దాదాపు ప్రతి ఇంటిలో వార్తాపత్రికలు ఉంటాయి. ఒక్కసారి చదివాక వాటిని పక్కన పడేస్తారు. అలా ఇంట్లో కుప్పల కొద్దీ పాత పేపర్లు పేరుకుపోతాయి. తాజా వార్తాపత్రిక ప్రజలకు ఎంత ముఖ్యమో, వార్తాపత్రిక పాతది అయ్యే కొద్దీ దాని విలువ తగ్గుతుంది. పాత వార్తాపత్రికలు ఇంటి మూలన పడి చెత్తగా మారి ఆ తర్వాత వ్యర్థాలుగా అమ్మడం మొదలవుతుంది. మీ ఇంట్లోని వార్తాపత్రికలతో సృజనాత్మకంగా వస్తువులను తయారుచేయవచ్చు.
ఇంటి గోడలను అలంకరించడానికి ఖరీదైన ఫోటో ఫ్రేమ్ లను కొంటాము. నిజానికి ఇంట్లో ఉన్న పాత న్యూస్ పేపర్లతోనే అందమైన ఫోటో ఫ్రేమ్స్ తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడానికి, మొదట అనేక వార్తాపత్రికలను తీసుకుని అన్నింటినీ చతుస్రాకారంలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చతురస్రాకార కాగితాన్ని తీసుకొని పెన్నుకు చుట్టి నిలువుగా మార్చుకోవాలి. ఫోటోలో కనిపించినట్టు అన్నింటినీ స్ట్రాల ఆకారంలో తయారుచేసుకుని పక్కనపెట్టుకోవాలి. ఒక కార్డ్ బోర్డ్ వీటిని నిలువుగా అతికించుకోవాలి. వాటిని కావాలంటే రంగులు చల్లుకోవచ్చు. ఆ ఫ్రేమ్ అంచులపై రెండో పొరలా పేపర్ స్ట్రాలను అతికించాలి. మధ్యలో ఫోటో పెట్టుకోవాలి. అంతే అందమైన ఫోటో ఫ్రేమ్ రెడీ అవుతుంది.
టీ కోస్టర్ అంటే టీ కప్పులు పెట్టుకునే ప్లేటు లాంటిది. దీన్ని పాత వార్తాపత్రికలతో చాలా అందంగా తయారుచేసుకోవచ్చు. దీని కోసం కూడా ముందుగా చెప్పినప్పుడు పేపర్ స్ట్రాలను తయారుచేసి పెట్టుకోవాలి. ఒక పేపర్ స్ట్రా తీసుకుని గుండ్రంగా చుట్టుకోవాలి. దాని చుట్టు ఫెవికాల్ రాసి మరొక స్ట్రాను చుట్టాలి. ఇలా మీకు ప్లేటు ఆకారం వచ్చే వరకు చుట్టుకోవాలి. మీకు ఏ సైజులో వరకు కావాలో అంతవరకు ఈ స్ట్రాలను చుట్టుకుంటూ రావాలి. చివర్లో ఫెవికాల్ అతికించి ఆరబెట్టాలి. దీనికి మీకు నచ్చిన రంగులను వేసుకోవచ్చు.
పాత వార్తాపత్రికల సాయంతో అందమైన గిన్నెలను తయారుచేయవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా పాతా వార్తాపత్రికలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. వాటిని ఒక గిన్నెలో వేసి తగినంత నీళ్లు వేసి నానబెట్టాలి. అవి పూర్తిగా ముద్దలా అవ్వాలంటే ఒకరోజంతా అలా వదిలేయాలి. తరువాత చేత్తోనే ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా పిండి లేదా గోధుమపిండి వేసి గట్టి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ముందుగా నీటిలో నానబెట్టిన ముద్ద చేసిన పేపర్ పేస్టును వేసి బాగా కలపాలి. ఇప్పుడు మీరు ఏ ఆకారంలో గిన్నె కావాలనుకుంటారో ఆ గిన్నెను ఎంచుకోండి. దాన్ని బోర్లా పెట్టి ఒక సన్నని కవర్ పెట్టాలి. ఆ కవర్ పై గోధుమ పిండి పేపర్ ముద్ద కలిపిన మిశ్రమాన్ని చేత్తోనే మెత్తాలి. గిన్నె ఆకారంలో చక్కగా అద్దాక పూర్తిగా ఎండిపోయేదాకా వదిలేయాలి. కనీసం రెండు రోజుల పాటూ అలా వదిలేయాలి. ఇప్పుడు మెల్లగా ఆ గిన్నెను విడదీయాలి. అంతే అందమైన పేపర్ గిన్నె రెడీ అవుతుంది. దీన్ని డ్రాయింగ్ రూమ్ లో అందంగా పెట్టుకోవచ్చు. దీనిలో పువ్వులు, పండ్లు వంటివి పెట్టుకోవచ్చు.
టాపిక్