Tuesday Motivation : నీ బాధలే.. వారధి అయితే.. గెలుపు నీ సొంతం కాదా
Tuesday Motivation : జీవితంలో కష్టాలు కామన్.. వాటిని ఎదురించిన్నోడే విన్నర్. అయ్యో.. నాకే ఇన్ని సమస్యలు అని తల పట్టుకుంటే.. మీ జీవితాంతం అంతే. పక్కవాడు ఎదుగుతాడు మీరు అక్కడే ఉండిపోతారు.
మనిషి పుట్టుకే ఏడుపుతో మెుదలవుతుంది. చావు కూడా ఏడుపుతోనే ముగుస్తుంది. మధ్యలో వచ్చే చిన్న చిన్న కష్టాలకే కుంగిపోతే ఏం సాధించలేవు. మనిషి పుట్టుకే కష్టం.. అలాంటిది జీవితంలో వచ్చే చిన్న చిన్న బాధలకు అక్కడే ఉండిపోతే.. జన్మకు అర్థం ఉండదు. కష్టాలు లేని మనిషి ఉండడు.. నీరు లేని సముద్రం ఉండదు. చిన్న చిన్న విషయాలకే తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారు ఓ చిన్న చీమ నుంచి చాలా విషయాన్ని నేర్చుకోవచ్చు. చీమకు ఆహారాన్ని తెచ్చుకునేప్పుడు కష్టం వస్తే.. ఎవరినీ సాయం కోసం అడుక్కోదు. తనకు తానే.. సాయం చేసుకుంటుంది. ముందుగా ఆ విషయం ఏంటో చూద్దాం..
మీరు చాలా సార్లే చీమలను పరిశీలించి ఉంటారు. ఏదైనా ఆహారాన్ని తీసుకునిపోయేప్పుడు.. ఒంటరిగానే వెళ్తుంది. తనకంటే పదింతలకు మించి బరువు ఉన్న ఆహారాన్ని తీసుకెళ్తుంది చీమ. అలాగని.. అక్కడే వదిలేసి పోదు.. తన గమ్యానికి కచ్చితంగా తీసుకెళ్తుంది. ఇలా ఆహారాన్ని తీసుకెళ్లే క్రమంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. సరిగా పరిశీలిస్తే.. చీమ ఆహారంలో తీసుకుని వెళ్లే సమయంలో మార్గంలో ఏదైనా పగుళ్లు కనిపిస్తే ఆగిపోతుంది. తర్వాత తన దగ్గర ఉన్న ఆహారాన్ని ఆ పగుళ్ల మీదకు నెడుతుంది.
తర్వాత అదే ఆహారంపై నుంచి అవతలి వైపు వెళ్తుంది. ఇక తన ఆహారాన్ని అటువైపుగా లాక్కుంటుంది. ఇంత చిన్న చీమనే.. ఎంతో భారంతో మోసుకెళ్లే ఆహారాన్ని వారధిగా చేసుకుంది. కష్టం వచ్చింది కదా.. అని అక్కడే వదిలేసి వెళ్లిపోదు. గమ్యం కోసం వారధి కట్టుకుంది. చీమ వెళ్లడం కూడా క్రమశిక్షణగా వెళ్తుంది.
అలాంటిది మనిషి ఎన్నో గొప్ప విషయాలు చేయోచ్చు. బాధలనే వారధిగా చేసుకుంటే.. మీరే విజేత అవుతారు. అలానే ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసం ఉంటే.. జీవితంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా సులువుగానే అధిగమించవచ్చు. చీమ జీవితం కూడా మనిషికి అదే పాఠం చెబుతుంది. బాధలు తొలగాలంటే.. చూస్తూ కూర్చొంటే కాదు.. వాటితో పోరాడితేనే కుదురుతుంది. లేదంటే.. బాధలు అనే పగుళ్లలో జీవితం అంతమైపోతుంది. ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. గెలవాలంటే.. ముందు ప్రయత్నం మెుదలవ్వాలి.. దారిలో అడ్డంకులు వస్తే ఎదురించాలి.. సృష్టిలో పోరాటం చేయకుండా ఏ జీవీ బతకదు.