Tuesday Motivation : మూర్ఖత్వం ఆలోచనల్లోనే ఉంటుంది.. మీ కోసం స్వచ్ఛమైన ఉప్పు కథ
Tuesday Motivation Telugu : మన ఆలోచనలే మనల్ని మూర్ఖులుగా సమాజానికి చూపిస్తాయి. కొన్నిసార్లు ఎదుటివారు చెప్పింది వినిపించుకోకుండా ప్రవర్తిస్తే అందరి ముందు తెలివిలేని వారిగా అవుతాం.
ఒక ఊరిలో ఓ గురువు చిన్న ఆశ్రమం పెట్టుకున్నాడు. అతనికి ఐదుమంది శిష్యులు. వారు తీర్థయాత్రకు వెళ్లేందుకు ప్రణాళిక వేసుకున్నారు. దారిలో భోజనం చేసేందుకు వంటలు చేయాలనుకున్నారు. దీంతో గురువు ఓ శిష్యుడిని పిలిచి.. వంట సామను కోసం పంపించాడు. అయితే వంట కోసం స్వచ్ఛమైన ఉప్పు కొని తీసుకురమ్మని చెప్పాడు. దీంతో శిష్యుడు దుకాణాదారుడి దగ్గరకు వెళ్లి మా గురువు గారు స్వచ్ఛమైన ఉప్పు తీసుకు రమ్మని చెప్పారని.., ఇవ్వమని అడిగాడు.
అయితే దుకాణాదారుడు మాత్రం ఉప్పులో అంతా ఒకటేనని సమాధానం ఇచ్చాడు. లేదు లేదు.. మా గురువు స్వచ్ఛమైన ఉప్పు మాత్రమే కొనమన్నారని బదులిచ్చాడు. లేదంటే వేరే దుకాణం వెళ్లిపోతానని తెలిపాడు. దీంతో షాపు యజమాని మాట్లాడుతూ.. అయ్యా, నన్ను క్షమించండి, మీ గురువుగారు సరిగ్గా చెప్పారు, మీరు ఉప్పును ఉడికించే ముందు బాగా కడిగి వడపోసి వాడండి.. అని చెప్పాడు.
సరేనని ఉప్పు తీసుకుని బయల్దేరాడు శిష్యుడు. దారిలో నది దాటేప్పుడు ఉప్పును ఇక్కడే కడిగితే గురువు గారు మెచ్చుకుంటారని, స్వచ్ఛమైన ఉప్పును తీసుకెళ్లొచ్చు అనుకున్నాడు. ఉప్పు బ్యాగు తీసి నదిలో ముంచాడు. దీంతో ఉప్పు అంతా కరిగిపోయింది. నానబెట్టిన ఉప్పు కరిగిపోతుందని గ్రహించకుండా ఆశ్రమానికి వెళ్లాడు. ఉప్పు ఎక్కడ అని గురువు అడగ్గా.. స్వచ్ఛమైన ఉప్పును తీసుకు వచ్చేసరికి సమయం అయిందని చెప్పాడు.
తీసి బ్యాగు చూపించాడు. స్వచ్ఛమైన ఉప్పు కోసం బ్యాగును నదిలో ముంచానని తెలిపాడు. మూర్ఖుడైన గురువు కూడా నువ్వు చేసింది సరియైనదే శిష్యా అని మెచ్చుకున్నాడు. అయితే ఉప్పు ఎక్కడికి పోయింది? అని ప్రశ్నించాడు. నీళ్లలో కరిగిన ఉప్పు నీళ్లతో కలిసి పోయిందని, స్వచ్ఛమైన ఉప్పు ఎక్కడికి పోయిందో అని ఆశ్చర్యపోయాడు. ఇతర శిష్యులు కూడా ఆలోచించడం ప్రారంభించారు. అందరూ మూర్ఖంగా, తెలివిలేనివారిగా ఆలోచిస్తూ కూర్చొన్నారు.
అందుకే ఏదైనా విషయంలో కాస్త వివేకంతో ఆలోచించాలి. ఎదుటివారు చెప్పింది వినిపించుకోవాలి. జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేప్పుడు ఎదుటివారి మాటకు విలువ ఇవ్వాలి. వారు చెప్పింది మెుత్తం పాటించాల్సిన పనిలేదు. మీకు ఏది ఉపయోగపడుతుందో చూసుకుంటే సరిపోతుంది. మూర్ఖంగా ఆలోచిస్తే ఎప్పటికైనా నష్టపోయేది మీరే.
చెప్పేవారు లేక చెడిపోవడం దురదృష్టం..
చెప్పేవాళ్లు ఉండి కూడా చెడిపోవడం మూర్ఖత్వం..