Laws of personal growth: మీ ఎదుగుదలకు మీరే చట్టం తయారు చేస్కోండి.. ఆ చట్టం ఇలాగుండాలి!
Laws of personal growth: మీకూ ఉందా ఒక వ్యక్తిగత చట్టం? లేకపోతే ఒకటి తయారు చేసుకోండి. దాంట్లో మీరు పాటించాలనుకున్న సూత్రాలు రాసుకోండి. దాన్ని ఉల్లంఘించిన ప్రతిసారి లెక్కించుకోండి. మీరు వ్యక్తిగతంగా ఎదగడానికి ఇది సాయపడుతుంది.
జీవితంలో ఎదగడం అంటే డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు. మానసికంగా ఎదగడం, భావోద్వేగాల విషయంలో పరిపక్వత రావడం, చిన్న పెద్దా సమస్యలకు తేడా తెలియడం.. ఇలా చాలా ఉంటాయి. అన్నీ సాధించిన మనిషి, అన్నీ తెలిసిన మనిషి నిజ జీవితంలో ఉండరు. మనం అన్నీ సాధించేశాం అని విజయ గర్వంతో ఉప్పొంగిపోతే కష్టపడి కట్టుకున్న జీవితం అనే కోట కుప్ప కూలుతుంది. అందుకే ఆనందమైన, సంపూర్ణమైన జీవితం అనుభవించాలంటే.. మీకంటూ కొన్ని నియమాలు మీరే పెట్టుకోవాలి. మీరే మీకోసం ఒక వ్యక్తిగత చట్టం తయారు చేసుకోండి. అందులో మీరు పొందుపర్చిన సూత్రాలన్నీ మీరు తప్పకుండా పాటించాలి. అలాంటి కొన్ని సూత్రాలేంటో చూడండి.
వ్యక్తిగత ఎదుగుదలకు సూత్రాలు:
1. కోపం, ద్వేషం, బాధ.. ఏవైనా క్షణికం అని తెల్సుకోండి.
2. ఏం జరిగినా స్వీకరించడం నేర్చుకోండి.
3. మీరు ఒక మాట చెప్పారంటే దానికి కట్టుబడి ఉండండి.
4. మీముందు ఏం జరుగుతున్నా దాన్నుంచి కొత్త విషయం ఏదైనా నేర్చుకోవచ్చేమో చూడండి.
5. ప్రతి రోజూ చిన్నదో పెద్దదో ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోండి.
6. ప్రతిసారీ ఒప్పు చేయాలనే ఆలోచన నుంచి బయటకు రావడం. తప్పులు చేయడం పెద్ద తప్పు కాదని తెలియాలి. తప్పుల నుంచి నేర్చుకోవాలి. తెలియక ఏదైనా పొరపాటు చేస్తే అది తప్పుకాదు.
7. ప్రతి ఒక్కరికీ సరిహద్దులుంటాయని గుర్తించుకోండి. వాటికి గౌరవం ఇవ్వండి. ఎదుటి వ్యక్తి వయసుతో సంబంధం లేకుండా వాళ్లకంటూ కొన్ని పరిధులుంటాయి. కొడుకు, కోడలు, కూతురు, భర్త, భార్య, బెస్ట్ ఫ్రెండ్.. ఎవరైనా సరే.. వాళ్ల పరిధులను గౌరవించండి.
8. ఆటలు ఆడటం, పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం.. మర్చిపోకండి. వీటికి వయసుతో సంబంధం లేదు.
9. సృజనాత్మకత ఉపయోగించి కొత్తగా ఏమైనా తయారు చేయడం.
10. మీకొచ్చే ప్రతి ఆలోచన గుడ్డిగా నమ్మకుండా.. ప్రతి దాన్ని వంద సార్లు ప్రశ్నించుకోవడం.
11. మీరు నమ్ముతున్న ప్రతిదీ నిజమనే ఆలోచన నుంచి బయటకు రావడం.
12. మీ అహంకారాన్ని తగ్గించుకోండి.
13. ప్రతి సంఘటను ఉండే మరో వాస్తవిక కోణం గురించి ఆలోచించగలగడం.
14. మిమ్మల్ని ఎవరైనా అపార్థం చేసుకుంటే.. అది చాలా సర్వ సాధారణం అని తెల్సుకోండి. దాని గురించి అతిగా ఆలోచించకండి.
15. ప్రతిసారీ ఎదుటివ్యక్తిని ఆనందపర్చాలని చూడకండి. దానికోసం అన్నింటికీ తల ఊపకండి. అప్పుడప్పుడు ఎదుటివ్యక్తి మీ వల్ల నిరాశపడటం సహజం అని తెల్సుకోండి.
16. మీవల్ల ఏ పనైనా కాకపోతే, ఎట్టి పరిస్థితుల్లో ఇక కాదని తెలిస్తే విరమించుకోండి. మీవల్ల కాదని చెప్పండి. నో చెప్పడం నేర్చుకుంటే సగం సమస్యలు మీకు రానే రావు.
17. మీకోసం మీరు కొంత సమయం కేటాయించండి. మీతో మీరు ఆనందంగా గడపండి.
18. నేనిలాగే ఉంటాను, నా చుట్టూ ఉన్నవాళ్లు ఇలాగే మసులు కోవాలి.. ఇదే తింటా.. ఇది మాత్రమే తాగుతా..ఈ పనులు మాత్రమే చేస్తా..ఇలాంటి నియమాలు పనికి రావు. ఏ మార్పునైనా సులభంగా ఆహ్వానించడం నేర్చుకోండి. మార్చుకోవడానికి అలవాటు పడ్డవారు ఏమయినా సాధిస్తారు.
వ్యక్తిగతంగా ఎదగడానికి మీకంటూ కొన్ని నియమాలు పెట్టుకుని ఒక చట్టం తయారు చేసుకుండి. దాన్ని ఉల్లంఘించిన ప్రతిసారీ లెక్కపెట్టుకోండి. ఎక్కడైనా రాసుకోండి. మీలో చాలా మార్పు గమనిస్తారు.