Tuesday Motivation : డోంట్ స్ట్రెస్ ద స్ట్రెస్.. మీకు అర్థమవుతుందా?-tuesday motivational quote on stop worrying it creates more stress ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Tuesday Motivational Quote On Stop Worrying, It Creates More Stress.

Tuesday Motivation : డోంట్ స్ట్రెస్ ద స్ట్రెస్.. మీకు అర్థమవుతుందా?

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 09, 2022 06:51 AM IST

Tuesday Motivation : ఏ విషయం గురించైనా ఎక్కువగా ఆలోచిస్తే.. అది మనల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. అంతేకాకుండా ఈ ఆందోళన.. మన పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. ఎక్కువగా ఆలోచించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమి ఉండదు. పైగా అన్ని నష్టాలే ఉంటాయి. కాబట్టి డోంట్ స్ట్రెస్ ద స్ట్రెస్.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Tuesday Motivation : అనవసరమైన ఆందోళనలు, అతిగా ఆలోచించడం అనేవి ఓ మనిషిని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తాయి. పరిస్థితులు మెరుగుపడటం అటుంచితే.. పూర్తిగా దిగజారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి వీలైనంత ఒత్తిడిని తగ్గించుకోండి. ఈ ఒత్తిడి, ఆందోళన మిమ్మల్ని మానసికంగానే కాదు.. శారీరకంగాను ఇబ్బందులకు గురిచేస్తుంది. తెలియకుండానే మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు.

పైగా ఒత్తిడి అనేది మీ ప్రశాంతతను దూరం చేస్తుంది. అంతేకాకుండా మీకు ఎక్కువ నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది. మీ ఆలోచనా సామర్థ్యాలను కూడా తగ్గిస్తుంది. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీరు ఇబ్బందులు పడుతారు. ఆ పరిస్థితుల కారణాల వల్ల మీరు వాటిని ఎదుర్కోలేకపోవచ్చు. తత్ఫలితంగా మీకు గుండెజబ్బులు కూడా వచ్చే అవకాశముంది.

మీలో ఆ పరిస్థితులను అధిగమించే సామర్థ్యం ఉన్నా.. ఈ ఒత్తిడి మిమ్మల్ని బాగా డౌన్ చేసేస్తుంది. ఒక్కోసారి మీ సామర్థ్యాలకు మీరే దూరం అవ్వాల్సి వస్తుంది. ప్రపంచంలో ఏ ఒక్కరికైనా మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. దానికంటే విలువైనది ఏమీ లేదు. ఎంత డబ్బున్నా.. ప్రశాంతంగా లేకుంటే.. మీరు ఒక్కపూట కూడా హాయిగా తినలేరు.. పడుకోలేరు.

కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే మార్గాల గురించి అన్వేషించాలి. ఏ విషయాలు మిమ్మల్ని ఎక్కువ ఒత్తిడికి గురిచేస్తేయో వాటికి దూరంగా ఉండండి. చుట్టూ ఉన్నవారే మీకు ఒత్తిడిని ఇస్తుంటే.. వారి నుంచి బ్రేక్ తీసుకోండి. లేదా దూరం పెట్టండి. వీలైనంత ఎక్కువగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. మ్యూజిక్ మీకు హాయినిస్తే దానిని వినండి. లేక గార్డెనింగ్ చేస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటే అదే చేయండి. మీకు ఏ పని చేస్తుంటే ఇబ్బంది లేకుండా.. మెదడుకు ప్రెజర్​ లేకుండా ఉంటుందో వాటిని చేసేందుకు ఎప్పుడు వెనుకాడవద్దు.

భవిష్యత్తును మీరు మార్చలేదు. అలాంటిది దాని ఫలితాల గురించి ఇప్పుడే చింతిస్తూ.. ఇలా ఒత్తిడిని పెంచుకుంటుంటే.. మీ పరిస్థితులు కూడా మీ ఆధీనంలో ఉండవు. కాబట్టి ఆ విషయాల గురించి ఇప్పుడే ఆలోచించి సమయాన్ని వృథా చేసుకోకండి. పైగా ఈ ఆలోచనలు ప్రస్తుతం ఉన్న మీ సంతోషాన్ని దూరం చేస్తుంది.

సమస్యలనేవి జీవితంలో ఓ భాగం. వాటినుంచి మనం నేర్చుకోవాలే తప్పా.. ఏదో జరిగిపోతుందని అనవసరమైన ఒత్తిడికి గురవడం చాలా మూర్ఖమైన చర్య. నిరాశ లేదా ఇబ్బందులు లేని జీవితం అర్థరహితం. ఈ విషయాన్ని ముందే అంగీకరించడం నేర్చుకోండి. ఏదొకరోజు మీ కష్టానికి తగిన ప్రతిఫలం కచ్చితంగా లభిస్తుందని గుర్తించుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్