Ulava Pachadi: కొలెస్ట్రాల్ కరిగించే ఉలవల పచ్చడిని ఇంట్లో ఇలా చేసుకోండి, ఎంతో ఆరోగ్యం
Ulava Pachadi: ఒకప్పుడు ఉలవలను ఎక్కువగా వాడేవారు. కానీ ఇప్పుడు ఉలవలను వాడే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇక్కడ మేము టేస్టీ ఉలవల పచ్చడి రెసిపీ ఇచ్చాము. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

ఉలవలతో చేసే రెసిపీలు ఏవైనా కూడా ఆరోగ్యానికి మేలే చేస్తాయి. శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తూ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. పూర్వం ఉలవలతో అధికంగా వంటలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆధునిక తరంలో ఉలవలతో ఏం వండాలో కూడా తెలియడం లేదు. నిజానికి ఉలవలతో దోశల నుంచి పచ్చడి వరకు అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఉలవల పచ్చడి రెసిపీ ఇచ్చాము. దీన్ని అన్నంలోనే కాదు దోసెల్లో, ఇడ్లీలో తింటే అదిరిపోతుంది. ఇక ఉలవల పచ్చడి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
ఉలవల పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
ఉలవలు - అరకప్పు
మినప్పప్పు - ఒక స్పూను
పచ్చిశనగపప్పు - ఒక స్పూను
ఎండు మిరపకాయలు - పది
వెల్లుల్లి రెబ్బలు - పది
చింతపండు - ఉసిరికాయ సైజులో
పచ్చి కొబ్బరి - అర కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
ఇంగువ - పావు స్పూను
ఆవాలు - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
కరివేపాకులు - గుప్పెడు
ఉలవల పచ్చడి రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి అరకప్పు ఉలవలను వేసి బాగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూను నూనె వేసి పచ్చి శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి.
3. తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి. ఇంగువ వేసి వేయించుకోవాలి.
4. రుచికి సరిపడా ఉప్పును కూడా వేయాలి. ఇవన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేయాలి.
5. ఒక మిక్సీ జార్లోకి వేయించిన ఉలవలు, పచ్చి కొబ్బరి మిశ్రమం, చింతపండు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
6. ఇప్పుడు దీనికి తాళింపు పెట్టేందుకు స్టవ్ మీద మరో కళాయి పెట్టాలి.
7. అందులో రెండు స్పూన్ల నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు వేసి వేయించాలి.
8. దీన్ని ఉలవల పచ్చడిపై వేసుకోవాలి. అంతే టేస్టీ ఉలవల పచ్చడి రెడీ అయినట్టే.
9. వేడి వేడి అన్నంలో ఈ ఉలవల పచ్చడి కలుపుకొని తిని చూడండి... ఎంత అద్భుతంగా ఉంటుందో.
10. ఇడ్లీతో నంజుకున్నా, దోశెతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎంతో మందికి నచ్చే స్పైసీ పచ్చడి.
ఉలవలతో చేసే రెసిపీలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు వచ్చే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. తరచూ ఉలవలు తినేవారిలో మలబద్ధకం వంటి సమస్యలు రావు. గ్యాస్టిక్ సమస్యలు కూడా దూరం అవుతాయి. ఎందుకంటే ఉలవల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఎముకలను దృఢంగా మార్చేందుకు కూడా ఉలవలు సహాయపడతాయి. వీటి ధర కూడా సాధారణంగానే ఉంటుంది. కాబట్టి ఉలవలతో చేసే వంటకాలను నేర్చుకునే ప్రతి ఒక్కరూ తినాల్సిన అవసరం ఉంది. ఉలవలను నవధాన్యాలలో ఒకటిగా చెప్పుకుంటారు. ఎక్కువగా గుర్రాలకు, ఎద్దులకు దాణాగానే వాడుతున్నారు. కానీ వాటికన్నా మనుషులు తినడం వల్ల వీరికి ఎక్కువ ప్రయోజనాలు దక్కుతాయి.
సంబంధిత కథనం