతదేశంలో సంతానలేమికి సంబంధించిన కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. పునరుత్పత్తి వ్యవస్థలో లోపాలు మగ లేదా ఆడవారిలో సంతానలేమికి దారితీస్తోంది. సంబంధిత కారణాలను ఇక్కడ తెలుసుకోండి. మీకు ఏవైనా సమస్యలు ఉంటే సంతానోత్పత్తికి సంబంధించిన వైద్య నిపుణుడిని సంప్రదించండి.

12 నెలల క్రమం తప్పకుండా సంభోగం చేసిన తర్వాత గర్భం దాల్చడంలో దంపతులు విఫలమైనప్పుడు వారు సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారని నిర్ధారిస్తారు. సంతానోత్పత్తిపై ప్రభావం చూపే కొన్ని అంశాలను పూణేలోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలో ఫెర్టిలిటీ కన్సల్టెంట్ అయిన డాక్టర్ కరిష్మా డాఫ్లే హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలకు కారణాలు

• పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), హైపర్‌ప్రోలాక్టినిమియా వంటి అండోత్సర్గ రుగ్మతలు చాలా ఎక్కువ ప్రోలాక్టిన్ ఉత్పత్తికి కారణమవుతాయి. ఇది రొమ్ము పాల ఉత్పత్తికి సహాయపడే హార్మోన్. అండోత్సర్గ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఇది కాకుండా థైరాయిడ్ సమస్యలు కూడా రుతుక్రమాన్ని ప్రభావితం చేస్తాయి. ఆహారపు అలవాట్లలో సమస్యలు కూడా సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తాయి.

• గర్భాశయ సమస్యలు, గర్భాశయంలోని పాలిప్స్, గర్భాశయ గోడలో క్యాన్సర్ రహిత కణితులు (గర్భాశయ ఫైబ్రాయిడ్లు) వంధ్యత్వానికి కారణం కావచ్చు. ఫెలోపియన్ ట్యూబ్‌ల పనితీరును ఈ ఫైబ్రాయిడ్లు ప్రభావితం చేస్తాయి. ఫలదీకరణం చెందిన అండం గర్భాశయంలో అమర్చకుండా నిరోధించవచ్చు.

• పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (PID) కారణంగా ఫెలోపియన్ ట్యూబ్ (సల్పింగైటిస్) వాపు వల్ల ఫెలోపియన్ ట్యూబ్ దెబ్బతినడం లేదా అడ్డుపడటం తరచుగా జరుగుతుంది. ఈ పీఐడీ లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు (STI), లేదా ఎండోమెట్రియోసిస్ కారణంగా కనిపిస్తుంది.

• ఎండోమెట్రియోసిస్.. అండాశయాలు, గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్‌ల పనితీరును ప్రభావితం చేస్తుంది. క్రమంగా వంధ్యత్వానికి కారణమవుతుంది.

• ప్రాథమిక అండాశయ లోపాలు, అండాశయాలు పనిచేయడం ఆగిపోయినప్పుడు, చిన్న వయస్సులో మెనోపాజ్ వచ్చినప్పుడు కూడా సంతానోత్పత్తి సామర్థ్యం కోల్పోతారు.

• క్యాన్సర్ సోకినప్పుడు రేడియేషన్, కీమోథెరపీతో సహా దాని చికిత్స సంతానోత్పత్తిని ప్రభావితం చేయవచ్చు.

పురుషుల వంధ్యత్వానికి కారణాలు

• మధుమేహం, ఊబకాయం, క్లామిడియా, గనేరియా, గవదబిళ్లలు లేదా హెచ్‌ఐవీ వంటి ఇన్ఫెక్షన్ల కారణంగా అసాధారణమైన స్పెర్మ్ ఉత్పత్తి వంధ్యత్వానికి దారితీస్తుంది.

• శ్రీఘ్ర స్ఖలనం, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి కొన్ని జన్యుపరమైన వ్యాధులు, వృషణంలో సమస్యలు, పునరుత్పత్తి అవయవాలకు గాయాలు వంటి నిర్మాణ సమస్యలు వంధ్యత్వానికి కారణం కావచ్చు.

• పురుగు మందులు, రసాయనాలు, ధూమపానం, ఆల్కహాల్, డ్రగ్స్, స్టెరాయిడ్స్, కొన్ని మందుల ద్వారా దుష్పరిణామాలు వంటి అంశాలు సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఆవిరి స్నానాలు లేదా బాగా వేడి నీళ్లతో స్నానాలు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఇవి స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తాయి.

• రేడియేషన్, కీమోథెరపీ, ఆల్కహాల్ వినియోగం వల్ల కూడా వంధ్యత్వం వస్తుంది.

సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొని విజయవంతంగా గర్భం దాల్చడానికి, చికిత్స ప్రణాళిక గురించి తెలుసుకోవడానికి దంపతులు తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం, వైద్య నిపుణులను సందర్శించడం చాలా అవసరం.