Tuesday Motivation : ఉచిత సలహాలిచ్చేవారిని పక్కన పెట్టండి.. మీ గోల్స్ కాదు..
లైఫ్‌లో ఏదో సాధించాలనే గోల్ మీకుంటుంది. దానికోసం మీరు చేయాల్సింది చేస్తుంటారు. కానీ ఆ సమయంలో కొందరు వచ్చి ఉచిత సలహాలు ఇస్తారు. అవన్ని నువ్వు చేయలేవు.. నీతోని కాదు.. మనలాంటి వాళ్లు చేయగలరా అని వెనక్కి లాగేస్తుంటారు. అలాంటివారికి మీ గోల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీ గోల్ రీచ్ అవ్వడానికి మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు.
Tuesday Motivation : మీరు ఏదైనా సాధించాలని ప్రయత్నించినప్పుడల్లా.. చాలా మంది వచ్చి అడగకుండానే మీకు ఉచిత సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. లేదంటే మీ లక్ష్యాన్ని సాధించలేరు అని మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. మీరు విజయాన్ని సాధించినా.. వారు మాత్రం హ్యాపీగా ఉండరు. అలా హ్యాపీగా ఉండేవారు అయితే మిమ్మల్ని ఇలా నిరుత్సాహపరచరు. పైగా వారు జీవితంలో ఏమి సాధించలేక.. ఏదో సాధించాలనుకున్న మిమ్మల్ని చూసి అసూయతో ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వొచ్చు.
అలాంటప్పుడు మీరు ఏమి చేయాలంటే.. పనిపట్ల మీ అంకితభావాన్ని కొనసాగించాలి. ఎందుకంటే వారు మిమ్మల్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారేమో. మీరు సక్సెస్ అవ్వకూడదని చూస్తున్నారేమో. కాబట్టి మీరు వారి మాటాల మీద దృష్టి పెట్టకూడదు. మీ విజన్‌తో మీరు ముందుకు వెళ్లిపోవడమే. ఎవరైనా మంచి చెప్తే తీసుకోవచ్చు కానీ.. చెడు చెప్తుంటే తీసుకోవడం మీకు, మీ విజయానికి కూడా కరెక్ట్ కాదు. మీ గోల్ రీచ్ అవ్వడానికి మీరు ఏమి చేయగలరో మీకన్నా బాగా ఎవరికి తెలియదు. కాబట్టి మీ మీద మీరు నమ్మకముంచండి.
పోని మీకు ఉచిత సలహాలు ఇచ్చేవారు మీ బాధ్యతలు ఏమైనా తీసుకుంటారా అంటే లేదు. అయినా కూడా వారు తమ అభిప్రాయాలతో మిమ్మల్ని వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తారు. లేదంటే వాళ్లు ప్రయత్నించి ఓడిపోయి ఉండొచ్చు. వాళ్లు సాధించలేదు కాబట్టి.. మీరు కూడా సాధించలేరు అని చెప్పే అవకాశం కూడా ఉంది. నావల్లే కాలేదు.. నీవల్ల ఏమి అవుతుందనే భావన కూడా అయి ఉండొచ్చు. బలవంతుడు సాధించలేనిదానిని.. బలహీనుడు సాధించగలడు. దీనిని ఎప్పుడూ మరచిపోకండి. బలవంతుడనే పేరున్న వాడు మాత్రమే ఎప్పుడూ సక్సెస్ అవ్వడు. కష్టపడి పైకి వచ్చే బలహీనుడు కూడా సక్సెస్ అవుతాడు.
కాబట్టి అలాంటి టాక్సిక్ వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది మీకు వ్యక్తిగత శాంతిని ఇవ్వడమే కాకుండా.. మీ గోల్‌పై మీరు ఫోకస్ చేసేలా సహాయం చేస్తుంది. అవును మీ గోల్ రీచ్ అవ్వడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. దేనిని సాధించడానికి ప్రయత్నించినా.. సమస్యలు అనేవి కామన్. ఆ సమస్యలు వచ్చినప్పుడు వారు చెప్పింది నిజమే కదా అని ఆగిపోవడం కాదు. వాటిని అధిగమిస్తే.. మీరు సక్సెస్ అవుతారనే విషయం మీరు గుర్తించుకోవాలి. మీరు సాధించలేరనే వారి చులకన భావాన్ని మీరు తీసేయ్యాలి.
మీ కలల విషయంలో ఎదుటివ్యక్తులు చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చోంటే.. ఎప్పటికీ మీరు విజయం సాధించలేరు. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ విషయం గురించైనా ఆలోచించడం మానేయండి. మీ కలలను మీరు కూడా కనలేకపోతే.. ఇంకెవరు కంటారు. ఇంకెవరు వాటిని సాధిస్తారు. మీ లక్ష్యాలే మీకు ముఖ్యం. వాటికోసం కష్టపడండి. ఎవరో ఏదో అన్నారని ఆగిపోకండి.
సంబంధిత కథనం
టాపిక్