కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు.. మనం కూడా వారిలా ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నామని అనుకుంటారు. మీరు కూడా అలా ఉండాలని కోరుకుంటారు. పేద, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ప్రపంచంలో తామేంటో నిరూపించుకున్న వారు అనేక మంది. ఇలా మన ముందు ఎన్నో విజయగాథలు ఉన్నాయి. ఇవి రాత్రికి రాత్రే విజయగాథలు కావు. అవిశ్రాంతంగా శ్రమించి విజయం సాధించిన వారే అందరు. దానిని స్ఫూర్తిగా తీసుకుని కృషి ద్వారా విజయం వైపు నడవాలి. అప్పుడే మీరంతా.. అందరికీ ఆదర్శం అవుతారు.
విజయాన్ని డబ్బు, కీర్తితో కొనలేం. మరి గెలుపు రావాలంటే ఏం చేయాలి? కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. జీవితంలో విజయవంతమైన కొంతమంది వ్యక్తుల అలవాట్లు కూడా అవే. ఈ అలవాట్లు మీ జీవితంలో మార్పులను తెచ్చి, మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తాయి.
ప్రపంచంలో తమ లక్ష్యాలను చేరుకున్న విజయవంతమైన వ్యక్తుల సాధారణ అలవాటు ఉదయాన్నే మేల్కొనడం. కానీ సాధారణంగా ఈ రోజుల్లో ఆలస్యంగా నిద్రించడానికి, ఆలస్యంగా మేల్కొనడానికి ఇష్టపడతారు. అయితే వేకువజామున లేచిన వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం వస్తుంది. ఎందుకంటే వారి దినచర్య అలా ప్లాన్ చేసుకుంటారు.
క్రమశిక్షణ, సమయపాలన రెండూ చాలా శ్రమతో మాత్రమే సాధ్యమవుతాయి. అయితే ఈ అలవాటు ఒక్కసారి అలవాటైతే తర్వాత పోదు. ఈ అలవాటు ఉన్నవారు ఏదైనా పెద్ద పనిని చాలా సులభంగా చేయగలరు. సరైన దినచర్య చేయడం ద్వారా జీవితంలో క్రమశిక్షణ, సమయపాలన పాటించవచ్చు. మీరు ప్రారంభించిన మంచి అలవాట్లను ఆపకుండా జాగ్రత్త వహించండి.
ప్రపంచంలో ఇప్పటికీ చాలా మంది ధ్యానానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. జీవితంలో విజయం సాధించిన వ్యక్తులు కూడా తమ రోజులో కొంత సమయాన్ని ధ్యానం కోసం కేటాయిస్తుండడమే దీనికి ఉదాహరణ. మీ జీవితంలో కొంత సమయాన్ని ధ్యానం కోసం కేటాయించండి. అది మీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. పది నిమిషాల నుండి గంట వరకు ఎంత సమయం అయినా ధ్యానం చేయవచ్చు. ఇది మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి, విజయాన్ని సాధించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి తమ సమయాన్ని వెచ్చించే వారు విజయాల మెట్లు ఎక్కగలరు. బిజీ లైఫ్, బయట సమయం గడపడం నేటి టైమ్ పాస్. కానీ దీనికి స్పష్టమైన సరిహద్దులు ఉండాలి. విరాట్ కోహ్లీలాంటి గొప్ప గొప్ప ఆటగాళ్లే కుటుంబంతో గడిపేందుకు సమయం ఇస్తుంటారు. వారు కావాలనుకుంటే ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు. కానీ కుటుంబంతో ఉండే వారికి విలువలు ఎక్కువగా తెలుస్తాయి.
ఒక గొప్ప ప్రయాణాన్ని అనేక గమ్యస్థానాలుగా విభజించాలి. అంటే చిన్న లక్ష్యాలను పెట్టుకుని ముందుకు వెళ్లాలి. అప్పుడే వాస్తవానికి చివరి గమ్యస్థానానికి చేరువ అవుతాం. చాలా మంది జీవితంలో పెద్ద లక్ష్యాల కోసం ప్రయత్నిస్తారు. కానీ ఆ లక్ష్యాన్ని దశలుగా విభజించి, ఆ ప్రతి దశను జయించటానికి ప్రయత్నించండి. ఇది గమ్యాన్ని మనకు చేరువ చేస్తుంది. ఆ చిన్న విజయాలు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి.
ఈ ప్రపంచంలో మన లోపాలను చూసి పశ్చాత్తాపపడుతాం. కానీ అది ఎప్పుడూ విజయాన్ని తెచ్చే అలవాటు కాదు. నిరాశ, నిస్పృహ కలగడం సహజం. కానీ అలాంటి సందర్భాలలో జీవితంలో ఇప్పటివరకు సాధించిన విజయాల గురించి ఆలోచించండి. దానికి కృతజ్ఞతతో ఉండండి.
మీకు కల ఉంటే అది నిజం అయ్యే వరకు ఫైట్ చేయండి. కలలను అర్ధంతరంగా వదులుకునే వారు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. జీవితంలో సంక్షోభాలు, కష్ట సమయాలు ఉంటాయి. అయితే తప్పకుండా వెళ్లిపోతాయి. మంచి రోజులు వస్తాయి. మీరు కలలను వదులుకోనంత కాలం, మీరు విజయ మార్గంలో నడుస్తున్నారని అర్థం.